Friday, June 28, 2019

Big brands bet on World Cup fever in India, where cricket is `religion`


ప్రపంచ పండుగలా కొనసాగుతున్న ఐసీసీ వరల్డ్ కప్
ప్రస్తుతం ప్రపంచమంతా ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ పండుగలో లీనమైపోయింది. సుమారు 100 కోట్ల 50 లక్షల మంది వరల్డ్ కప్ క్రికెట్ ను తిలకిస్తున్నారు. ప్రత్యక్షంగా, టెలివిజన్, రేడియో, మొబైల్ ఫోన్లలో క్రికెట్ మ్యాచ్ ల్ని వీరంతా వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఫుట్ బాల్ మ్యాచ్ ల వీక్షకుల సంఖ్య కంటే 15 రెట్లు అధికంగా వరల్డ్ కప్ మ్యాచ్ ల్ని వీక్షిస్తున్నారు. ప్రపంచంలో క్రికెట్ ఇప్పుడు కేవలం ఓ ఆట కాదు.. మతం. ప్రపంచం నలుమూలలా సాకర్ ఆడే దేశాలు కోకొల్లలు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫుట్ బాల్ అసోసియేషన్(ఫిఫా) గుర్తింపు పొందిన దేశాలు 79. టోర్నీలో అర్హత సాధించిన దేశాలు పాల్గొంటాయి. 2018 రష్యా(మాస్కో)లో జరిగిన గత ఫిపా వరల్డ్ కప్ లో 32 దేశాలు ఆడాయి. కానీ వరల్డ్ కప్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 20 లోపే. అందులో క్వాలిఫై అయిన 10 దేశాలు ఐసీసీ వరల్డ్ కప్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్ ల్ని ఒక్క భారత ఉపఖండంలోనే సుమారు 80 కోట్ల మంది వీక్షిస్తున్నట్లు ప్రాయోజికులు(స్పాన్సర్స్), వాణిజ్య ప్రకటన దారులు (మీడియా బయ్యర్స్) అంచనా వేస్తున్నారు. సిరులు కురిపించే క్రికెట్ ను వాణిజ్య సంస్థలు చక్కగా ఉపయోగించుకుని తమ వ్యాపారాల అభివృద్ధికి బాటగా మలుచుకుని ముందుకెళ్తున్నాయి. క్రికెట్ ఆసరాగా ప్రకటనల రంగం ప్రపంచ వ్యాప్తంగా టి.వి, రేడియో, పత్రికలు, మొబైల్ ఫోన్ల ద్వారా ప్రచారపర్వంతో దూసుకెళ్తోంది. క్రికెట్ అభిమానులే తమ వినియోగదారులుగా రకరకాల ఆఫర్లతో ఊరిస్తూ మార్కెట్ ను వ్యాపార, వాణిజ్య సంస్థలు ఊపేస్తున్నాయి. లైవ్ ఫాన్ ఈవెంట్స్ తదితరాలతో వ్యాపార అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రవాణా సంస్థ ఉబర్ మొదలుకొని ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సామ్ సంగ్, తినుబండారాల సంస్థ మాండెలెజ్ వరకు అన్ని సంస్థలు క్రికెట్ అభిమానులే ఆలంబనగా వ్యాపారాభివృద్ధితో పండుగ చేసుకుంటున్నాయి.


Thursday, June 27, 2019

Nine girls among 11 killed in road accident on mughal road in jammu&kashmir


జమ్ముకశ్మీర్లో ఘోర దుర్ఘటన:9మంది విద్యార్థినుల సహా 11మంది మృతి  
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 11 మంది అసువులు బాశారు. దుర్ఘటన గురువారం లాల్ గులాం ప్రాంతంలో చోటు చేసుకుంది. పూంచ్ నుంచి సోఫియాన్ కు ప్రయాణిస్తున్న టెంపో రహదారిపై పక్కకు జారిపోయి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో  9 మంది విద్యార్థినులతో పాటు మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పీర్ కి గలీ ప్రాంతంలో చారిత్రక మొఘల్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ ప్రాంతం దక్షిణ కశ్మీర్ సోఫియాన్ జిల్లాలో ఉంది. సూరాన్ కోట్ కు చెందిన ఓ ప్రయివేట్ కంప్యూటర్ విద్యా సంస్థ కు చెందిన విద్యార్థినులు విహారయాత్రకు బయలుదేరి ప్రమాదం బారిన పడ్డారు. వీరంతా ధోబిజాన్ దిశగా టెంపోలో ప్రయాణిస్తున్నారు. సమాచారం అందగానే ప్రమాదస్థలానికి చేరుకున్న అధికారవర్గాలు వెంటనే సహాయక చర్యల్ని చేపట్టాయి. అయిదుగురు క్షతగ్రాతుల్ని హుటాహుటిన శ్రీనగర్ లోని ఎస్.ఎం.హెచ్.ఎస్. ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు సోఫియాన్ జిల్లా ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. క్షతగ్రాతుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

