Monday, July 1, 2019

Srilanka great win against Westindies in a exciting match in ICC cup

పరుగుల పంటలో శ్రీలంకదే గెలుపు:23 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమి
ఐసీసీ వరల్డ్ కప్ లో ఓ అద్భుతమైన మ్యాచ్ లో చివరకు శ్రీలంకనే విజయం వరించింది. 12వ వరల్డ్ కప్ లో సోమవారం చెస్టరీలీ స్ట్రీట్ రివర్ సైడ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ నం.39 లో వెస్టిండీస్ నువ్వానేనా అని తలపడగా శ్రీలంక 23 పరుగుల తేడాతో గెలుపునందుకుంది. వెస్టిండీస్ టాస్ గెలిచి శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 338 భారీ పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. యువ ఆటగాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవిష్క ఫెర్నాండో (104) సెంచరీతో జట్టు ఇన్నింగ్స్ కు వెన్నెముకగా నిలిచాడు. 339 పరుగుల ఛేదనకు దిగిన వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్(118) అండతో దీటుగా బదులివ్వడంతో ఆ జట్టు దాదాపు విజయపుటంచుల వరకు వచ్చింది. మొదటి, చివరి వరుస బ్యాట్స్ మెన్ అండ లేకపోవడంతో పూరన్ సెంచరీ వృథా అయింది. ఓపెనర్ యూనివర్స్ బాస్ క్రిస్ గేల్(35) స్థాయికి దగ్గ ప్రదర్శన కనబర్చలేదు. మరో ఓపెనర్ సునీల్ అంబ్రిస్(5), కీపర్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్(5) వెంటవెంటనే వెనుదిరిగారు. మరో హిట్టర్ షిమ్రాన్ హెట్మయర్ (29) రనౌట్ గా పెవిలియన్ బాటపట్టాడు. కెప్టెన్ జాసన్ హోల్డర్(26), కివీస్ పై అద్భుత సెంచరీ చేసిన కార్లోస్ బ్రాథ్ వెయిట్(8 రనౌట్) త్వరగా అవుటయ్యారు. పూరన్ కు ఫాబియన్ అలెన్(51) హాఫ్ సెంచరీతో తోడుగా నిలిచాడు. లక్ష్యం పెద్దది కావడం ఆరుగురు బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోరు అందుకోలేక పోవడంతో వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 315 పరుగులు మాత్రమే చేయగల్గింది. శ్రీలంక బౌలర్లలో స్టార్ స్ట్రయిక్ బౌలర్ లసిత్ మలింగా ఈ మ్యాచ్ లోనూ 3 వికెట్లు తీసుకుని ప్రతిభ కనబర్చాడు. కసున్ రజిత, జెఫ్రె వండర్సే, యాంజిలో మాథ్యూస్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 15 ఓవర్లలో 93 పరుగులు జత చేశారు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే(32) ప్రత్యర్థి కెప్టెన్ హోల్డర్ బౌలింగ్ లో కీపర్ హోప్ కి క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ కీపర్ బ్యాట్స్ మన్ కుశాల్ పెరీరా(64), అవిష్క ఫెర్నాండో(104) మెరిశారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కుశాల్ మెండిస్(39), యాంజిలో మాథ్యూస్(26), లహిరు తిరుమనే(45) రాణించడంతో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్ 2 వికెట్లు, షెల్డన్ కోట్రెల్, ఒషానే థామస్, ఫాబియన్ అలెన్ తలో 1 వికెట్ పడగొట్టారు.



No comments:

Post a Comment