Friday, April 12, 2019

pakistan deadly explosion rips through quetta market 20-dead


పాకిస్థాన్ లో బాంబు పేలుడుకు 20 మంది బలి
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో శుక్రవారం బాంబు పేలుడుకు 20 మంది దుర్మరణం చెందారు. క్వెట్టాలోని ఓ మార్కెట్ లో ఈ ఉదయం పేలుడు సంభవించింది. ఈ దాడిలో మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. షియా వర్గానికి చెందిన హజరాలు పెద్ద సంఖ్యలో ఈరోజు మార్కెట్ కు వచ్చారు. వీరంతా కూరగాయలు కొనుగోలు చేస్తుండగా పేలుడు జరిగింది. పేలుడు దాటికి పలువురు మాంసపు ముద్దలుగా మారారు. చాలా మంది శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఈ ప్రాంతమంతా రక్తసిక్తమై యుద్ధభూమిని తలపించింది. ఆగంతకులు బంగాళాదుంపల సంచుల్లో బాంబును పెట్టి ఉంటారని అనుమానిస్తున్నట్లు క్వెట్టా పోలీస్ చీఫ్ అబ్దుల్ రజాక్ చీమా తెలిపారు. క్వెట్టాలో ఆరు లక్షల వరకు హజారాల జనాభా ఉంది. ఈ వర్గం వారిపై తరచు దాడులు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఈ మార్కెట్ ప్రాంతంలో భద్రత బలగాల గస్తీ ఉంటుంది. 2013 నుంచి బలూచిస్థాన్ ప్రావిన్స్ లో హజరాలపై కాల్పులు, బాంబు దాడులు జరుగుతుండగా ఇంతవరకు 509 మంది చనిపోయినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

sindhu seals semifinal spot in singapore open Saina ousted


సింగపూర్ ఓపెన్ సెమీస్ కు సింధు
భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు సింగపూర్ ఓపెన్ సెమీస్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ లో మరో భారత స్టార్ క్రీడాకారిణి సైనా ఓటమి పాలయింది. క్వార్టర్ ఫైనల్స్ లో సింధు వరల్డ్ నం.18 రెండో సీడ్ చైనాకు చెందిన కేయాన్యాన్ పై 21-13,17-21,21-14 తేడాతో గెలుపొందింది. తొలి సెట్లో సింధుదే పైచేయి కాగా రెండు సెట్లో యాన్యాన్ పుంజుకుని సింధుని కంగు తినిపించింది. ఆఖరి సెట్లో ప్రత్యర్థికి సింధు ముచ్చెమటలు పట్టించి గెలుపొందింది. మూడు సెట్ల పోరాటంలో విజయం సాధించిన సింధు తన చిరకాల ప్రత్యర్థి వరల్డ్ చాంపియన్ నొజొమి ఒకుహరాతో సెమీస్ లో తలపడనుంది. సెకండ్ సీడ్ గా టోర్నీలో ఆడుతున్న ఒకుహరా ఆరోసీడ్ లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత భారత షట్లర్ సైనా పై విజయం సాధించి సింధుతో పోరుకు సిద్ధమౌతోంది. ఒకుహరాతో సైనా ఆడిన చివరి మూడు మ్యాచ్ ల్లోనూ గెలిచి తనదే పై చెయ్యి అనిపించుకుంది. మొత్తమ్మీద ఈ ఇద్దరు క్రీడాకారిణులు తలపడిన మ్యాచ్ ల్లో సైనా 9 మ్యాచ్ ల్లో గెలుపొందగా ఈ సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ కలుపుకొని ఒకుహరా 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.

urmila matondkar not approaching politics as a star


ప్రజా ప్రతినిధిగా సేవలందించేందుకే పోటీ చేస్తున్నా:ఊర్మిళ
సినీతార హోదాలో ఏదో పొందాలని రాజకీయాల్లోకి రాలేదని ప్రజా ప్రతినిధిగా జనానికి సేవలందించాలనే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళ పేర్కొన్నారు. 90వ దశకంలో రంగీలా, దౌడ్, జుడాయ్ సినిమాల ద్వారా యావత్ దేశంలో యువతను ఆకట్టుకున్నారామె. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. గతంలో ఇదే స్థానానికి మరో బాలీవుడ్ స్టార్ గోవింద ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో పలువురికి గృహ సమస్య, నీటి ఎద్దడి, పారిశుద్ధ్యం వంటి ప్రధానమైన ఇబ్బందులున్నాయని వాటితో పాటు ఇతర ఇక్కట్లను పరిష్కరించడానికి కృషి చేయనున్నట్లు ఊర్మిళ తెలిపారు. ఆమె ప్రత్యర్థి భారతీయ జనతాపార్టీ (బీజేపీ) అభ్యర్థి గోపాల్ శెట్టి ఇటీవల మాట్లాడుతూ ఊర్మిళ పాపం అమాయకురాలు, రాజకీయాల్లో సున్నా అని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ఆమెతో ప్రస్తావించగా అది ఆయన మానస్తత్వాన్ని తెలియజేస్తోందని లోక్ సభకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులకు చక్కటి అవగాహన, ఆలోచన విధానం ఉండి తమ సమస్యల్ని తీర్చేవారే కావాలని ప్రజలు కోరుకుంటారని ఊర్మిళ సమాధానమిచ్చారు. రాజకీయాల్లో సున్నాగా ఉండడమే తనకిష్టమని ఎందుకంటే మాటల్లో,చేతల్లో ప్రజల వెన్నంటి ఉంటూ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ ముందుకెళ్లడానికి రాజకీయాల్లో ఇది తొలి అడుగన్నారు. ఇర్ఫాన్ ఖాన్ బ్లాక్ మెయిల్సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న సమయంలోనే సమాజానికి ఏదైనా చేయాలనే తాము ఆలోచించామన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత అనుకోలేదని అయితే ప్రచారకర్తగా వ్యవహరిస్తుండగా పార్టీ టిక్కెటిచ్చి బరిలోకి దింపిందని 45ఏళ్ల ఊర్మిళ తెలిపారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు కచ్చితంగా దేశ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని ఆమె పేర్కొన్నారు.

delhi brings relief from scorching heat light rains in the nextday too


ఢిల్లీలో వర్షం ఈదురు గాలులు
దేశ రాజధాని ఢిల్లీ వడగాల్పుల నుంచి శుక్రవారం ఉపశమనం పొందింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో మొదలై పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరం చల్లబడింది. వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం ఉదయం ఉష్ణోగ్రత 23 డిగ్రీలు నమోదు కావడంతో జనం ఆహ్లాదకర వాతావరణంతో పులకించిపోయారు. పాలం, లోధీ రోడ్లలో 0.5 మి.మీ, 0.6 మి.మీ వర్షపాతం నమోదయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 0.2 మి.మీ వర్షం కురిసింది. గాలిలో తేమ 72 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో 24 గంటలు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన స్వల్ప వర్షాలు కురవొచ్చని తెలుస్తోంది.