Saturday, June 15, 2019

CM Jagan tremendous speech in NITI aayog meeting



నీతి ఆయోగ్ భేటీలో అదరగొట్టిన జగన్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి ముఖ్యమంత్రి జగన్ యావద్దేశానికి బలంగా తన వాదనను వినిపించారు. శనివారం నీతి ఆయోగ్ సమావేశంలో పలువురు ముఖ్యమంత్రులు, సీనియర్ కేంద్రమంత్రులు సాక్షిగా తన వాణితో ఆకట్టుకున్నారు. సాక్షాత్తు ప్రధాని మోదీ విముఖంగా ఉన్న ప్రత్యేకహోదా అంశంపై జగన్ సాహసోపేతంగా మాట్లాడిన తీరు పలువురు ముఖ్యమంత్రుల్ని ముగ్ధుల్ని చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా ఏర్పడిన కొత్త రాష్ట్రంలో 59 శాతం జనాభా ఉండగా 47 శాతం ఆదాయాన్ని పంచడం అసమంజసమన్నారు. ఒక వ్యవసాయాధారిత రాష్ట్రంగా ప్రస్తుతం ఏపీ మిగిలిపోయిందన్నారు. ఉపాధి కోసం రాష్ట్ర యువత, జనాభా వలసబాట పడుతోందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు విభజన హామీలిచ్చిన ప్రభుత్వం,2014 నాటి కొత్త ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడలేదన్నారు. తెలంగాణ కంటే ఏపీ తలసరి ఆదాయం తక్కువన్నారు. విభజన నాటికి ఏపీ అప్పులు రూ.97 వేల కోట్లు కాగా ప్రస్తుతం రూ.2.59 లక్షల కోట్లకు చేరాయని ఏటా అసలు, వడ్డీలకు కలిపి రూ.40 వేల కోట్లు చెల్లించాల్సిన అగత్యం పట్టిందని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ద్వారానే ఆర్థికంగా కాస్తయినా నవ్యంధ్రప్రదేశ్ కోలుకోగలదని జగన్ అన్నారు. 14వ ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ ప్రత్యేకహోదా తమకు సంబంధించిన అంశం కాదని దీనిపై తాము ఏవిధమైన నివేదికలు ఇవ్వడం విముఖత తెల్పడం చేయలేదన్నారని చెప్పారు. అభిజిత్ సేన్ పేర్కొన్న ఈ అంశం ప్రతిని జగన్ నీతి ఆయోగ్ సమావేశం ముందుంచారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారు. గత నీటి ఆయోగ్ సమావేశంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు స్వల్ప సమయమే ఇచ్చినా రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఆవశ్యకత అంశాన్ని సమర్ధంగా వినిపించారు.

No comments:

Post a Comment