Monday, July 1, 2019

Srilanka great win against Westindies in a exciting match in ICC cup

పరుగుల పంటలో శ్రీలంకదే గెలుపు:23 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి
ఐసీసీ వరల్డ్ కప్ లో ఓ అద్భుతమైన మ్యాచ్ లో చివరకు శ్రీలంకనే విజయం వరించింది. 12వ వరల్డ్ కప్ లో సోమవారం చెస్టరీలీ స్ట్రీట్ రివర్ సైడ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ నం.39 లో వెస్టిండీస్ నువ్వానేనా అని తలపడగా శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలుపునందుకుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 338 భారీ పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యువ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవిష్క ఫెర్నాండో (104) సెంచరీతో జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. 339 పరుగుల ఛేదనకు దిగిన వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్(118) అండతో దీటుగా బదులివ్వడంతో ఆ జట్టు దాదాపు విజయపుటంచుల వరకు వచ్చింది. మొదటి, చివరి వరుస బ్యాట్స్ మెన్ అండ లేకపోవడంతో పూరన్ సెంచరీ వృథా అయింది. ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(35) స్థాయికి దగ్గ ప్రదర్శన కనబర్చలేదు. మరో ఓపెనర్ సునీల్ అంబ్రిస్(5), కీపర్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్(5) వెంటవెంటనే వెనుదిరిగారు. మరో హిట్టర్ షిమ్రాన్ హెట్మయర్ (29) రనౌట్ గా పెవిలియన్ బాటపట్టాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్(26), కివీస్ పై అద్భుత సెంచరీ చేసిన కార్లోస్ బ్రాథ్ వెయిట్(8 రనౌట్) త్వరగా అవుటయ్యారు. పూరన్ కు ఫాబియన్ అలెన్(51) హాఫ్ సెంచరీతో తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడం ఆరుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు అందుకోలేక పోవడంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్టార్ స్ట్రయిక్ బౌలర్ లసిత్ మలింగా ఈ మ్యాచ్ లోనూ 3 వికెట్లు తీసుకుని ప్రతిభ కనబర్చాడు. కసున్ రజిత, జెఫ్రె వండర్సే, యాంజిలో మాథ్యూస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 ఓవర్లలో 93 పరుగులు జత చేశారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే(32) ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో కీపర్ హోప్ కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ కుశాల్ పెరీరా(64), అవిష్క ఫెర్నాండో(104) మెరిశారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కుశాల్ మెండిస్(39), యాంజిలో మాథ్యూస్(26), లహిరు తిరుమనే(45) రాణించడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు, షెల్డన్ కోట్రెల్, ఒషానే థామస్, ఫాబియన్ అలెన్ తలో 1 వికెట్ పడగొట్టారు.



RSS chief Mohan Bhagwat, six top sangh leaders join Twitter


ట్విటర్ ఖాతా తెరవగానే ఆర్ఎస్ఎస్ చీఫ్ కు 10 లక్షల పాలోవర్లు
లోకమంతా ట్విటర్ బాటను నడుస్తుంటే మేమెందుకు పోరాదనుకున్నారో ఏమో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్) అధినేత మోహన్ భగవత్ కూడా ట్విటర్ ఖాతా తెరిచారు. సోమవారం ఆయనతో పాటు సంఘ్ కు చెందిన పదాధికారులు పలువురు ట్విటర్ బాట పట్టారు. సంఘ్ ప్రధానకార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, సంయుక్త కార్యదర్శి సురేశ్ సోని తదితర ఆరుగురు పదాధికారులు ట్విటర్ అకౌంట్లు తెరిచారు. సంఘ్ కు సంబంధించిన ప్రకటనలు విడుదల చేయడానికే ఆయన ట్విటర్ ఖాతా తెరిచారు.  @DrMohanBhagwat  పేరిట గల తన ట్విటర్ అకౌంట్ మనుగడలోకి వచ్చిందో లేదోనని భగవత్ ఓసారి తనిఖీ చేసి చూసుకున్నారు. అయితే ఆయన ఇంకా ట్వీట్ ఏదీ  చేయలేదు. ఆయన ఇంతవరకు ఒక్క ట్వీట్ చేయకున్నా 10 లక్షల 30 వేల మంది ఫాలోవర్లు వచ్చి చేరడమే విశేషం.

