Friday, July 12, 2019

Pak extends till Jul 26 its airspace ban along eastern border with India


జులై 26 వరకు సరిహద్దుల్లో విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాక్
పాకిస్థాన్ తూర్పు ప్రాంతంలో గల భారత్ సరిహద్దుల్లోని తమ గగనతలంపై విమాన రాకపోకలపై నిషేధాజ్ఞల్ని ఆ దేశం పొడిగించింది. శుక్రవారం ఈ మేరకు పాక్ పౌర విమానయాన అధికార వర్గాలు (సీఏఏ)  ప్రకటించాయి. పాకిస్థాన్ ఈ విధంగా నిషేధాన్ని విధించడం ఇది అయిదోసారి. జమ్ముకశ్మీర్ లోని పుల్వామాలో 46 మంది సీఆర్ పీఎఫ్ సిబ్బందిని ఉగ్రవాదులు బాంబు దాడిలో కబళించిన నేపథ్యంలో పెద్దఎత్తున భారత్ వైమానిక దళం (ఐఏఎఫ్) పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడుల (సర్జికల్ స్ట్రయిక్స్) కు దిగింది. ఫిబ్రవరి 26న పాక్ లోని బాలాకోట్ లోగల ఉగ్రతండాల్ని(జేఈఎం) ఐఏఎఫ్ భస్మీపటలం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాకిస్థాన్ తూర్పున భారత్ తో గల సరిహద్దు గగనతలంలో విమాన రాకపోకలపై నిషేధాజ్ఞల్ని జారీ చేసింది. ఉభయ దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుందని సీఏఏ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతవరకు ఆ దిశగా పురోగతి ఏదీ లేదని తెలిపాయి. అయితే కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు హాజరవుతున్న భారత ప్రధాని మోదీకి వీవీఐపీ కేటగిరీ కింద వెసులుబాటు కల్పించింది. తమ గగనతలంపై నుంచి ఆయన ప్రయాణించే విమానానికి పాక్ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. కానీ ప్రధాని మోదీ విమానం పాక్ గగన తలం నుంచి కాకుండా వేరే మార్గంలో కిర్గిస్థాన్ చేరింది. అంతకుముందు మే21న బిష్కెక్ లో విదేశాంగ మంత్రుల భేటీకి బయలుదేరిన అప్పటి మంత్రి సుష్మాస్వరాజ్ విమానానికి పాక్ గగనతల ప్రవేశానికి ఇదే విధంగా ఆ దేశం ప్రత్యేక అనుమతినిచ్చింది. భారత ప్రభుత్వం తమ గగనతలంలో విమాన రాకపోకలకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు పాక్ పౌర విమానయాన శాఖ మంత్రి షారూక్ నుస్రరత్ తెలిపారు. అయితే తొలుత భారత్ సరిహద్దుల్లోని తమ వైమానికదళ యుద్ధ విమానాల మోహరింపును ఉపసంహరించుకుంటేనే పాక్ గగనతలంలో నిషేధాజ్ఞల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.  

No comments:

Post a Comment