వావ్ ట్విటర్ సీఈవో
ట్విటర్
సీఈవో జాక్ డోర్సి సాధించిన విజయం యువతకు చక్కటి ఆదర్శం. ఆ సక్సెస్ ఒక్కగంటలోనో,
ఒక్క రోజులోనో వచ్చింది కాదు. ఏళ్ల తరబడి పరిశ్రమతోనే సాధించారు. అంతకు మించి
అసాధారణ దినచర్యే తనను ముందుకు నడిపిందంటారాయన. డోర్సి ఉదయం 5కే నిద్ర లేస్తారు. గడ్డకట్టించే
చల్లటి నీటితో స్నానం చేస్తారు.. రోజూ ఒకపూటే భోజనం చేస్తారు.. వారాంతంలో అయితే
పూర్తిగా ఉపవాసమే.. సుమారు 9 కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు నడిచే వెళ్తారు.. ఈ
విషయాలన్నీ ఆయన ఓ ఫిట్ నెస్ పాడ్ కాస్ట్ షో లో వివరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు
గురి చేశారు. ఇంతకీ 42 ఏళ్ల డోర్సి సంపద ఎంతో తెలుసా? ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 5
బిలియన్ డాలర్లు (రూ.3,450 కోట్లు). ఏటా ట్విటర్ యూజర్ల సంఖ్య 30 కోట్ల మంది కాగా
డోర్సికి సంస్థ ద్వారా 2018 చివరి త్రైమాసికానికి సమకూరిన ఆదాయం 909 మిలియన్ డాలర్ల
(రూ.630 కోట్లు)కు చేరుకుంది. ట్విటర్ షేర్లలో డోర్సికి 2.3శాతం వాటా ఉంది. ట్విటర్
సహ వ్యవస్థాపకుడైన ఆయన అనేక పదవుల్లో ఒదిగిపోయి చివరికి సీఈవో స్థాయికి ఎదిగారు. స్క్వేర్
మొబైల్ పేమెంట్ సంస్థనూ ఆయన స్థాపించారు. పాడ్ కాస్ట్ షో లో డోర్సి తన దినచర్యను
విపులీకరించారు. తెల్లవారగానే మూడు నిమిషాల పాటు చల్లటి నీటితో స్నానం చేశాక 15
నిమిషాలు 104 డిగ్రీల సెంటిగ్రేడ్ ఆవిరిలో ఉంటారట. గంట పాటు ధ్యానం కూడా తన దినచర్యలో
భాగంగా ఉంటుందని తెలిపారు. సాయంత్రం ప్రొటీన్, సలాడ్ తీసుకొని రాత్రి వేళ బెర్రీలు,
లేదా డార్క్ చాక్లెట్ తింటారట. ఈ విధంగా దినచర్య, ఆహార నియమాలు పాటించడం వల్ల రోజూ
పగటి వేళ ఎంతో ఉత్సాహంగా చురుగ్గా పని చేయగల్గుతున్నట్లు వివరించారు. ఇలా 22 ఏళ్ల
యువకుడిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నట్లు డోర్సి చెప్పారు.