Friday, June 21, 2019

ram vilas paswan files nomination for by election to rajya sabha

రాజ్యసభ కు నామినేషన్ వేసిన కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ 

బిహార్ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి లోక్ జనశక్తి (ఎల్.జె.ఎస్) పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఆయన నామినేషన్ దాఖలు  కార్యక్రమంలో  బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, రోడ్లు, భవనాల శాఖ సహాయమంత్రి నందకిశోర్ యాదవ్, విద్యుత్ శాఖ సహాయ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తదితర సీనియర్ ఎన్డీయే నాయకులు పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ బిహార్ పట్నా సాహెబ్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నిక కావడంతో ఆ రాష్ట్రంలో ఏకైక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమయింది. నామినేషన్లకు ఈ నెల 25 తుది గడువు కాగా 26న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు తేదీ జూన్ 28. వేరే ఎవరైనా నామినేషన్ వేస్తే జులై 5న ఓటింగ్ తేదీని నిర్ణయిస్తారు. రామ్ విలాస్ పాశ్వాన్ సొంత నియోజకవర్గం హజిపూర్ నుంచి ఈసారి లోక్ సభకు ఆయన చిన్న సొదరుడు పశుపతి కుమార్ పరాస్ ఎన్నికయ్యారు. పరాస్ బిహార్ రాష్ట్రమంత్రిగా వ్యవహరించారు. రామ్ విలాస్ పాశ్వాన్ 1977 నుంచి 2014 మధ్య కాలంలో హజిపూర్ నియోజకవర్గం నుంచి 9సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. తొలుత జనతా పార్టీ తరఫున 1977, 1980ల్లో రెండుసార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1984లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆ తర్వాత 1989,91,96,98,99ల్లో జనతాదళ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో ఆయన లోక్ జన్ శక్తి పార్టీని స్థాపించి హజిపూర్ స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 2014లో ఆ స్థానానికి లోక్ సభలో ప్రాతినిధ్యం వహించారు.

Australia beat Bangladesh by 48 runs warner hits 166


ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరో మెట్టు పైకెదిగింది. ఆసియా క్రికెట్ లో భారత్ సరసన నిలిచే స్థాయి తమకే ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు నిరూపించుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.26 నాటింగ్ హామ్ వేదికపై గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై బంగ్లాదేశ్ పోరాడి 48 పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కనబర్చిన తెగువ ఆ జట్టు ఓడినా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ముష్పికర్ రహీం సెంచరీ (102*), ఓపెనర్ తమిమ్ ఇక్బాల్ (62), షాకిబ్ అల్ హసన్(41), మహ్మదుల్లా(69) పరుగులతో చివరి  వరకు విజయం కోసం పోరాడారు. వెస్టిండీస్ పై గెలుపును ఈ మ్యాచ్ లో రిపీట్ చేస్తుందా అన్నట్లుగా బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయిదో వికెట్ గా మహ్మదుల్లా అవుటయ్యా సరికి రహీంతో కలిసి 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 44 ఓవర్లు ముగిసే సరికి 302 పరుగులు నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 333 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ కోల్టర్ నైల్, మార్కస్ స్టోయినిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అడమ్ జంపా ఓ వికెట్ తీసుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరే లక్ష్యంగా పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ చెలరేగిపోయి 5 సిక్సర్లు, 14 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(53), ఉస్మాన్ ఖవాజా(89)లు అర్ధ సెంచరీ లతో కదం తొక్కారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మాక్స్ వెల్ కూడా 10 బంతుల్లోనే 32 పరుగులు రాబట్టాడు. మార్కస్ స్టోయినిస్ 17 పరుగులతో కీపర్ అలెక్స్ కేరీ 11 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు, ముస్తాఫైజర్ రహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్  వార్నర్ గెలుచుకున్నాడు.

Thursday, June 20, 2019

raising issue of rahul`s use of mobile during president address frivolous:congress



రాహుల్ పార్లమెంట్ లో ఫోన్ చూసుకుంటున్నారంటూ..
బీజేపీ పనికిమాలిన ఆరోపణలు చేస్తోంది:కాంగ్రెస్
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ తో బిజీ అయిపోయారనే బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ చేస్తున్న ఆరోపణలు పనికిమాలినవిగా పేర్కొంది. గురువారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా రాహుల్ 20 నిమిషాల సేపు యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో మాట్లాడారని అరగంటకు పైగా ఫోన్ చూసుకుంటూ గడపారని బీజేపీ సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో రాహుల్ తన ఫోన్ ద్వారా ఫొటోలు తీసుకోవడంలో నిమగ్నమైపోయారన్నారు. పలు విషయాలపై గంభీరంగా రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా కనీసం ఆ అంశాలపై రాహుల్ దృష్టి పెట్టలేదన్న బీజేపీ సభ్యుల ఆరోపణల్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ విలేకర్ల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలపై దృష్టి పెట్టిన రాహుల్ వాటిపైనే తమ నాయకురాలు సోనియాతో చర్చిస్తున్నట్లు వివరించారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇటీవల పుల్వామా దాడిలో మృతి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల స్మృత్యర్థం మౌనం పాటిస్తున్న సందర్భంలోనూ రాహుల్ ఫోన్ చూసుకోవడంలో నిమగ్నమయ్యారంటూ బీజేపీ సభ్యుడు పరేశ్ రావల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ లో షేర్ చేసిన వీడియో, ఫొటోలు నకిలీ వంటూ నెటిజెన్లు రావల్ పై మండిపడ్డారు. ఓ వైపు రాహుల్ ఫోన్ చేసుకుంటున్నట్లున్న దృశ్యంతో పాటు మరో పక్క ప్రధాని మోదీ గౌరవ వందనం చేస్తున్న ఫొటోను జత చేసి రావల్ ఫేస్ బుక్ పోస్టులో ఫొటో పెట్టారు. ఈ ఫొటోను చూస్తేనే ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి నాయకత్వంలో ఎంత తేడా ఉందో సుస్పష్టమౌతోందని కామెంట్ రాశారు. అయితే రాహుల్ ఫోన్ చూసుకుంటున్నట్లున్న ఫొటో నకిలీదిగా తేల్చిన కొందరు నెటిజన్లు `ఇది బుద్ధిమాలిన పని..నకిలీ వార్తాహరుడు పరేశ్ రావల్ మన ఎంపీ కావడం సిగ్గు చేటు` అని పేర్కొన్నారు.

