Sunday, June 16, 2019

Avon march in prague most of the women dressed in pink


ప్రేగ్ లో ఘనంగా ఎవాన్ మార్చ్
చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో ఎవాన్ మార్చ్ 19వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు వారి తల్లిదండ్రులకు సంఘీభావంగా ఏటా ఎవాన్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ మార్చ్ లో వేల సంఖ్యలో మహిళలు గులాబీ రంగు దుస్తుల్లో పాల్గొనడం రివాజు. జున్ 15 శనివారం ప్రేగ్లోని ఓల్డ్ టౌన్ స్కేర్ లో మార్చ్ కు పెద్ద సంఖ్యలో హాజరైన యువతులు అనంతరం వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మన మనసుల్లో ఏముందో ముఖ్యం కాదు మనం అందరి హృదయాలకు ఏమి చేరుస్తున్నామన్నదే ప్రధానం’  అనే నినాదంతో ఈ ఏడాది ఎవాన్ మార్చ్ నిర్వహించారు. ద ఎవాన్ హెల్త్ బ్రెస్ట్ ప్రాజెక్టు సంస్థ పింక్ రిబ్బన్ లతో కూడిన ఉత్పత్తుల్ని, ఎవాన్ మార్చ్ టి-షర్టుల్ని ఈ సందర్భంగా విక్రయించింది. బ్రెస్ట్ కేన్సర్ తో బాధపడుతున్న వారికి సహాయంగా నిర్వహించే స్వచ్ఛంద కార్యక్రమాలకు ఈ సొమ్మును ఆ సంస్థ అందజేస్తుంది. ఏటా చెక్ రిపబ్లిక్ లో 7వేల మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో 1900 మంది మరణిస్తున్నట్లు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బయో స్టాటస్టిక్స్ అండ్ అనలైజెస్ ఆఫ్ ది ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసన్ ఆఫ్ ది మసారిక్ యూనివర్సిటీ, చెక్ అసోసియేషన్ ఆఫ్ మేమోడయాగ్నొస్టిక్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది. కణతిని కేన్సర్ తొలిదశలోనే గుర్తిస్తే 90 శాతం వ్యాధిని నివారించే అవకాశముంటుంది. మేమోగ్రఫీ విధానంలో చేసిన బ్రెస్ట్ కేన్సర్ పరీక్షల ద్వారా అత్యంత సమర్ధంగా కచ్చితమైన నివేదికను పొందొచ్చు.

Uttara Pradesh dgp took out traffic awareness rally in lucknow


ట్రాఫిక్ చైతన్యం కోసం యూపీ డీజీపీ సైకిల్ ర్యాలీ
వాహనచోదకులకు ట్రాఫిక్ చైతన్యం కల్పించడంలో భాగంగా ఉత్తరప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఓం ప్రకాశ్ సింగ్ ఆదివారం లక్నోలో సైకిల్ ర్యాలీ చేపట్టారు. కాళీదాసు మార్గం రోడ్ నం.5లో  ఉదయం 6 కు ప్రారంభించిన ర్యాలీ సుమారు 10 కిలోమీటర్లు సాగింది. లాల్ బాగ్ వద్ద కు చేరుకున్న అనంతరం డీజీపీ ఓంప్రకాశ్ మాట్లాడుతూ వాహనచోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ముఖ్యంగా మోటారు బైక్ లు నడిపేవారు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించడం తప్పనిసరన్నారు. తద్వారా వారి ప్రాణాలకే కాక సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు. అదే విధంగా కార్లు నడిపే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. శరీర వ్యాయామానికి, ఆరోగ్యానికి సైకిల్ తొక్కడం (సైక్లింగ్) ఎంతో మేలంటూ అది ప్రజలకే కాక పోలీసులకు వర్తిస్తుందని తెలియపర్చడానికే ఈరోజు ఈ సైకిల్ ర్యాలీ చేపట్టినట్లు డీజీపీ వివరించారు. ఈ ర్యాలీలో డీజీపీ ఓం ప్రకాశ్ వెంట ఎస్.ఎస్.పి. కళానిధి నాథని, ఏడీజీ రాజీవ్ కృష్ణ, ఎస్పీ వికాస్ చంద్ర త్రిపాఠి సహా పలువురు పోలీసులు పాల్గొన్నారు. దేశంలో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 15 వేల మంది దుర్మరణం చెందడమో తీవ్ర గాయాలపాలై ఆసుపత్రులకు పరిమితమౌతోన్న ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. వీటిలో అధిక శాతం మరణాలు హెల్మెట్ ధరించని మోటారు బైక్ చోదకులు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు డ్రైవ్  చేస్తున్నవారివే కావడం గమనార్హం. ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే రోజూ 98 మంది బైకర్లు హెల్మెట్ పెట్టుకోక రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. యూపీలో ఈ సంఖ్య 2019 నాటికి తగ్గినా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే మరణాలు రోడ్డు ప్రమాదాల్లో నమోదవుతున్నాయి.

