భారత వాయుసేన విమానానికి తప్పిన ముప్పు
పైలట్ చాకచక్యంతో భారత వాయుసేన (ఐఏఎఫ్)
విమానానికి త్రుటిలో ముప్పు తప్పింది. గురువారం ఉదయం అంబాలా ఎయిర్ బేస్ (హర్యానా) నుంచి
బయలుదేరిన ఐఏఎఫ్ జాగ్వర్ ను గాల్లో పక్షి ఢీకొంది. టేకాఫ్ అయిన వెంటనే ఘటన చోటు
చేసుకుంది. దాంతో పైలట్ సమయస్ఫూర్తితో విమానానికి చెందిన రెండు ఇంధన ట్యాంకులు, ఎక్స్
టర్నల్ స్టోర్ లోని 10 కేజీల శిక్షణకు ఉపయోగించే బాంబుల్ని జాగ్వర్ నుంచి కిందకి
జారవిడిచాడు. విమానానికి ఏదైనా ప్రమాదం వాటిల్లినా, ఇంజన్లలో ఏదైనా అనివార్య సమస్య
తలెత్తినా ఇదే విధానాన్ని పైలట్లు పాటించాల్సి ఉంటుంది. కచ్చితంగా అదే విధంగా
జాగ్వర్ బరువును తగ్గించి సురక్షితంగా విమానాన్ని పైలట్ వెనక్కి తీసుకువచ్చారని
ఐఏఎఫ్ వర్గాలు పేర్కొన్నాయి. పైలట్ జార విడిచిన బాంబుల్ని ఆ తర్వాత స్వాధీనం
చేసుకున్నామన్నాయి. తొలుత అంబాలా డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) రజనీశ్ కుమార్
నగరంలో ఆకాశం నుంచి విమానం ద్వారా బాంబులు కిందకు పడినట్లు ధ్రువీకరించారు. ఈ
వ్యవహారంపై ఐఏఎఫ్ విచారణకు (కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ) ఆదేశించింది.
No comments:
Post a Comment