Tuesday, April 16, 2019

ec finally in action mode restricts four leaders from campaigning


ఈసీ కొరడా ఝళిపించింది

·  సుప్రీం తలంటుతో గుర్తుకు వచ్చిన అధికారాలు

ప్రజాస్వామ్య హితైషుల కోరిక నెరవేరింది. సుప్రీంకోర్టు తలంటడంతో ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) రాజకీయులపై పంజా విసిరింది. తమిళనాడు వేలూరు లోక్ సభ ఎన్నిక వాయిదా, ప్రచార పర్వంలో అదుపుతప్పిన నేతల నోటికి తాళం వేయడం, ఆంధ్రప్రదేశ్ లో అయిదు నియోజకవర్గాల్లో రీపోలింగ్ పై పరిశీలన వంటి కఠిన నిర్ణయాల్ని మంగళవారం (ఏప్రిల్16)ఈసీ తీసుకుంది. సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం(పి.ఐ.ఎల్) పై సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్(సీజేఐ) నేతృత్వంలో విచారణ చేపట్టిన ధర్మాసనం ఈసీపై పరుష వ్యాఖ్యల్ని చేసింది. స్వతంత్ర ప్రతిపత్తి గల ఎన్నికల సంఘానికి ఆర్టికల్ 324 ప్రకారం సంక్రమించిన అధికారాలు గుర్తున్నాయా? లేక తామే గుర్తు చేయాలా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దాంతో గంట వ్యవధిలోనే ఈసీ తనకు గల విశేషాధికారాల కొరడాను ఝళిపించింది.
రామ్ పూర్(యూపీ) అభ్యర్థులుగా ఉన్న జయప్రద(బీజేపీ) పై అజాంఖాన్(ఎస్.పి సీనియర్ లీడర్) చేసిన చౌకబారు విమర్శల్ని ఈసీ సీరియస్ గా పరిగణించింది. ‘17 ఏళ్లుగా మీకు తెలిసిన జయప్రద నాకు 17 రోజుల్లోనే పూర్తిగా అర్థమయింది.. ఆమె ధరించే లోదుస్తులు ఖాకీ అని’ అంటూ అజాంఖాన్ నిసిగ్గుగా వ్యాఖ్యానించారు. దాంతో ఈసీ ఆయన నోటికి తాళం వేసింది. మూడు రోజులు ఆయన ప్రచారం చేయరాదని ఆంక్షలు విధించింది. మేనకాగాంధీ (కేంద్రమంత్రి, బీజేపీ), మాయవతి(బీఎస్పీ అధినేత్రి), యోగి ఆధిత్య నాథ్(ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ) ప్రచార పర్వంపైన ఈసీ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. షహరాన్ పూర్ ఎన్నికల ప్రచారంలో మేనకా గాంధీ మాట్లాడుతూ ముస్లింలు తనకు ఓటు వేయకుంటే వారికోసం తను పనిచేయనని వ్యాఖ్యానించారు. దాంతో మేనకాగాంధీ కూడా మూడు రోజులు ప్రచారం నిర్వహించ కుండా ఈసీ ఆంక్షలు విధించింది.
షహరాన్ పూర్, బరేలీ ఎన్నికల సభల్లో మాయవతి ప్రచారం నిర్వహిస్తూ ముస్లింలు బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమికే ఓటేయాలని కాంగ్రెస్ కు వేయొద్దని కోరారు. యోగి ఆధిత్యనాథ్ బడాన్ ర్యాలీలో మాట్లాడుతూ బీఎస్పీ, ఎస్పీ, ఆర్.ఎల్.డి. కూటమితో అలీ ఉంటే బీజేపీకి బజరంగ్ భలీ అండ ఉందని పేర్కొన్నారు. దాంతో మాయవతి, యోగి ఆధిత్యనాథ్ లు రెండు రోజుల పాటు ప్రచారం చేయరాదని ఈసీ ఆదేశాలు జారీ అయ్యాయి.  తమిళనాడులో వేలూరులో పెద్ద ఎత్తున డబ్బు సంచులు బయట పడిన నేపథ్యంలో అక్కడ ఈనెల 18న జరగాల్సిన ఎన్నికని ఆక్రమాల్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 11న ముగిసిన ఎన్నికల్లో గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రెండేసి చోట్ల, ప్రకాశం జిల్లాలో ఒక చోట రీపోలింగ్ కు సీఈవో ద్వివేదీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్ నిర్వహించే అంశంపై పరిశీలన చేస్తోంది.  


No comments:

Post a Comment