Thursday, June 6, 2019

at last kiwis won by 2 wickets against bangladesh


బంగ్లాదేశ్ పై గెలుపునకు చెమటోడ్చిన కివిస్
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.9 లండన్ ఒవల్ మైదానంలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు శ్రమించి ఎట్టకేలకు విజయం సాధించింది. టాస్ గెలిచిన కివిస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్ ను తొలుత బ్యాటింగ్ చేయాలని కోరాడు. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లకు గాను 49.2 ఓవర్లు ఆడి 244 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యం సునాయాసంగా కనిపించినా బంగ్లా బెబ్బులిలా పోరాడ్డంతో కివిస్ బ్యాట్స్ మన్ గెలుపునకు చెమటోడ్చాల్సి వచ్చింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ రాస్ టెలర్ 91 బంతుల్లో 82 పరుగులు చేయడంతో కివిస్ గెలుపు వాకిట నిలువగల్గింది. టెలర్ కు కేన్ విలియమ్సన్ 72 బంతుల్లో 40 పరుగులు అండగా నిలిచాడు. జట్టులో మార్టిన్ గుప్తిల్ 14 బంతుల్లో 25 పరుగులు, జేమ్స్ నిషమ్ 33 బంతుల్లో 25 పరుగులు చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బంగ్లా బౌలర్లలో మొసాదెక్ హోసేన్ పొదుపుగా 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సైఫుద్దీన్ 41 పరుగులకు 2 వికెట్లు, మెహిది హసన్ 47 పరుగులిచ్చి 2 వికెట్లు, షాకిబ్ అల్ హసన్ 47 పరుగులకు 2 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. పటిష్టమైన కివిస్ జట్టు గెలుపు ఖాయమని తెలిసినా బంగ్లా బౌలర్లు క్రమతప్పకుండా వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు సడలకుండా ఆడారు. ఓడినా తుదివరకు పోరాడి క్రికెట్ అభిమానుల్ని అలరించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టులో షాకిబ్ అల్ హసన్ 68 బంతుల్లో 64 పరుగులు, మహ్మద్ సైఫుద్దీన్ 29, మహ్మద్ మిథున్ 26 పరుగులతో బంగ్లా జట్టు 244 పరుగులు స్కోరు చేయగల్గింది. కివిస్ బౌలర్లలో మాథ్యూ జేమ్స్ హెన్రీ 47 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు, ఫెర్గుసన్,మిషెల్ శాంటనర్,గ్రాండ్ హోమ్ తలా ఓ వికెట్ తీశారు. ఈ రోజు మ్యాచ్ లో బంగ్లా బ్యాట్స్ మెన్ కన్నా ఆ జట్టు బౌలర్లు సమష్ఠిగా రాణించి క్రమతప్పకుండా కివిస్ బ్యాట్స్ మెన్ వికెట్లు తీస్తూ ఒత్తిడి తెచ్చారు. చివరికి న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. కివిస్ కిది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్ లో శ్రీలంకపైనా గెలుపొందింది. బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది.

Wednesday, June 5, 2019

Gujarat: Five killed as car jumps divider and hits tempo



గుజరాత్ లో కారు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంజాన్ పర్వదినం రోజున బుధవారం (జూన్5) ఉదయం కారు ఎదురుగా వస్తున్న టెంపోను ఢీకొన్న ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన నవసరి జిల్లాలోని ఖరెల్ ప్రాంతంలో సంభవించింది. కారు సూరత్ కు ప్రయాణిస్తోంది. జాతీయ రహదారిపై అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు తొలుత రోడ్డు డివైడర్ ను ఢీకొట్టి పక్క లైన్ లోకి ఎగిరిపడి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టెంపోను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ మితిమీరిన వేగంతో కారు నడుపుతుండడం వల్లే దానిపై నియంత్రణ కోల్పోయినట్లు గాన్దేవి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. కారు మొత్తం నుజ్జునుజ్జయిపోవడంతో అందులో నుంచి మృతదేహాల్ని చాలా సమయం శ్రమించి బయటకు తీయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గాన్దేవి ఆసుపత్రి మార్చురికి మృతదేహాల్ని తరలించారు.

