Monday, May 6, 2019

mamata's wish modi's chest swells to 112 inches



మోదీపై మమత ఘాటు విమర్శ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హద్దు దాటి ప్రధాని మోదీపై ఘాటు విమర్శ చేశారు. సోమవారం (మే6) బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ ప్రధాని మోదీ ఛాతీ 56 అంగుళాల నుంచి 112 అంగుళాలకు ఉప్పొంగాలని ఆకాంక్షించారు. ఆయన కు మంచి శరీరాకృతి ఉంది..ఆయన ఛాతీ ఇంకా పెరిగితే అందరి ఆరోగ్యం బాగుంటుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ చాలా జిత్తులమారి అని ఆయన మళ్లీ మళ్లీ మరిగించి ఇచ్చిన టీ ఆరోగ్యాలకు హాని చేస్తుందన్నారు. ఆయన ఎప్పుడూ మట్టి కప్ లో చాయ్ ఇవ్వరన్నారు.  చాయ్ వాలా కాస్తా ఇప్పుడు కాపాలాదారుడై పోయారని మమతా ఎద్దేవా చేశారు. తమ పార్టీ లౌకికతత్వం మార్గం వీడదని ఈ సందర్భంగా ఆమె ర్యాలీలో అన్నారు. మసీదు, మందిరం, చర్చిలన్నీ తమకు ఒక్కటేనని చెప్పారు. ఆదివారం ఎన్నికల ర్యాలీలో మోదీ టి అంటే మూడు అర్ధాలు వస్తాయంటూ తృణమూల్..టోల్బాజి, టాక్స్ (టోల్బాజి అనే పదాన్ని స్థానికంగా బలవంతపు వసూళ్లు, దౌర్జన్యం అనే అర్ధం లో వాడతారు) రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన ఆ విధంగానే సాగుతోందని విమర్శించారు. ఈ విమర్శల నేపథ్యంలో ప్రధానికి మమతా పై విధంగా బదులిచ్చినట్లయింది. టీఎంసీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందంటున్న మోదీ.. పెద్ద నోట్ల రద్దు సందర్భంగా ఎంత డబ్బు వెనకేసుకున్నారని మమత ప్రశ్నించారు.

Sunday, May 5, 2019

pakistan pm imran khan pays tribute to tipu sultan


టిప్పుసుల్తాన్ ను కొనియాడిన పాక్ ప్రధాని ఇమ్రాన్
నాటి మైసూర్ చక్రవర్తి టిప్పు సుల్తాన్ అసమాన పోరాట యోధుడని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శ్లాఘించారు. మే4 టిప్పు సుల్తాన్ వర్ధంతి. ఆయన 220వ వర్ధంతి సందర్భంగా ప్రధాని ఇమ్రాన్ ఘనంగా నివాళులర్పించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడ్డంలో టిప్పు సుల్తాన్ చూపిన తెగువ, సాహసాలు తననెంతో ముగ్ధుణ్ని చేశాయని ట్వీట్ చేశారు. బానిసత్వానికి వ్యతిరేకంగా పులిలా పోరాడిన టిప్పు సుల్తాన్ ను టైగర్ అని పిలిచేవారు. సాయుధ పోరాటంలోనే కాక పరిపాలనలోనూ అనేక సంస్కరణల రూపశిల్పిగా టిప్పు సుల్తాన్ పేరు గడించారు. నాణేల ముద్రణ, కొత్త రెవెన్యూ విధానం అమలు, మైసూర్ లో పట్టుపరిశ్రమ అభివృద్ధి తదితరాల్లో ఖ్యాతి పొందారు. గత ఫిబ్రవరిలో భారత్-పాక్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలోనూ ఇమ్రాన్ పాకిస్థాన్ పార్లమెంట్ సమావేశంలో టిప్పుసుల్తాన్ కీర్తిని కొనియాడిన సంగతి తెలిసిందే.

priyanka fires salvo at pm for his comment on rajiv gandhi


అవును..మోదీజీ..అవినీతిని దేశం సహించదు: ప్రియాంక
ప్రధాని మోదీ తన తండ్రి రాజీవ్ గాంధీపై చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ తిప్పికొట్టారు. రాజీవ్ గాంధీ అవినీతి నంబర్.1 నేత గానే చనిపోయారంటూ మోదీ ఉత్తరప్రదేశ్ ప్రతాప్ గఢ్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. అమేథి నుంచి మరోసారి మీకు ఎన్నికల ఫలితాల రూపంలో గుణపాఠం వెలువడుతుందన్నారు. తన తండ్రి గురించి దేశానికి, అమేథి ప్రజలకు బాగా తెలుసని ఎన్నోసార్లు ఓటు రూపంలో ప్రజలు విశ్వాసాన్ని ప్రకటించారని గుర్తు చేశారు. దివంగత నేతని ఆయన త్యాగాన్ని మోదీ హేళన చేసి మాట్లాడారని ట్విటర్ లో పేర్కొన్నారు. తన తండ్రి రాజీవ్ అమాయకులని, ఎంతో నిజాయతీ పరులని ఆయనపై మోదీ అసంబద్ధమైన, నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు.

burqa ban not demand of shiv sena or uddhav:sena leader raut


శివసేన బురఖా నిషేధం కోరలేదు
శివసేన పార్టీ గానీ అధినేత ఉద్దవ్ థాకరే గానీ బురఖా నిషేధం కోరలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు రౌత్ పేర్కొన్నారు. మే4 శనివారం ముంబయికి చెందిన న్యాయవాది మున్సిఫ్ ఖాన్ ముస్లిం సంప్రదాయ వస్త్రధారణకు సంబంధించి వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించిన థాకరే, రౌత్ తదితరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. సీనియర్ సినీ గీత రచయిత జావేద్ అక్తర్ గురువారం మాట్లాడుతూ బురఖాను నిషేధించాలనుకుంటే రాజస్థాన్ లోని మహిళలు సంప్రదాయంగా ధరించే గున్ గాట్ ను నిషేధించాల్సి ఉంటుంది కదా అన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం పెద్ద సంఖ్యలో బురఖాలు ధరించిన ముస్లిం మహిళలు ముంబ్రా లోని సామ్నా పత్రిక కార్యాలయం వద్ద నిరసనల హోరెత్తించారు. రౌత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించాలి..దేశాన్ని రక్షించాలి (Samvidhan Bachao, Desh Bachao) అంటూ నినదించారు. మారుతి డైలీకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రౌత్ సమస్య తీవ్రరూపం దాల్చకుండా వివరణ ఇచ్చారు. సామ్నాలో బుధవారం వచ్చిన సంపాదకీయంతో శివసేనకు లేదా ఉద్దవ్ థాకరేకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆ సంపాదకీయం ప్రధాని మోదీని శ్రీలంకలో మాదిరిగా దేశంలోనూ బురఖాను నిషేధించాలని సూచించింది. శ్రీలంకలో భయానక వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఆ దేశం ఇటీవల తనిఖీల ఇబ్బందుల నేపథ్యంలో బురఖాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. శాంతక్రజ్ సీనియర్ ఇన్ స్పెక్టర్ శ్రీరాం కొర్గాంకర్ తమకు మున్సిఫ్ ఖాన్ ఫిర్యాదు అందిందని అయితే ఎటువంటి కేసు నమోదు చేయలేదని తెలిపారు.