IAF's Jaguar fighter jet suffers bird hit, lands safely


భారత వాయుసేన విమానానికి తప్పిన ముప్పు
పైలట్ చాకచక్యంతో భారత వాయుసేన (ఐఏఎఫ్) విమానానికి త్రుటిలో ముప్పు తప్పింది. గురువారం ఉదయం అంబాలా ఎయిర్ బేస్ (హర్యానా) నుంచి బయలుదేరిన ఐఏఎఫ్ జాగ్వర్ ను గాల్లో పక్షి ఢీకొంది. టేకాఫ్ అయిన వెంటనే ఘటన చోటు చేసుకుంది. దాంతో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి చెందిన రెండు ఇంధన ట్యాంకులు, ఎక్స్ టర్నల్ స్టోర్ లోని 10 కేజీల శిక్షణకు ఉపయోగించే బాంబుల్ని జాగ్వర్ నుంచి కిందకి జారవిడిచాడు. విమానానికి ఏదైనా ప్రమాదం వాటిల్లినా, ఇంజన్లలో ఏదైనా అనివార్య సమస్య తలెత్తినా ఇదే విధానాన్ని పైలట్లు పాటించాల్సి ఉంటుంది. కచ్చితంగా అదే విధంగా జాగ్వర్ బరువును తగ్గించి సురక్షితంగా విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకువచ్చారని ఐఏఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. పైలట్ జార విడిచిన బాంబుల్ని ఆ తర్వాత స్వాధీనం చేసుకున్నామన్నాయి. తొలుత అంబాలా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) రజనీశ్ కుమార్ నగరంలో ఆకాశం నుంచి విమానం ద్వారా బాంబులు కిందకు పడినట్లు ధ్రువీకరించారు. ఈ వ్యవహారంపై ఐఏఎఫ్ విచారణకు (కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ) ఆదేశించింది.

Wednesday, June 26, 2019

Pakistan win over unbeaten Newzealand by 6wickets in icc world cup


అజేయ కివీస్ పై పాక్ అలవోక విజయం
వరల్డ్ కప్ లో నేనూ ఉన్నాను అని పాకిస్థాన్ నిరూపించుకుంది. ఇంతవరకు టోర్నీలో ఓటమి ఎరుగని న్యూజిలాండ్ ను 6 వికెట్ల తేడాతో కంగు తినిపించింది. ఐసీసీ వరల్డ్ కప్-12 బర్మింగ్ హమ్ ఎడ్గబస్టన్ వేదికపై బుధవారం జరిగిన మ్యాచ్ నం.33లో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 237 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఎదుట కేవలం238 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంచింది. దాంతో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పాక్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. పాక్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆల్ రౌండర్ ప్రదర్శన చేసింది. ఈ వరల్డ్ కప్ లో పాక్ బ్యాట్స్ మన్ తొలి సెంచరీ కూడా నమోదు చేశాడు. బాబర్ ఆజం 127 బంతుల్లో 11 బౌండరీల సాయంతో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాచ్ ను గెలిపించాడు. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్(19), ఫకర్ జమాన్(9) వికెట్లను త్వరగా పడగొట్టిన తృప్తి మాత్రమే న్యూజిలాండ్ కు దక్కింది. అప్పటికే అర్ధ శతకం భాగస్వామ్యంతో పాతుకుపోయిన బాబార్, సెకండ్ డౌన్ మహ్మద్ హఫీజ్ జోడీలను విడదీయడానికి కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆఫ్ స్పిన్ బౌలర్ అవతారమెత్తాల్సి వచ్చింది. తొలి ఓవర్ లోనే కివీస్ కెప్టెన్ ..హఫీజ్ ను భారీ షాట్ కు ఊరించి అవుట్ చేశాడు. సరిగ్గా ఇన్నింగ్స్ సగంలో(24.5 ఓవర్) విలియమ్సన్ ఎత్తు ఫలించిన తర్వాత పాక్ మరో వికెట్ ను కివీస్ బౌలర్లు పడగొట్టలేకపోయారు. లెగ్ స్పినర్ శాంటనర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 10 ఓవర్లలో పొదుపుగా 38 పరుగులే ఇచ్చినా ఫలితం లేకపోయింది. అతని బౌలింగ్ లో బాబర్ రెండుసార్లు అవుటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. రెండుసార్లూ కీపర్ టామ్ లాథమ్ తప్పిదం వల్లే బతికిపోయాడు. ఒకసారి క్యాచ్ అవుట్ నుంచి మరోసారి స్టంపౌట్ నుంచి బాబార్ కు లైఫ్ లు లభించాయి. అప్పటికే పాక్ విజయం ఖరారైన సమయంలో 68 పరుగులు చేసిన హరిస్ సోహాయిల్ గుఫ్తిల్ త్రో తో రనౌట్ గా వెనుదిరిగాడు. విన్నింగ్ షాట్ ను కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కొట్టి పాక్ కు అవసరమైన విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన విలియమ్సన్ 39 పరుగులిచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. 10 ఓవర్లలో 48 పరుగులిచ్చి ట్రెంట్ బౌల్ట్ 1 వికెట్ పడగొట్టాడు. 8.1 ఓవర్లలో 50 పరుగులిచ్చిన లకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ను చూస్తే టోర్నీలో ఇంతకుముందు ఆడిన కివీస్ బ్యాట్స్ మెన్ వీళ్లేనా అనిపించేలా రన్స్ తీశారు. మరో వైపు పాక్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. కెప్టెన్ విలియమ్సన్ మాత్రమే 69 బంతుల్లో 41 పరుగులు రాబట్టాడు. చివర్లో జేమ్స్ నీషం112 బంతుల్లో 97* పరుగులు చేశాడు. సెంచరీ మిస్ అయినా జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో మూలస్తంభంలా నిలిచాడు. అతనికి తోడుగా కోలిన్ డే గ్రాండ్ హోమ్ 71 బంతుల్లో 64 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షాదబ్ ఖాన్, మహ్మద్ అమీర్ చెరో వికెట్ తీసుకున్నారు.