బంగ్లాదేశ్ రైలు
ప్రమాదంలో ఏడుగురి దుర్మరణం 200 మందికి గాయాలు
బంగ్లాదేశ్ లో ఘోర
రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా మరో 200 మంది
గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రాజధాని ఢాకా నుంచి సిల్హెట్ కు బయలుదేరి ప్రమాదానికి గురయింది. మౌలోవిబజార్ జిల్లాలోని కులావుర సమీపంలో కల్వర్ట్ వంతెన పాక్షికంగా కూలిపోవడంతో రైలులో ఆరుబోగీలు కింద పడిపోయాయి. ఈ దుర్ఘటన ఆదివారం రాత్రి 11.40 సమయంలో బరాంచల్
వద్ద జరిగింది. చనిపోయిన ఏడుగురిలో ముగ్గురు మహిళలున్నట్లు తెలుస్తోంది.
ఇందులో ఇద్దర్ని గుర్తించారు. మోన్వార్ పెర్విన్(48), ఫాహ్మిద అక్తర్(20) మృతి
చెందారు. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి సుమారు 15 మందిని కాపాడారు. లేదంటే మృతుల సంఖ్య మరింత పెరిగేదని తెలుస్తోంది. గాయపడిన
62 మందికి కులావుర ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించి ఇళ్లకు పంపించేశారు.
24 మందిని సిల్హెట్ ఎంఏజీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన
క్షతగాత్రులను వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దాంతో సిల్హెట్ మార్గంలో
రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాళిని, జయంతిక ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఈ
కల్వర్టు వంతెన మార్గంలో లైన్ మరమ్మతుల పాలవ్వడం లేదా ఉపాబన్ ఎక్స్ ప్రెస్ రైలు
చక్రాల్లో లోపం వల్ల దుర్ఘటన సంభవించినట్లు భావిస్తున్నామని రైల్వేశాఖ కార్యదర్శి
మొఫాజల్ హోస్సెన్ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ దుర్ఘటన పై దర్యాప్తునకు నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.