ప్రధాని మోదీని కలిసిన కర్ణాటక సీఎం కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం రాజధాని ఢిల్లీలో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. రాష్ట్రం కరవుతో అల్లాడుతోందని తక్షణ
సాయంగా రూ.2,064 కోట్లు మంజూరు చేయాలని కోరారు. కర్ణాటకలో 45శాతం తక్కువ వర్షపాతం
నమోదయి కరవు పరిస్థితులు నెలకొని రైతులు ఇబ్బందులు పాలవుతున్నారన్నారు. లోక్ సభ
ఎన్నికలకు ముందే ఈ మేరకు ఆయన సహాయం విషయమై ప్రధాని మోదీకి వినతిపత్రం సమర్పించారు.
అంతేకాకుండా కర్ణాటకకు కేంద్రం పెండింగ్ లో ఉంచిన నిధులు రూ.1500 కోట్లను కూడా
విడుదల చేయాలని సీఎం కుమారస్వామి ప్రధానికి విజప్తి చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎం.ఎన్.ఆర్.ఇ.జి.ఎ) కింద ఈ మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని
30 జిల్లాల్లో గల 156 తాలూకాలు కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో
107 తాలూకాల్లో తీవ్ర కరవు తాండవిస్తోంది. సుమారు 20.40 లక్షల హెక్టార్ల సాగు భూమి
కరవుతో ప్రభావితమైందని అందులో 19.46 లక్షల హెక్టార్ల సాగుభూమి బీడు పడినట్లు
కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది.