Saturday, July 6, 2019

Australia in struggling to chage 326 target, south africa in fight back


ఆస్ట్రేలియాను కంగు తినిపించిన దక్షిణాఫ్రికా
§  సెమీస్-1: భారత్ x న్యూజిలాండ్  §  సెమీస్-2: ఆస్ట్రేలియా x ఇంగ్లాండ్
కంగారూల జట్టు ఆస్ట్రేలియాపై కొదమసింహలా పోరాడిన దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో చిరస్మరణీయమైన విజయాన్ని సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 మాంచెస్టర్ ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో శనివారం జరిగిన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ నం.45 లో సఫారీల జట్టు టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 భారీ పరుగుల్ని చేసింది. జట్టు కెప్టెన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయిన ఫాప్ డూప్లెసిస్(100) సెంచరీ సాధించాడు. రస్సీ వాండర్ సన్(95) ఆసిస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఓపెనర్లు అడెన్ మర్క్రామ్(34), కీపర్ బ్యాటర్ క్వింటాన్ డికాక్(52) రాణించడంతో భారీ స్కోరును ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముందుంచారు. ఆసీస్ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ లయాన్ చెరో 2 వికెట్లు, జాసన్ బెరండ్రాఫ్, పాట్ కమిన్స్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. అనంతరం 326 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూల జట్టు భారీ స్కోరయినా ప్రత్యర్థికి దాసోహం అనేదే లేదు అన్నట్లుగా పోరాడింది. ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(3) స్పిన్నర్ తాహిర్ బౌలింగ్ లో మార్క్రమ్ కు క్యాచ్ ఇచ్చి త్వరగా పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ సీనియర్ బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్(122) టోర్నీలో మరో సెంచరీతో కదం తొక్కాడు. మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరె(85) పరుగులతో చివర్లో మెరుపులు మెరిపించినా జట్టులో చివరి వరుస బ్యాట్స్ మెన్ నిలబడకపోవడంతో విజయాన్ని సాధించిపెట్టలేకపోయాడు. మార్కస్ స్టోయినిస్(22) మాత్రమే జట్టులో చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. ఉస్మాన్ ఖవాజా(18), మిషెల్ స్టార్క్(16) స్కోరు అందుకునే క్రమంలో రబాడ వేసిన 49 ఓవర్లో వెంటవెంటనే వెనుదిరగడంతో చివరి 6 బంతుల్లో ఒక్క వికెట్ చేతిలో ఉండగా 18 పరుగులు చేయాల్సిన స్థితికి వచ్చింది. పెహ్లుక్వాయో వేసిన 50 ఓవర్ నాల్గు బంతుల్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి రెండు బంతుల్లో 11 పరుగులు చేయాల్సి ఉండగా రనౌట్ నుంచి తప్పించుకున్న లయాన్ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో మార్క్రమ్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. బెరండ్రాఫ్(11*) నాటౌట్ గా మిగిలాడు. 49.5 ఓవర్లలో ఆసిస్ 315 పరుగులకు ఆలౌటయింది. సఫారీల బౌలర్లలో కగిసొ రబాడకు 3 వికెట్లు దక్కగా, డ్వయిన్ ప్రెటోరిస్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇమ్రాన్ తాహిర్, క్రిస్ మోరిస్ లు చెరో వికెట్ తీశారు.

JD(S)-Cong govt under threat as 14 MLAs submit resignation


శర వేగంగా మారుతోన్న క`ర్ణాటక` రాజకీయాలు
కర్ణాటకలో రాజకీయ క్రీడ జోరందుకుంది. 13 నెలల కుమారస్వామి (జేడీ-యూ, కాంగ్రెస్ సంకీర్ణం) ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాక్షాత్తు సుప్రీంకోర్టు కల్గజేసుకుని అసెంబ్లీలో నాటి యడ్యూరప్ప మంత్రివర్గం విశ్వాస పరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించడంతో ఆయన బలం నిరూపించుకోలేక రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. 224 మంది సభ్యుల విధానసభలో బీజేపీకి ప్రస్తుతం 104 మంది సభ్యుల బలం ఉంది. జనతాదళ్ (జేడీ-యూ)కు 37, కాంగ్రెస్ కు 78 మంది, బీఎస్పీ 1, ఇండిపెండెట్లుగా 2 సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 113 మంది సభ్యుల బలం అవసరం కాగా తాజాగా 14 మంది తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తూ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ (కాంగ్రెస్)కు శనివారం లేఖలు సమర్పించారు. వీరిలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా 1 సభ్యుడు జేడీ(యూ)కి చెందిన వారు. 11 మంది ఎమ్మెల్యేల రాజీనామా లేఖలు తనకు అందినట్లు  స్పీకర్ విలేకర్లకు తెలిపారు. మంగళవారం వారితో వ్యక్తిగతంగా మాట్లాడి విధివిధానాల ప్రకారం వ్యవహరించనున్నామన్నారు. కుమారస్వామి సర్కార్ భవితవ్యం ఏమిటని విలేకర్లు ప్రశ్నించగా `వేచి చూద్దాం.. నేను చేసేది ఏమీ లేదు` అని స్పీకర్ రమేశ్ కుమార్ బదులిచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ రంగంలోకి దిగి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ సమస్యల్లో చిక్కుకున్నప్పుడు డీకే నే ఎమ్మెల్యేల్ని సర్దుబాటు చేశారు.


