Thursday, April 18, 2019

3 year old boy in coma after torture by mother said Kochi police

ఈమె తల్లేనా అసలు..
·    మూడేళ్ల కొడుకుని కొట్టి కోమాలోకి నెట్టింది
ఈమె తల్లేనా అసలు అనే అనుమానం ఈ ఘటన విన్నా,చూసిన ఎవరికైనా రాక మానదు. అంతటి అమానుషమైన అమానవీయ దుస్సంఘటన కొచిలో జరిగింది. బుధవారం జరిగిన ఘటన వివరాలు గురువారం (ఏప్రిల్18) వెలుగులోకి వచ్చాయి. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన మూడేళ్ల కొడుకుని ఓ తల్లి దుంగతో తలపై దారుణంగా కొట్టి గాయపరిచింది. మెదడులో అంతర్గతంగా రక్తస్రావం కావడంతో ఆ చిన్నారి కోమాలోకి వెళ్లిపోయాడు. అంతేగాక ఆ బాలుడ్ని తీవ్రంగా హింసించినట్లు కూడా శరీరంపై కాలిన గాయాలున్నాయి. స్పృహ లేని స్థితిలో ఉన్న బాలుడ్ని తండ్రి భుజానెత్తుకుని ఆసుపత్రికి తీసుకువచ్చాడు. టేబుల్ పైనుంచి పడి బాలుడు గాయపడినట్లు డాక్టర్లను నమ్మించాలని కట్టుకథలు చెప్పాడు. విశ్వసించని వైద్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఈ దారుణం వెల్లడయింది. బాలుడి మెదడుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్నారు. చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది.

ivanka trump Says father offered her world bank job but she passed


వరల్డ్ బ్యాంక్ చీఫ్ పదవి వద్దన్న ఇవాంక

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ తండ్రి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు.  ప్రెసిడెంట్ సీనియర్ అడ్వయిజర్ గా వ్యవహరిస్తున్న ఆమెను ప్రపంచ బ్యాంక్ చీఫ్ బాధ్యతల్నీ తీసుకోవాల్సిందిగా ట్రంప్ కోరారు. అయితే ఇవాంక తనకు ఇష్టమైన పనే చేస్తానని.. శ్రామిక, మహిళా సాధికారత రంగాలలో సేవల పట్ల మక్కువని పేర్కొన్నారు. నాలుగు రోజుల ఆఫ్రికా పర్యటనలో భాగంగా చివరి రోజు బుధవారం (ఏప్రిల్17) ఇథోయోఫియా, ఐవరీకోస్ట్ ల్లో ఇవాంక పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేటెడ్ ప్రెస్ తో ఆమె మాట్లాడుతూ పై విషయాన్ని తెలిపారు. త్వరలో ట్రంప్ కూడా ఇక్కడ పర్యటనకు వస్తారన్నారు. ఆఫ్రికా దేశాలతో సహా ప్రపంచమంతా ముఖ్యంగా మహిళలు అభివృద్ధి చెందాలన్నదే అమెరికా లక్ష్యమని ఇవాంక పేర్కొన్నారు. సొంత ఆసక్తితోనే ఇవాంక  ప్రస్తుత ఆఫ్రికా పర్యటనకు రావడం గమనార్హం.


madeira crash at least 29 killed on tourist bus near canico portugal island


మదీరా ద్వీపంలో టూరిస్ట్ బస్ బోల్తా 29 మంది దుర్మరణం
పోర్చుగల్ మదీరా ద్వీపంలో బుధవారం (ఏప్రిల్17) సాయంత్రం 6.30 ప్రాంతంలో ఘోర బస్ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది యాత్రికులు దుర్మరణం చెందారు. మృతులంతా 44 నుంచి 50 ఏళ్ల లోపు వారే. డ్రైవర్, టూర్ గైడ్ సహా 55 మంది బస్ లో ప్రయాణిస్తున్నారు. కేనికొ పట్టణానికి సమీపంలో రోడ్డు మలుపు తిరుగుతుండగా అదుపుతప్పిన బస్ పక్కనున్న ఇళ్ల మీదుగా దూసుకుపోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారంతా జర్మనీ దేశస్థులు. దుర్ఘటనలో మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఆ రోడ్డుపై నడుస్తున్న కొందరు పాదచారులు కూడా బస్ దూసుకెళ్లిన క్రమంలో గాయపడినట్లు సమాచారం. ‘ప్రమాదంపై వ్యాఖ్యానించడానికి మాటలు రావడం లేదు.. మృతుల బంధువులు, క్షతగాత్రుల బాధల్ని తట్టుకోలేకపోతున్నా’ అని కేనికొ మేయర్ ఫిలిపె సౌసా ఓ టీవీ చానల్ లో పేర్కొన్నారు. చనిపోయిన యాత్రికుల్లో 11 మంది పురుషులు, 18 మంది మహిళలని తెలిపారు. 28 మంది దుర్ఘటనా స్థలంలోనే చనిపోగా మరో మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిందన్నారు.

Wednesday, April 17, 2019

ipl 2019 srh vs csk match hyderabad win by 6 wickets as dhoni less chennai suffer second loss of the season


వరుస ఓటముల తర్వాత చెన్నైపై గెలిచిన హైదరాబాద్
విజయాల రుచి మరిగిన చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా పోరాడకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తలవంచింది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐపీఎల్ సీజన్-12 మ్యాచ్ నం.33 లో టాస్ గెలిచిన యాక్టింగ్ కెప్టెన్ సురేశ్ రైనా మ్యాచ్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. నడుం నొప్పి కారణంగా ధోని ఈ మ్యాచ్ ఆడలేదు. నాయకుడు లేని చెన్నై జట్టు పేలవమైన ఆటతీరు కనబర్చింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై అయిదు వికెట్లు కోల్పోయి 6.60 రన్ రేట్ తో 132పరుగులు మాత్రమే చేసింది. డూప్లెసిస్(45), షేన్ వాట్సన్(31), రాయుడు(25) చెప్పుకోదగ్గ పరుగులే చేసినా జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.బౌలర్లకు సహకరించని పిచ్ పై బ్యాటర్లూ రాణించలేకపోవడం విచిత్రం. ఏడు విజయాలతో టోర్నీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రెండో ఓటమి మూటగట్టుకుంది. లక్ష్యం చిన్నదే కావడంతో ఒత్తిడే లేకుండా హైదరాబాద్ జట్టు సునాయాసంగా విజయాన్ని సాధించింది. నాలుగు వరుస ఓటముల తర్వాత జట్టుకు ఈ గెలుపు కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని కల్గిస్తుంది. అర్ధ సెంచరీల హీరో వార్నర్ మరోసారి తన వాటా పరుగులు(25 బంతుల్లో 50) చేయగా మరో ఓపెనర్ జానీ బేస్టో (44 బంతుల్లో61 పరుగులు) అర్ధ సెంచరీతో నాటౌట్ గా మ్యాచ్ గెలిచే వరకు క్రీజ్ లో నిలిచాడు. మూడు ఓవర్ల మిగిలి ఉండగా విజయానికి రెండు పరుగులు కావాల్సి ఉన్న దశలో ఆడిన తొలిబంతినే యూసఫ్ పఠాన్ విన్నింగ్ షాట్ సిక్సర్ కొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ లో 16.5 ఓవర్లలో 137/4 పరుగులు చేసి అలవోకగా గెలుపొందింది. 2010 తర్వాత ఐపీఎల్ లో ధోని ఆడని మొదటి మ్యాచ్ ఇదే. వార్నర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.