Sunday, May 12, 2019

37 bangladeshi migrants drowned in tunisia coast



తునిసియా తీరంలో 37 మంది బంగ్లాదేశ్ వలసదారుల మృతి
తునిసియా సమీపంలోని మధ్యధరా సముద్రంలో బోటు మునిగిపోయిన దుర్ఘటనలో 37 మంది బంగ్లాదేశ్ జాతీయులు మృత్యుపాలయ్యారు. శుక్రవారం బోటు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ట్రిపోలీ లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మొమెన్ మృతుల సంఖ్యను నిర్ధారించడం లేదు. తమ దేశీయులు 37 మంది జాడ తెలియడం లేదని మాత్రమే పేర్కొన్నారు. బోటు ప్రమాదానికి గురయ్యే సమయానికి మొత్తం 60 మంది అందులో ప్రయాణిస్తున్నారు. వారిలో 51 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులే ఉన్నారు. అందులో 16 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. ఇంకా జాడ తెలియని వారిలో ఈజిప్ట్, మొరాకో జాతీయులు ఉన్నారు. వీరంతా లిబియా(జౌరా) నుంచి యూరప్ కు బోటులో ప్రయాణిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. బోటు మునకకు కారణాలు తెలియాల్సి ఉంది. యూరప్ లో బతుకు తెరువు కోసం ప్రమాద మార్గంలో(అనుమతి లేని బోట్లు, పడవల్లో) ప్రయాణిస్తూ చాలా మంది సముద్ర జలాల్లో మునిగి చనిపోతున్నారు.

pakistan security forces kill attackers after raid on luxury hotel



పాకిస్థాన్ స్టార్ హోటల్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తి
పాకిస్థాన్ నావికాదళ భద్రతా బలగాలు పెర్ల్ కాంటినెంట్ లో ఉగ్రవాదుల ఏరివేత పూర్తయిందని ఆదివారం (మే12) ప్రకటించాయి. శనివారం ఉదయం 5 సమయంలో హోటల్ లో దాగి ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని కాల్చి వేసిన సంగతి తెలిసిందే. సముద్ర తీర నగరం గ్వదర్ లో భద్రతా బలగాలు తనఖీలు నిర్వహిస్తూ ఉగ్రవాదుల ఉనికిని కనుగొన్నాయి. ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. అంతకుముందు వారు ముగ్గురు హోటల్ సిబ్బందిని కాల్చి చంపారు. హోటల్ లో ప్రవేశిస్తున్న ఉగ్రవాదుల్ని గార్డు అడ్డుకోగా అతణ్ని కాల్చేశారు. సమాచారం అందుకున్న పాక్ నావికాదళానికి చెందిన భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టగా హోటల్ మెట్ల దారిలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దాంతో ఎదురు కాల్పులు జరిపి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. ఈ దాడి తమ పనేనని `మజీద్ బ్రిగేడ్ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్గనైజేషన్` ట్విటర్ లో పేర్కొంది. ఇదే గ్రూపు గత ఏడాది కరాచిలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి చేసింది. బలూచ్ జిల్లాలోని చాగై లోనూ చైనా ఇంజినీర్లపై దాడి చేశారు. పాక్ లో అత్యంత పేదరికం ఉన్న ప్రావిన్స్ అయిన గ్వదర్ లో సహజవనరులు అపారంగా ఉన్నాయి. సహజవాయువుతో పాటు, అపారమైన ఖనిజ సంపద అక్కడ ఉంది. అరేబియా సముద్రంలో గ్వదర్ వ్యూహాత్మక ఓడరేవు ప్రాంతం. చైనా పాకిస్థాన్ దేశాల ఎకనామిక్ కారిడర్ అభివృద్ధి ప్రాజెక్ట్  లో భాగంగా రూ.41వేల9వందల కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. చైనా ఈ కారిడార్ లో రహదారి నిర్మాణానికి రూ.34 వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే ఏడాది కాలంగా ఇక్కడ ఉగ్రదాడులు చోటు చేసుకుంటున్నాయి. గత నెలలో గ్వదర్ నుంచి కరాచికి వెళ్లున్న బస్సులపై ఉగ్రవాదులు దాడులు చేసి 14 మందిని పొట్టనబెట్టుకున్నారు. పెర్ల్ కాంటినెంటల్ లో ఎక్కువగా విదేశీ పర్యాటకులు బస చేస్తుంటారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన చైనా సిబ్బంది ఎక్కువగా ఇదే హోటల్ లో ఉంటుంటారు. అయితే తాజా ఎదురుకాల్పుల సమయంలో వీరెవరు ఆ హోటల్ లో లేనట్లు సమాచారం.

