ప్రధాని మోదీకి అకస్మాత్తుగా కేరళపై ప్రేమ ఎందుకు కల్గింది?:రాహుల్
హఠాత్తుగా ప్రధాని మోదీకి కేరళపై ఎందుకు ప్రేమ పుట్టిందో అర్థం కావడం లేదని
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చమత్కరించారు. తనకు ఘన విజయాన్ని కట్టబెట్టిన
వాయ్ నాడ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు మూడ్రోజుల పాటు కేరళ పర్యటనకు
రాహుల్ విచ్చేసిన విషయం విదితమే. ఆదివారం(జూన్9) ఆయన పర్యటన ముగించుకుని ఢిల్లీ
తిరిగి వెళ్లారు. అంతకు ముందు ఆయన కోజికోడ్ విమానాశ్రయంలో ఢిల్లీ తిరిగి వెళ్లే ముందు విలేకర్లతో ముచ్చటించారు. మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాలపై చూపిన మమకారం
బీజేపీయేతర ప్రభుత్వాలపై ఎప్పుడూ చూపలేదనడానికి అనేక ఉదాహరణలున్నాయన్నారు.
ముఖ్యంగా కేరళలో సీపీఐ(ఎం) నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ప్రభుత్వం పాలన చేస్తుండగా
ప్రధాని మోదీకి ఆకస్మికంగా ఈ రాష్ట్రంపై ప్రేమ కల్గడం అనుమానాలకు తావిస్తోందని
రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ కేరళ పర్యటనలో ఉండగానే ప్రధాని మోదీ రెండ్రోజుల
పాటు తొలి విదేశీ పర్యటన (మాల్దీవులు,
శ్రీలంక)కు వెళ్తూ శనివారం హఠాత్తుగా గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని
సందర్శించడానికి వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ కేరళ పర్యటనలో వాయ్ నాడ్,
మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి
ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన ఎంగపుజ్హ,
ముక్కం పట్టణాల్లో రోడ్ షోల్లో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మోదీ
దేశాన్ని విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ కేరళను
ఉత్తరప్రదేశ్ తో సమానంగా ఆదరిస్తారని తాను భావించడం లేదని రాహుల్ అన్నారు.
49 ఏళ్లకు.. నర్సు రాజమ్మను కలుసుకున్న రాహుల్
ఢిల్లీ హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో
అప్పుడే పుట్టిన తనను చేతుల్లోకి తీసుకున్న నర్సు రాజమ్మ వావిథిల్ ను ఆదివారం
రాహుల్ గాంధీ కలుసుకున్నారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు తొలిసంతానంగా రాహుల్
1970 జూన్ 19న జన్మించినప్పుడు రాజమ్మ ట్రైనీ నర్సుగా అదే ఆసుపత్రిలో
పనిచేస్తున్నారు. సోనియా ప్రసవం సమయంలో విధులు నిర్వర్తించిన రాజమ్మ..రాహుల్ ను
తొలిసారి చేతుల్లోకి తీసుకున్నారు. రాహుల్ వాయ్ నాడ్ లో పోటీ చేస్తున్నారని తెలిసి
సంబరపడిన రాజమ్మ ఆయనను కలుసుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం పదవీ విరమణ
చేసి కేరళలోనే ఉంటున్న రాజమ్మను తన పర్యటన సందర్భంగా రాహుల్ ప్రత్యేకంగా పిలిపించుకుని
కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు.