భారత్ అప్రమత్తం చేసినా..
పెడచెవిన పెట్టిన శ్రీలంక
- బాంబు పేలుళ్లకు రెండు గంటల ముందే సమాచారం అందజేత
- ఘాతుకం తమ పనేనన్న
ఐఎస్ఐఎస్
శ్రీలంక వరుస బాంబు పేలుళ్ల పీడకల రోజులు గడుస్తున్నా
ప్రపంచ దేశాల్ని వెంటాడుతోంది. ముఖ్యంగా పొరుగుదేశమైన శ్రీలంకతో భారత్ కు చారిత్రక
సాంస్కతిక సంబంధాలు ముడిపడి ఉన్నాయి. దారుణ మారణహోమానికి సంబంధించి భారత్ రోజుల
ముందుగానే శ్రీలంకను అప్రమత్తం చేసింది. ఏప్రిల్ 4వ తేదీనే భారత్ నిఘా వర్గాలు
సమాచారాన్ని శ్రీలంక అధికార వర్గాలకు అందజేశాయి. అలాగే ఏప్రిల్21న పేలుళ్లకు రెండు గంటల ముందు
కూడా అక్కడ రక్షణ శాఖకు ఉప్పందించాయి. అయినా అప్రమత్తం కాకపోవడంతోనే శ్రీలంక భారీ
మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని అవుననే శ్రీలంక అధికారిక
వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి. తాజాగా శ్రీలంక ప్రభుత్వ వర్గాలు భారత్
హెచ్చరికల్ని పెడచెవిన పెట్టడంపై క్షమాపణ వేడుకున్నాయి. అయితే ఈ విషయంపై శ్రీలంక
అధ్యక్ష భవనం, భారత విదేశాంగ శాఖ నోరు విప్పడం లేదు. ఆదివారం ఈస్టర్ సండే నాడు వేర్వేరు ప్రాంతాల్లోని చర్చిలు, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఎనిమిది శక్తిమంతమైన ఐఈడీ బాంబు పేలుళ్లు జరగ్గా మృతుల సంఖ్య 321కు పెరిగింది. ఇంకా వందలమంది క్షతగాత్రులు
ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ బాంబు పేలుళ్లకు పాల్పడింది తామేనని సిరియా
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలేవీ ఇంకా
లభ్యం కాలేదని సమాచారం.