నామమాత్రపు
మ్యాచ్ లో అఫ్గనిస్థాన్ పై వెస్టిండీస్ గెలుపు
ఐసీసీ వరల్డ్ కప్-12లో అఫ్గనిస్థాన్ పరాజయాలు పరిపూర్ణమయ్యాయి. ఆడిన
తొమ్మిదింటికి 9 మ్యాచ్ ల్లో పరాజయం
పాలయినా ఆ జట్టు చివరి మ్యాచ్ లోనూ వెస్టిండీస్ పై పోరాట పటిమను ప్రదర్శించింది.
హెడ్డింగ్లే లీడ్ మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్ నం.42లో అఫ్గన్ల పోరాటం మరోసారి
అబ్బురపరిచింది. అయినా బలమైన జట్టు వెస్టిండీస్ ఆ జట్టును 23 పరుగుల తేడాతో
ఓడించింది. ఇప్పటికే ఇరు జట్లు నాకౌట్ స్థానాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాస్
గెలిచిన విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50
ఓవర్లలో కరేబియన్ టీమ్ 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్
మరోసారి పేలవమైన ఫామ్ తో 7 పరుగులకే వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇవిన్ లూయిస్(58), కలిసి
వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్(77) రెండో వికెట్ కు 88 పరుగులు జోడించారు. ఆ
తర్వాత షిమ్రాన్ హెట్మర్(39), నికోలస్ పూరన్(58), కెప్టెన్ హోల్డర్(45) రాణించడంతో
విండీస్ భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. అఫ్గన్ బౌలర్లు అందరూ ధారాళంగా
పరుగులిచ్చారు. అందరికంటే ఎక్కువగా దవ్లాత్ జద్రాన్ 73 పరుగులిచ్చి 2 వికెట్లు
పడగొట్టాడు. సయ్యద్ షిర్జాద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో 1 వికెట్ తీశారు.
అనంతరం
312 పరుగుల ఛేదన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అఫ్గనిస్థాన్ మరోసారి తను బలమైన
జట్టుగా ఎదుగుతున్న తీరును ప్రపంచ క్రికెట్ ముందు ప్రదర్శించింది. ఓ దశలో గెలుపు
అవకాశాలు కనిపించాయి. కెప్టెన్ గుల్బుద్దీన్(5) మరోసారి సింగిల్ డిజిట్ కే డగౌట్
చేరాడు. మరో ఓపెనర్ రహ్మత్ షా(62), వికెట్ కీపర్ బ్యాట్స్ మన్(86) రెండో వికెట్ కు
133 పరుగులు జోడించి జట్టు గెలుపుపై ఆశలు కల్పించారు. ఆ తర్వాత జద్రాన్(31),
అస్ఘర్ అఫ్గన్(40), సయ్యద్ షిర్జాద్(25) మాత్రమే విండీస్ బౌలర్లను ఎదుర్కొని
చెప్పుకోదగ్గ పరుగులు చేయగలిగారు. 288 పరుగులకు అఫ్గనిస్థాన్ ఆలౌటయింది. విండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాథ్ వెయిట్ 4,
కెమర్ రోచ్ 3 వికెట్లు పడగొట్టగా ఒషానే థామస్, క్రిస్ గేల్ చెరో వికెట్ తీశారు.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను హోప్ గెలుచుకున్నాడు.