వారణాసిలో మోదీ రోడ్ షో ధూంధాం
ప్రధాని మోదీ
మరోసారి వారణాసి నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్26) ఆయన
నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ఒకరోజు ముందు అట్టహాసంగా గురువారం ఆయన రోడ్
షోలో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల పొడవునా సాగిన ఈ రోడ్ షోకు పెద్దసంఖ్యలో జనం
హాజరయ్యారు. మోదీ.. మోదీ.. అంటూ పలుచోట్ల నినాదాలు మిన్నంటాయి. ఆయన వెంట ఎన్డీయే
నాయకులు, బీజేపీ నాయకులు శ్రేణులు పెద్ద
సంఖ్యలో హాజరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పియూష్ గోయల్, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ తదితర పార్టీ అగ్ర
నాయకులతో పాటు, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ బాదల్,
శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే, బిహార్ సీఎం నితిశ్
కుమార్, లోక్ జన్ శక్తి అగ్రనేత రామ్ విలాస్ పాశ్వాన్
తదితరులు రోడ్ షో లో మోదీ వెంట ఉన్నారు. అనంతరం మోదీ దశాశ్వమేథ్ ఘాట్ వద్ద గంగా
హారతికి హాజరయ్యారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ రాయ్
కాంగ్రెస్ ప్రధాన
కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసి బరిలో నిలుస్తారన్న ఊహాగానాలకు తెరపడింది.
కాంగ్రెస్ పార్టీ గురువారం తమ అభ్యర్థిగా అజయ్ రాయ్ మరోసారి ఇక్కడ నుంచి పోటీ
చేస్తారని ప్రకటించింది. 2014లోనూ రాయ్ వారణాసి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి
పాలయ్యారు. మూడో స్థానంలో 75,614 ఓట్లు
సాధించారు. మోదీ రికార్డు స్థాయిలో 5,81,022 ఓట్లు పొందగా ఆయనకు పోటీగా నిలిచిన
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ 2,09,238 ఓట్లతో రెండో స్థానాన్ని పొందారు.