ఆస్ట్రేలియా చేతిలో పోరాడి
ఓడిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మరో మెట్టు
పైకెదిగింది. ఆసియా క్రికెట్ లో భారత్ సరసన నిలిచే స్థాయి తమకే ఉందని బంగ్లాదేశ్ క్రికెట్
జట్టు నిరూపించుకుంది. ఐసీసీ వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.26 నాటింగ్
హామ్ వేదికపై గురువారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టుపై బంగ్లాదేశ్ పోరాడి 48
పరుగుల తేడాతో ఓడింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 5వికెట్లు
కోల్పోయి 381 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ కనబర్చిన
తెగువ ఆ జట్టు ఓడినా క్రికెట్ అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. వికెట్ కీపర్
బ్యాట్స్ మన్ ముష్పికర్ రహీం సెంచరీ (102*), ఓపెనర్
తమిమ్ ఇక్బాల్ (62), షాకిబ్ అల్ హసన్(41), మహ్మదుల్లా(69) పరుగులతో చివరి వరకు విజయం కోసం పోరాడారు. వెస్టిండీస్ పై
గెలుపును ఈ మ్యాచ్ లో రిపీట్ చేస్తుందా అన్నట్లుగా బంగ్లాదేశ్ జట్టు ఆస్ట్రేలియాకు
చెమటలు పట్టించింది. అయిదో వికెట్ గా మహ్మదుల్లా అవుటయ్యా సరికి రహీంతో కలిసి 127
పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జట్టు 44 ఓవర్లు ముగిసే సరికి 302 పరుగులు
నమోదు చేసింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ 333 పరుగులు
చేసింది. కంగారూ బౌలర్లలో మిషెల్ స్టార్క్, నాథన్ కోల్టర్ నైల్, మార్కస్
స్టోయినిస్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అడమ్ జంపా ఓ వికెట్ తీసుకున్నాడు. తొలుత
బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరే లక్ష్యంగా పరుగులు చేసింది. ఓపెనర్
డేవిడ్ వార్నర్ చెలరేగిపోయి 5 సిక్సర్లు, 14 బౌండరీలతో 166 పరుగులు చేశాడు. మరో
ఓపెనర్ కెప్టెన్ ఆరన్ ఫించ్(53), ఉస్మాన్ ఖవాజా(89)లు అర్ధ సెంచరీ లతో కదం
తొక్కారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన గ్లెన్ మాక్స్ వెల్ కూడా 10 బంతుల్లోనే 32
పరుగులు రాబట్టాడు. మార్కస్ స్టోయినిస్ 17 పరుగులతో కీపర్ అలెక్స్ కేరీ 11
పరుగులతో నాటౌట్ గా నిలిచారు. బంగ్లా బౌలర్లలో సౌమ్య సర్కార్ 3 వికెట్లు, ముస్తాఫైజర్
రహ్మాన్ ఓ వికెట్ పడగొట్టారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వార్నర్ గెలుచుకున్నాడు.