Sunday, June 30, 2019

Princess Diana almost starred in 'The Bodyguard' sequel


ఇంగ్లిష్ సినిమాలో నటించాలనుకున్న ప్రిన్సెస్ డయానా
బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ లేడీ డయానా (డయానా ఫ్రాన్సెస్ స్పెన్సర్) ఓ హాలివుడ్ మూవీలో నటించాలని అనుకున్నారు. కథా చర్చలు అన్నీ పూర్తయ్యాయి. మరి కొద్ది రోజుల్లో సినిమా నిర్మాణం ప్రారంభమవుతుందనగా దురదృష్టవశాత్తు ఆమె పారిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయాన్ని హాలివుడ్ నటుడు, దర్శకుడు కెవిన్ మైఖెల్ కాస్టనర్ బయటపెట్టాడు. `పీపుల్ టి.వి. కౌచ్   సర్ఫింగ్` కార్యక్రమం (ఇంటర్వ్యూ) లో ఈ వివరాలు వెల్లడించారు. పలు విజయవంతమైన చిత్రాలను తీసిన కాస్టనర్ రెండు అకాడెమీ అవార్డులతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డులను గెలుచుకున్నాడు. `రాబిన్ హుడ్: ప్రిన్సెస్ ఆఫ్ థీవ్స్`(1991), `ది బాడీ గార్డ్`(1992), `ఎ పెర్ఫెక్ట్ వరల్డ్`(1993) వంటి బహుళ ప్రేక్షకాదరణ పొందిన సినిమాలకు దర్శకత్వం వహించారు. 1992లో తీసిన థ్రిల్లర్ మూవీ ది బాడీ గార్డ్ సెన్సెషనల్ హిట్ సాధించింది. ఈచిత్రంలో అమెరికా సింగర్, నటి విట్నీ హోస్టన్ నటించింది. అదే ఏడాది బాడీగార్డ్-2 చిత్రం తీయాలని కాస్టనర్ భావించారట. అందులో డయానా నటిస్తే బావుంటుందనుకున్న ఆయన నేరుగా డయానాతో ఫోన్ లో సంభాషిస్తే ఆమె అంగీకరించారట. సినిమాలో ముద్దు సన్నివేశాలుంటాయా అని డయానా ప్రశ్నించారట. అక్కడక్కడ ఒకటి, రెండు సన్నివేశాలుంటాయి.. వద్దనుకుంటే అవి లేకుండా చిత్రీకరిద్దామన్నట్లు కాస్టనర్ తెలిపారు. తనకు రాచరిక సంప్రదాయాలు కొన్ని ఉంటాయన్న విషయాన్ని డయానా ఈ సందర్భంగా తనకు చెప్పారన్నారు. బాడీగార్డ్-2 మూవీ గురించి డయానాతో నాటి తన టెలిఫోన్ సంభాషణ మధుర స్మృతుల్ని కాస్టనర్ నెమరవేసుకున్నారు. డయానా యువరాణి కాబట్టి ఆమె కు గల రాచరిక నియమాలను పరిగణనలోకి తీసుకునే సీక్వెల్ మూవీ ఆలోచించినట్లు కాస్టనర్ తెలిపారు. అప్పటికే యువరాజు చార్లెస్ తో విడిపోయిన డయానాతో తనకు టెలిఫోన్ ఇంటర్వ్యూ ఇప్పించడంలో ప్రిన్సెస్ (డచెస్ ఆఫ్ యార్క్) సారా ఫెర్గుసన్ సహాయం చేశారన్నారు. దాదాపు అయిదేళ్లు శ్రమించి 1997 నాటికి స్క్రిప్ట్ పూర్తి చేసి డయానా ను కలవాలనుకున్నట్లు కాస్టనర్ తెలిపారు. అంతకు ఒక్కరోజు ముందే 1997 ఆగస్ట్ 31న డయానా (36ఏళ్లు) పారిస్ లో కారు ప్రమాదంలో దుర్మరణం చెందారన్నారు. అప్పటికి ప్రిన్స్ విలియమ్, ప్రిన్స్ హారీ చాలా చిన్న పిల్లలని కాస్టనర్ పేర్కొన్నారు.