Tuesday, June 4, 2019

srilanka beat afganistan by 34 runs cricket world cup match number 7


అప్ఘానిస్థాన్ పై 34 పరుగుల తేడాతో గెలిచిన శ్రీలంక
వరల్డ్ కప్-12 మ్యాచ్ నం.7లో అప్ఘానిస్థాన్ ను ఓడించి శ్రీలంక టోర్నీలో తొలి గెలుపునందుకుంది. మంగళవారం కార్డిఫ్ సోఫియా గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన అప్ఘాన్ కెప్టెన్ గుల్బద్దీన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక పడుతూ లేస్తూ 201 పరుగులకు(36.5 ఓవర్లకే) ఆలౌటయింది. వర్షం కారణంగా మధ్యలో మ్యాచ్ కు ఆటంకం కల్గడంతో డక్ వర్త్ లూయిస్ నిబంధనలు(డీఎల్ఎస్) ప్రకారం 41 ఓవర్లలో 187 పరుగుల విజయలక్ష్యంతో అప్ఘాన్ బ్యాటింగ్ కు దిగింది.జట్టులో నజీబుల్లా జర్దాన్ 56 బంతుల్లో 43 పరుగులు, హజ్రతుల్లా జజయ్ 25 బంతుల్లో 30 పరుగులు, గుల్బద్దీన్ నయీబ్ 32 బంతుల్లో 23 పరుగులు మాత్రమే రాణించారు. స్వల్ప స్కోరు ను ఛేదించడం సులభమేనన్న భ్రమలో అప్ఘాన్ బ్యాట్స్ మన్ తేలిగ్గా తీసుకోవడంతోనే ఆరంభంలో త్వరత్వరగా వికెట్లను కోల్పోయారు. ఆ తర్వాత ఛేదనలో పుంజుకుంటున్న దశలో అప్ఘాన్ వికెట్లు కాపాడుకోలేక పోవడంతో ఓటమి పాలయింది. శ్రీలంక స్ట్రయిక్ బౌలర్లు నువాన్ ప్రదీప్ 4 వికెట్లు, లసిత్ మలింగా 3 వికెట్లు తిసర పెరెరా, ఇసుర ఉదాన చెరో వికెట్ తీసుకుని అప్ఘాన్ పతనాన్ని శాసించారు. 32.4 ఓవర్లకే ఆలౌటయిన అప్ఘానిస్థాన్ బ్యాట్స్ మన్ 152 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక టోర్నీ తొలిమ్యాచ్ లో మూడ్రోజుల క్రితం ఇదే వేదికపై న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడినా 34 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో గెలిచి ముందంజ వేసింది. శ్రీలంక బ్యాట్స్ మన్లలో కుశాల్ పెరెరా 81 బంతుల్లో 78 పరుగులతో రాణించాడు. కెప్టెన్ దిముత్ కరుణరత్నే 45 బంతుల్లో 30 పరుగులు, లహిరుతిరుమాన్నె 34 బంతుల్లో 25 పరుగుల చేయడంతో శ్రీలంక చెప్పుకోదగ్గ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగల్గింది. అప్ఘాన్ బౌలర్లలో మహ్మద్ నబీ 4/30 రషీద్ ఖాన్2/17 దవ్లాత్ జర్దాన్ 2/34 రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా శ్రీలంక పేసర్ నువాన్ ప్రదీప్ (4/31) నిలిచాడు.

Tiger attacks linesman in Madhya Pradesh



పులి దాడిలో లైన్ మన్ కు తీవ్రగాయాలు
మధ్యప్రదేశ్ లోని సియొని జిల్లాలో పెద్దపులి దాడిలో రాష్ట్ర విద్యుత్ శాఖ సిబ్బంది ఒకరు తీవ్రగాయాల పాలయ్యారు. మంగళవారం (జూన్4) జరిగిన ఈ ఘటనలో 58ఏళ్ల యశ్వంత్ బైసెన్ అనే లైన్ మన్ తీవ్రంగా గాయపడినట్లు అటవీ శాఖాధికారి రాకేశ్ కొడొపె తెలిపారు. పరస్పాని గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో సాయంత్రం 5 సమయంలో విద్యుత్ సిబ్బంది లైన్ మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఈదురుగాలులకు ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు తెగిపోవడంతో వాటిని సరిచేస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది. సిబ్బంది పనుల్లో నిమగ్నమై ఉండగా పొదల చాటున మాటువేసిన పులి ఒక్కసారిగా బైసెన్ పైకి దూకింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడినా అతను అలారం మోగించడంతో మిగిలిన సిబ్బంది, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో కేకలు వేస్తూ ఘటనా స్థలానికి చేరుకోవడంతో పులి అడవిలోకి పారిపోయింది. ఈ వారంలో ఈ ప్రాంతంలో పులి దాడి ఘటనల్లో ఇది రెండోది. 22 ఏళ్ల పంచాం గజ్బా కూడా ఇదే ప్రాంతంలో పులి దాడిలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనలో గాయపడిన బైసెన్ ను సమీపంలోని కురై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.