Wednesday, June 19, 2019

Captain Williamson leads Newzealand to consecutive win


దక్షిణాఫ్రికాపై సెంచరీతో జట్టును గెలిపించిన కివీస్ కెప్టెన్
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ సాధించిన కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ కు దక్షిణాఫ్రికాపై చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. వరల్డ్ కప్-12 ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం ద.ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ నం.25లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 49 ఓవర్లలో సఫారీలు 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేశారు. ఓపెనర్ హషీం అమ్లా (55), మిడిల్ ఆర్డర్ లో రస్సీ వేండర్ డస్సెన్ (67) మాత్రమే రాణించారు. కివీస్ బౌలర్లలో లకీ ఫెర్గుసన్ 3 వికెట్లు తీసుకోగా ట్రెంట్ బౌల్ట్, కోలిన్ డె గ్రాండ్ హోమ్, మిషెల్ శాంటనర్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 242 పరుగుల విజయం లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ చక్కటి గేమ్ ప్లాన్ తో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కోలిన్ మన్రో(9) వికెట్ ను న్యూజిలాండ్ కోల్పోయింది. రబాడ కాట్ అండ్ బౌల్డ్ గా మన్రోను పెవిలియన్ చేర్చాడు. వన్డౌన్లో బ్యాటింగ్ కు దిగిన విలియమ్సన్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును కదిలించాడు. మరో ఓపెనర్ గుఫ్తిల్ (35) కెప్టెన్ కు అండగా క్రీజ్ లో నిలిచాడు. రెండో వికెట్ కు 15 ఓవర్లలో వీరిద్దరు 60 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 72 పరుగుల వద్ద అండిల్ ఫెహ్లుక్వయో బౌలింగ్ లో హిట్ వికెట్ గా గుప్తిల్ వెనుదిరిగాడు. అప్పటి నుంచి బాధ్యతంతా విలియమ్సన్ భుజాలపై పడింది. మరో రెండు పరుగుల స్కోరు తర్వాత రాస్ టేలర్(1) మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కివీస్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ టామ్ లాథమ్(1) కూడా యాక్షన్ రిప్లే మాదిరిగా మోరిస్ బౌలింగ్ లో కీపర్ డీకాక్ కే క్యాచ్ ఇఛ్చి అదే ఓవర్లో పెవిలియన్ చేరడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. జేమ్స్ నీషమ్ (23) మోరిస్ బౌలింగ్ లో అమ్లాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అప్పటికి న్యూజిలాండ్ స్కోరు 32.2 ఓవర్లలో 137 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ తో జత కలిసిన కోలిన్ గ్రాండ్ హోమ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 60 పరుగులు చేసి చివరి ఓవర్లలో నిగిడి బౌలింగ్ లో సఫారీల కెప్టెన్ డూప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి క్రీజ్ ను వదిలాడు. విజయం అంచుల వరకు వచ్చిన కివీస్ ను గెలిపించే బాధ్యత విలియమ్సన్ తీసుకున్నాడు. 48 ఓవర్ చివరి బంతికి స్లిప్స్ దిశగా బౌండరీ సాధించాడు. చివరి ఓవర్ 8 పరుగులు కావాల్సి ఉండగా తొలి బంతిని మిషెల్ శాంటనెర్ సింగిల్ తీయడంతో స్ట్రయికింగ్ వచ్చిన విలియమ్సన్.. అండిల్ వేసిన స్లో డెలివరీని సిక్సర్ గా మలిచి వరల్డ్ కప్ లో తొలి సెంచరీ(103*) చేశాడు. గెలుపునకు కావాల్సిన చివరి రన్ ను సింగిల్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ను గెలుచుకున్నాడు. కివీస్ 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 242 లక్షాన్ని ఛేదించింది. ఈ ఓటమితో ద.ఆఫ్రికాకు సెమీస్ అవకాశాలు చేజారినట్టే. సఫారీ బౌలర్లలో క్రిస్ మోరిస్ 3 వికెట్లు, కగిసొ రబాడ, లంగి నిగిడి, అండెల్ తలో వికెట్ తీసుకున్నారు. కెప్టెన్ గా 3000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ జాబితాలో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సరసన విలియమ్సన్ చేరాడు.