Saturday, June 15, 2019

South Africa first win knock in icc world cp at kardiff against afghanistan


దక్షిణాఫ్రికాకు తొలి విజయం:చిత్తయిన అప్ఘానిస్థాన్

ఐసీసీ వరల్డ్ కప్-12లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని అందుకుంది. మ్యాచ్ నం.21 కార్డిఫ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్లో ద.ఆఫ్రికా టాస్ గెలిచి అప్ఘానిస్థాన్ ను బ్యాటింగ్ కు దింపింది. వర్షం వల్ల 48 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో అప్ఘాన్ బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడారు. ప్రత్యర్థి ద.ఆఫ్రికాకు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ద.ఆఫ్రికా విజయం నల్లేరు మీద బండి నడకే అయింది. 28.4 ఓవర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్(68)వికెట్ ను మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. మరో ఓపెనర్ హషీం అమ్లా 41 పరుగులు, ఫెహ్లుక్వయో 17 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ నైబ్ మాత్రమే ఓ వికెట్ పడగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘానిస్థాన్ జట్టులో చలాకీ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఒక్కడే మిడిల్ ఆర్డర్ లో చెప్పుకోదగ్గ పరుగులు చేయడంతో 100 పరుగుల మార్క్ ను అప్ఘానిస్థాన్ దాట గల్గింది. జట్టు మొత్తం 34.1 ఓవర్లలోనే 125 పరుగులకు ఆలౌటయింది. టాప్ స్కోరర్ రషీద్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్లు నూర్ జర్దాన్(32), హజ్రతుల్లా జజాయ్(22) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ద.ఆఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 29/4 వికెట్లు, పొదుపుగా పరుగులిచ్చిన క్రిస్ మోరిస్ 13/3 వికెట్లు , ఫెహ్లుక్వయో 18/2 వికెట్లు తీసుకోగా రబాడ36/1 వికెట్ పడగొట్టారు. 


CM Jagan tremendous speech in NITI aayog meeting



నీతి ఆయోగ్ భేటీలో అదరగొట్టిన జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ యావద్దేశానికి బలంగా తన వాదనను వినిపించారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు, సీనియర్ కేంద్రమంత్రులు సాక్షిగా తన వాణితో ఆకట్టుకున్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ విముఖంగా ఉన్న ప్రత్యేకహోదా అంశంపై జగన్ సాహసోపేతంగా మాట్లాడిన తీరు పలువురు ముఖ్యమంత్రుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా ఏర్పడిన కొత్త రాష్ట్రంలో 59 శాతం జనాభా ఉండగా 47 శాతం ఆదాయాన్ని పంచడం అసమంజసమన్నారు. ఒక వ్యవసాయాధారిత రాష్ట్రంగా ప్రస్తుతం ఏపీ మిగిలిపోయిందన్నారు. ఉపాధి కోసం రాష్ట్ర యువత, జనాభా వలసబాట పడుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విభజన హామీలిచ్చిన ప్రభుత్వం,2014 నాటి కొత్త ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడలేదన్నారు. తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువన్నారు. విభజన నాటికి ఏపీ అప్పులు రూ.97 వేల కోట్లు కాగా ప్రస్తుతం రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని ఏటా అసలు, వడ్డీలకు కలిపి రూ.40 వేల కోట్లు చెల్లించాల్సిన అగత్యం పట్టిందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఆర్థికంగా కాస్తయినా నవ్యంధ్రప్రదేశ్ కోలుకోగలదని జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేకహోదా తమకు సంబంధించిన అంశం కాదని దీనిపై తాము ఏవిధమైన నివేదికలు ఇవ్వడం విముఖత తెల్పడం చేయలేదన్నారని చెప్పారు. అభిజిత్ సేన్ పేర్కొన్న ఈ అంశం ప్రతిని జగన్ నీతి ఆయోగ్ సమావేశం ముందుంచారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారు. గత నీటి ఆయోగ్ సమావేశంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు స్వల్ప సమయమే ఇచ్చినా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకత అంశాన్ని సమర్ధంగా వినిపించారు.