Australia thrash NewZealand by 86 runs in icc world cup: Trent got hat trick


కివీస్ ను 86 పరుగుల తేడాతో చిత్తు చేసిన ఆసిస్
లార్డ్స్ ప్రభువులం తామేనని ఆస్ట్రేలియా నిరూపించుకుంది. న్యూజిలాండ్ కు వరల్డ్ కప్ లో తమ బౌలర్ ట్రెంట్ బోల్ట్ హ్యాట్రిక్ సాధించడం ఒక్కటే శనివారం మ్యాచ్ లో కల్గిన ఊరట.  వరల్డ్ కప్-12 లండన్ లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ నం.36 లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 86 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆసిస్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. 50 ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. 244 పరుగుల ఛేదన లక్ష్యంతో కివీస్ బ్యాటింగ్ ప్రారంభించి కంగారూ బౌలర్ల ధాటికి బెంబేలెత్తింది. జట్టులో 20 పరుగుల పైబడి స్కోరు చేసిన బ్యాట్స్ మెన్ ముగ్గురే నంటేనే ఆసిస్ బౌలర్ల వాడి అర్ధమౌతోంది. మార్టిన్ గుప్తిల్(20), కెప్టెన్ కేన్ విలియమ్సన్(40), రాస్ టేలర్(30) మాత్రమే రాణించారు. ఇన్నింగ్స్ లో కెప్టెన్ విలియమ్సన్, శాంటనర్ లు చెరో సిక్సర్ కొట్టారు. కివీస్ 43.4 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటయింది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ 26 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి కివీస్ ను ఘోరంగా దెబ్బతీశాడు. టోర్నీలో స్టార్క్ అయిదు వికెట్లు తీసుకోవడం ఇది రెండోసారి. జాసన్ బెరాండ్రాఫ్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు, పాట్ కమిన్స్, నాథన్ లయొన్, స్టీవెన్ స్మిత్ తలో వికెట్ పడగొట్టారు. భారీ స్కోరుపై కన్నేసి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసిస్ మొదట్లో 92 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. వన్డౌలో వచ్చిన ఉస్మాన్ ఖవాజ(88) జట్టు ఇన్నింగ్స్ కు గోడలా నిలబడిపోయాడు. అయిదో ఓవర్ నుంచి ఇన్నింగ్స్ చివరి ఓవర్ మూడు బంతుల వరకు క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు. అతనికి అండగా మిడిల్ ఆర్డర్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అలెక్స్ కేరీ(71) నిలిచాడు. ఇద్దరూ ఆసిస్ ఇన్నింగ్స్ కు ప్రాణం పోశారు. ఇన్నింగ్స్ లో ఆసిస్ బ్యాట్స్ మన్ 24 బౌండరీలు సాధించారు. అయితే ఒక్క సిక్స్ కూడా జట్టులో ఏ బ్యాట్స్ మన్ కొట్టలేకపోవడం విశేషం. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ 51 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా మూడు బంతుల్లో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఔట్ చేసి వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి న్యూజిలాండ్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. ట్రెంట్ బోల్ట్ చివరి ఓవర్ బౌలింగ్ చేస్తూ ఖవాజా, స్టార్క్ లను వరుస బంతుల్లో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత బంతికి  బెరాండ్రాఫ్ ను ఎల్బీడబ్ల్యూ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. బోల్ట్ ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లలో ఓపెనర్ కెప్టెన్ అరాన్ ఫించ్(8) ను ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు పంపాడు. కివీస్ బౌలర్లలో లకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అలెక్స్ కేరీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.