జెట్ విమానాలు
నేటి నుంచి బంద్
· ఎయిర్ వేస్ సంక్షోభం తీవ్రతరం
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ సంస్థ పైలట్ల విధులు బహిష్కరణ
ప్రకటనతో మరో సమస్యలోకి జారుకుంది. దాంతో సోమవారం (ఏప్రిల్15) నుంచి జెట్ విమానాలు
ఎగరబోవడం లేదని తెలిసింది. నేషనల్
ఏవియేటర్స్ గిల్డ్(ఎన్.ఎ.జి) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎన్ఏజీలో 1100 మంది పైలట్లు
సభ్యులుగా ఉన్నారు. ఒక్క జెట్ ఎయిర్ వేస్ లోనే 1600 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు.
పైలట్లతో పాటు జెట్ ఇంజినీర్లు, సీనియర్ మేనేజర్లు కూడా విధులు బహిష్కరిస్తున్నట్లు
ప్రకటించారు. జనవరి నుంచి వీరందరికీ జీతాలు అందడం లేదని సమాచారం. అయితే జెట్ యాజమాన్యం
సంస్థ మనుగడను కాపాడ్డానికి ప్రాథమిక పెట్టుబడిగా ఎస్.బి.ఐ నుంచి రూ.1500 కోట్ల
రుణ మంజూరు కోరింది. జెట్ సిబ్బంది అందరికీ ఆ మొత్తం రాగానే బకాయిలన్నీ
చెల్లిస్తామని నచ్చజెబుతూ వచ్చింది. అయితే ఆ ప్రణాళికా బెడిసికొట్టిన మీదట జెట్
సిబ్బంది సమ్మె బాట పట్టారు. సంక్షోభానికి ముందు జెట్ సంస్థ రోజూ 120 విమానాల్ని
నడిపేది. ఆ తర్వాత ఆ సంఖ్యను రోజుకు 15 కు కుదించింది. ఇప్పుడు పూర్తిగా సర్వీసుల
బంద్ దశకు చేరుకుంది.