ప్రజలకు తొలిసారి
దర్శనమిచ్చిన జపాన్ కొత్త చక్రవర్తి
జపాన్ కొత్త చక్రవర్తిని చూడాలని దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలి
రావడంతో సింహాసనం అధిష్ఠించిన కొత్త చక్రవర్తి నరుహిటో సతీసమేతంగా వారికి
దర్శనమిచ్చి అభివాదాలు తెలిపారు. మే4 శనివారం టోక్యలోని రాజప్రాసాదం వరండా నుంచే
ఆయన ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టాక నరుహిటో జన
సందర్శనకు వెలుపలికి రావడం ఇదే ప్రథమం. తండ్రి అకిహిటో (85)వృద్ధాప్యం కారణంగానే
సింహాసనాన్ని కొడుకు నరుహిటోకు అప్పగించిన సంగతి తెలిసిందే. నాటి చక్రవర్తి హిరోహిటో
1989లో మరణించడంతో ఆ సింహాసనాన్ని అకిహిటో అధిరోహించారు. అందుకు భిన్నంగా 200 ఏళ్ల
రాచరిక వ్యవస్థలో తొలిసారిగా చక్రవర్తి జీవించి ఉండగానే వారుసుడు నరుహిటో గద్దెనెక్కారు.
పసుపు రంగు దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు ధరించిన సతీమణి మసాకోతో కలిసి పాశ్చాత్య
దుస్తులు చిరునవ్వులు చిందిస్తూ నరుహిటో టోక్యోలోని ప్యాలస్ బాల్కనీలోకి వచ్చారు. వేల
సంఖ్యలో హాజరైన జనం చక్రవర్తి దంపతుల్ని సంభ్రమాశ్చర్యాలతో తిలకించి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. వాస్తవానికి
న్యూఇయర్ వేడుకలు, చక్రవర్తి జన్మదినోత్సవం రోజునే ఈ విధంగా జనం ప్యాలస్ ఆవరణకు
చేరుకుంటుంటారు. అయితే కొత్త చక్రవర్తిగా నరుహిటో గద్దెనెక్కడం ఆయనను కుటుంబాన్ని
ఓసారి చూడాలని ఈసారి ఇక్కడ ప్రజలు ఉవ్విళ్లూరారు. ఈ సందర్భంగా నరుహిటో మాట్లాడుతూ
ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని దేవుణ్ని కోరుతున్నానన్నారు. అదేవిధంగా
జపాన్ సర్వతోముఖాభివృద్ధిని ఆకాంక్షిస్తున్నానని, ఇతర దేశాలన్నింటితో చేయిచేయి
కలిపి ప్రపంచ శాంతికి పాటుపడతానని చెప్పారు.