Friday, July 5, 2019

Pakistan won by 94 runs against Bangladesh in icc world cup

బంగ్లాదేశ్ పై గెలిచినా సెమీస్ బెర్త్ దక్కని పాకిస్థాన్
లండన్ లార్డ్ వేదికపై శుక్రవారం జరిగిన ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.43లో పాకిస్థాన్ జట్టు బంగ్లాదేశ్ ను 94 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయినా నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ సెమీస్ చేరింది. ఈ రోజు మ్యాచ్ గెలవడమే కాక 300 పైకా పరుగుల ఆధిక్యంతో పాకిస్థాన్ గెలవాల్సిన పరిస్థితి. అయితే కుదిరితే గెలుపు లేదంటే తుదకంటా పోరాటమే లక్ష్యంగా బరిలో దిగే బంగ్లాదేశ్ ను పాకిస్థాన్ అంత తేలిగ్గా ఓడించడం సాధ్యమయ్యే పనికాదని మ్యాచ్ ఆరంభానికి ముందే అందరికీ తెలుసు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 500కు పైగా పరుగులు చేయాలి.. దాంతో పాటు 200 పరుగులలోపే బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేస్తేనే నెట్ రన్ రేట్ మెరుగై న్యూజిలాండ్ ను వెనక్కి నెట్టి పాకిస్థాన్ నాకౌట్ కు చేరుతుంది. కానీ పాకిస్థాన్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులే చేసింది. దాని బట్టి బంగ్లాదేశ్ ను 15 పరుగుల లోపే ఆలౌట్ చేయాలి. అంతతేలిగ్గా బంగ్లాదేశ్ లొంగుతుందనే ఆశలు ఎవరికీ లేవు. దాంతో బంగ్లా ఇన్నింగ్స్ కు ముందే పాకిస్థాన్ సెమీస్ నుంచి ఔటయిన నిర్ణయానికి అందరూ వచ్చేశారు. తాజా గెలుపుతో టోర్నీలో మొత్తంగా 5 మ్యాచ్ ల విజయం 10 పాయింట్లు రద్దయిన మ్యాచ్ 1 పాయింట్ కలుపుకుని న్యూజిలాండ్ తో సమంగా 11 పాయింట్లు సాధించింది. అయితే నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ నాకౌట్ కు చేరింది. ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ సెమీస్ ఆడనున్నాయి.
బంగ్లాదేశ్ 316 పరుగుల లక్ష్య ఛేదనకు బ్యాటింగ్ ప్రారంభించి 6వ ఓవర్లో జట్టు స్కోరు 26 వద్ద సౌమ్య సర్కార్ వికెట్ కోల్పోయింది.  తమీమ్ ఇక్బాల్  జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఆల్ గ్రేట్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (64) మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. లిటన్ దాస్(32), మహ్మదుల్లా (29) మాత్రమే రాణించడంతో 44.1 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై ఓటమి పాలయింది. పాక్ మెరుపు బౌలర్ షాహిన్ అఫ్రిది చెలరేగిపోయి 35 పరుగులకే 6 వికెట్లు తీశాడు. ఈ వరల్డ్ కప్ లో షాహిన్ ఫీట్ మాత్రమే పాక్ కు మిగిలిన సంతృప్తి. ఇంతవరకు వరల్డ్ కప్ లో ఏ బౌలర్ ఆరు వికెట్లు పడగొట్టలేదు. షాదబ్ ఖాన్ 2 వికెట్లు, మహ్మద్ అమీర్, వహాబ్ రియాజ్ చెరో 1 వికెట్ తీసుకున్నారు. అంతకుముందు పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(100) సాధించగా బాబర్ ఆజమ్(96) మరోసారి చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఇమాద్ వసీం(43), మహ్మద్ హఫీజ్(27) రాణించారు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫైజర్ రహ్మాన్ 5 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సైఫుద్దీన్ 3 వికెట్లు తీసుకోగా మెహిదీ హసన్ 1 వికెట్ పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ షాహిన్ ఆఫ్రిది గెల్చుకున్నాడు.

