కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు ఎస్సీ అనుమతి
కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్
డైరెక్టరేట్(ఈడీ) కేసులను ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరం విదేశాలకు వెళ్లేందుకు
సుప్రీంకోర్టు మంగళవారం (మే7)అనుమతి ఇచ్చింది. ఈ నెలలో కార్తీ అమెరికా, జర్మనీ,
స్పెయిన్ పర్యటనలకు వెళ్లేందుకు సుప్రీం అనుమతి కోరుతూ అభ్యర్థించారు. ప్రస్తుత
పరిస్థితుల్ని అంచనా వేసిన మీదట కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు
జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. మాజీ
కేంద్రమంత్రి పి.చిదంబరం కొడుకయిన కార్తీ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జనవరిలో
రూ.10 కోట్లను డిపాజిట్ చేసినట్లు సుప్ర్రీంకోర్టు సెక్రటరీ జనరల్ తెలిపారు. అప్పుడే
కార్తీకి సుప్రీం విదేశాలకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే విదేశాలకు
వెళ్లి తిరిగి రావాలని, కేసుల విచారణలో సహకరించాలని మాత్రం ఆంక్షలు విధించింది. ఈ
మేరకు కోర్టుకు కార్తీ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా హవాలా
కేసులో కార్తీ చిదంబరాన్ని సీబీఐ ఫిబ్రవరి 28, 2018లో అరెస్ట్ చేసింది. అక్రమ నగదు
బదిలీలకు సంబంధించి ఈడీ కేసుల్ని ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.