Saturday, May 11, 2019

india vietnam target $15billion trade by 2020



వియత్నాంతో భారత్ రూ.లక్ష కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా అడుగులు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజుల వియత్నాం పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ నేతల్ని కలుసుకున్నారు. ఆయన వియత్నాం వైస్ ప్రెసిడెంట్ డాంగ్ థి న్యాగో థిన్, ప్రధానమంత్రి నగైయెన్ జువాన్ ఫాక్ తదితర నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల నేతలు ద్వైపాక్షిక వాణిజ్యం, రాజకీయ, రక్షణ, భద్రత తదితర అంశాలపై చర్చలు జరిపారు. భారత్, వియత్నాంలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించాయి. న్యాగోథిన్ ను భారత్ లో పర్యటించాల్సిందిగా వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆగ్నేయాసియా (ఏషియాన్)లో భాగస్వామ్య దేశాలైన భారత్, వియత్నాంలు 2020 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రూ.లక్షా 4వేల కోట్ల (15బిలియన్ డాలర్లు) స్థాయికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గత ఏడాదిగా ఉభయ దేశాలు రూ.94 వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యం కొనసాగిస్తున్నాయి. 2007 నుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అమలులో ఉండగా ద్వైపాక్షిక వాణజ్యం రూ.54వేల కోట్ల స్థాయిలో జరిగింది. ప్రత్యేకించి ఈ ఏడాది నుంచి ఐ.టి.రంగం, ఎనర్జీ, పునరుత్పాదక శక్తి రంగం, మౌలికసౌకర్యాలు, ఆధునిక వ్యవసాయం, ఆయిల్, గ్యాస్ ఉత్పాదన తదితర రంగాల్లో ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయించాయి.


fani cyclonic storm:south central railway loses around Rs.3 crore


 దక్షిణ మధ్య రైల్వేకు ఫొని నష్టం రూ.2.98కోట్లు
గత వారం బీభత్సం సృష్టించిన ఫొని తుపాన్ ధాటికి దక్షిణ మధ్య రైల్వే(ఎస్.సి.ఆర్) సుమారు రూ.2.98 కోట్లు నష్టపోయింది. తుపాన్ సమయంలో 137 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో రూ.2,97,92,581 ఆదాయాన్ని కోల్పోయినట్లు ఎస్.సి.ఆర్ వర్గాలు తెలిపాయి. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దయితే మరికొన్ని వేరే మార్గాలకు మళ్లించి నడిపారు. కొన్నింటిని పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికుల భద్రతకే పూర్తి ప్రాధాన్యం ఇచ్చి రైల్వే వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఫొని తుపాన్ విరుచుకుపడుతున్న సమయానికే ఎస్.సి.ఆర్ సర్వసన్నద్ధతతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. తుపాన్ అనంతరం మే4,5 తేదీల్లో మూడు ప్రత్యేక రైళ్లను సికింద్రాబాద్-భువనేశ్వర్, విజయవాడ-హౌరా, సికింద్రాబాద్-హౌరాలకు నడిపింది. మొత్తం 3,034 మంది వీటిల్లో ప్రయాణించారు. తద్వారా రూ.20.90 లక్షల ఆదాయం వచ్చింది. ఫొని మే3న ఒడిశాలోని పూరిని అతలాకుతంల చేసిన సంగతి తెలిసిందే. తుపాన్ తాకిడికి కోటీ 50లక్షల మంది ఇబ్బందుల పాలయ్యారు. 14 జిల్లాల్లో కనీస, నిత్యావసర సేవలకు విఘాతం కల్గింది. విద్యుత్, నీరు, కమ్యూనికేషన్ వ్యవస్థలు లేక జనం ఇక్కట్లకు గురయ్యారు.