Building career was a methodical endeavour earlier: Julia Roberts


సోషల్ మీడియా వల్ల కెరీర్ విచ్ఛిన్నం:జులియా రాబర్ట్స్

ఇటీవల సోషల్ మీడియా అంటే భయపడి బయటకు వచ్చేస్తున్న తారల జాబితా పెరిగిపోతోంది. ప్రముఖ హాలివుడ్ నటీమణి జులియా రాబర్ట్స్ తాజాగా సోషల్ మీడియాపై విముఖత వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీతయిన ఈ అమెరికా నటీమణి బ్రిటన్ మ్యాగ్ జైన్ `మేరీ క్లేర్` కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్ధమాన నటీనటులకు సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తలు చెప్పారు. సోషల్ మీడియా పోకడలు ఇప్పుడు మారిపోయాయని వర్ధమాన నటీనటుల కెరీర్ ను  సోషల్ మీడియా విచ్ఛిన్నం చేస్తుందని తేల్చిచెప్పారు. లేనిపోని వార్తల వ్యాప్తికి సోషల్ మీడియా వేదికవుతోందన్నారు. తను పరిశ్రమలో అడుగుపెట్టినప్పుడు సోషల్ మీడియా, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫొటోలు తీసుకునే తంతు లేదని చెప్పారు. 1987లో తొలిసారిగా ఆమె స్వీయ దర్శకత్వంలో `ఫైర్ హార్స్` అనే వీడియో ఫీచర్ ఫిల్మ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి పలు టెలివిజన్ సిరీస్ ద్వారా హాలివుడ్ చిత్రాల్లో హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అమెరికా ప్రముఖ పర్యావరణ ఉద్యమకర్త `ఎరిన్ బ్రోకోవిచ్` బయోగ్రఫీ చిత్రంలో నటించిన జులియా 2001లో బెస్ట్ యాక్ట్రస్ కేటగిరి నుంచి తొలి ఆస్కార్ (అకాడెమీ అవార్డు) అవార్డును అందుకున్నారు. నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా, నటిగా వందకు పైగా చిత్రాలకు జులియా పనిచేశారు. ఆస్కార్ కు మరో మూడు సార్లు ఆమె నామినేట్ అయ్యారు. మూడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు సొంత చేసుకున్నారు. బ్రిటిష్ అకాడెమీ అవార్డును ఓసారి గెలుచుకున్నారు. `స్టీల్ మెగ్నోలియస్`, `ప్రెటీ ఉమెన్`, `ఆగస్ట్ ఒసాజె కౌంటీ` చిత్రాలకు గాను ఆమె ఆస్కార్ అవార్డ్ నామినేషన్ సాధించారు. 1990లో విడుదలైన కామెడీ చిత్రం `ప్రెటీ ఉమన్` జులియాకు ప్రపంచ వ్యాప్తంగా ఆశేషంగా అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ఆమె నటించిన టాప్-10 చిత్రాలుగా  America Sweetheart’s, Eat Pray Love, Runaway Bride, Closer,  Mystic Pizza, My Best Friend’s Wedding, Notting Hill, Pretty Woman, Erin Brockovich, Wonder, Homecoming, Ben Is Back(2018) అభిమానుల విశేష ఆదరణ పొందాయి. 30 ఏళ్ల క్రితం ఒకరు బాగా నటిస్తే మరో చిత్రానికి ఎంపికయ్యే వారని ఇప్పుడు చిత్ర పరిశ్రమ కూడా చాలా మారిపోయిందని జులియా ఆవేదన వ్యక్తం చేశారు. భర్త, పిల్లలు కుటుంబ బాగోగుల్ని తన తల్లి చూసుకుంటారని దాంతో తను పూర్తిగా సినిమాలపై దృష్టి కేంద్రీకరించగల్గుతున్నట్లు జులియా చెప్పారు.  ఏడాదిలో ఆమె కేవలం రెండు వారాలు మాత్రమే విశ్రాంతి తీసుకుని యావత్ కుటుంబం కోసం కష్ట పడతారన్నారు. సినిమా షెడ్యుల్స్ వ్యవహారాల్ని తన భర్త సినిమాటోగ్రాఫర్ డేనియల్ మోడర్ చూసుకుంటారని జులియా తెలిపారు.