Sunday, November 29, 2020

Remote-controlled Robot Deployed at Egypt Hospital to Take Covid Tests, Warn Those Without Mask

ఈజిప్ట్ లో కరోనా కట్టడికి రోబో సేవలు

కరోనా సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో ఈజిప్ట్ లో రోబోల్ని రంగంలోకి దింపారు. మహమూద్ ఎల్-కోమి అనే ఆవిష్కర్త ఈ రిమోట్-కంట్రోల్ రోబోట్‌ను సిద్ధం చేశాడు. దాంతో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో ఈ రోబో సేవల్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. సిరా-03 అని పిలువబడే ఈ రోబోట్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగలదు. రోగుల ఉష్ణోగ్రతను పరీక్షిస్తుంది. అదేవిధంగా మాస్క్ లు ధరించని వారిని హెచ్చరిస్తుంది. అచ్చం మనిషిలాంటి తల, మొహం, చేతులతో ఈ రోబోట్ ను తీర్చిదిద్దారు. ఈ మరమనిషికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వైద్యుల మాదిరిగా ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు చేయగలదు. అంతేకాకుండా ఆ రిపోర్టు ఫలితాలను దాని ఛాతీకి అనుసంధానించిన తెరపై రోగులకు ప్రదర్శిస్తుంది. ఈ రోబోట్లను మనుషుల్లా రూపొందించడమెందుకంటే రోగులు భయపడకుండా ఉండడానికేనని మహమూద్ తెలిపాడు.

Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.

Tuesday, November 24, 2020

PM Narendra Modi And AP CM YSJagan led trends across Social Media

ప్రజాదరణలో మోదీ, జగన్, మమతా టాప్

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. గడిచిన మూణ్నెల్ల కాలంలో 95 మంది టాప్‌ పొలిటీషియన్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. సోషల్‌ మీడియాలో మోదీ హవా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తర్వాత స్థానంలో జగన్, మమతాలు దూసుకువచ్చారు. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరుపైనే ఉన్నాయి. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన గణాంకాల్ని చెక్‌బ్రాండ్స్‌సంస్థ పరిగణలోకి తీసుకుంది.  10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో ఉండగా స్వల్ప దూరంలో 2,137 ట్రెండ్స్‌తో జగన్‌ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు. బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు కాగా ఆ తర్వాత స్థానాల్లో అమిత్‌ షా (రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (రూ. 328 కోట్లు) ఉన్నారు.

Saturday, November 21, 2020

Patient Watches BigBoss show and Avataar movie as Guntur doctors perform brain surgery

రోగి బిగ్ బాస్ షో

చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

గుంటూరు సర్వజనాసుపత్రి జీజీహెచ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మెదడులో కణితిని తొలగించే క్రమంలో రోగితో మాట్లాడుతూనే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేశారు. కానీ మళ్లీ వరప్రసాద్ కు ఫిట్స్ వస్తుండడంతో పరీక్షలు చేయగా మరో కణితి పెరిగినట్లు గుర్తించారు. డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి సరిగ్గా ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో ఆ భాగం కీలకమైనది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. ఇదే ఆసుపత్రిలో 2017 లోనూ ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు విజయం సాధించారు. విజయకుమారి అనే మహిళకు మెదడులో కణితి (కెవర్నోమా)ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఆమెకు బాహుబలి-2 సినిమాను చూపిస్తూ అప్పట్లో ఈ శస్త్రచికిత్స చేశారు. గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

Wednesday, November 18, 2020

Roja birthtday..takes blessings from CM YSJaganmohan Reddy

 రోజాకి జగన్ ఆశీస్సులు

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులు అందజేశారు. రోజా బుధవారం తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం ని కలిశారు. భర్త సెల్వమణితో కలసి అమరావతిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రోజా జగన్‌ కు స్వీట్ బాక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రోజాను ఆశీర్వదించి మిఠాయి తినిపించారు. అదే విధంగా రోజాకు జగన్ స్వీట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజున ఎవరైనా జగన్ వద్దకు వస్తే వారికి ఓ స్వీట్ బాక్స్ కానుకగా ఇవ్వడం ఆయనకు అలవాటు. అనంతరం రోజా ఈ సాయంత్రం తన కుటుంబసభ్యులతో కలిసి బర్త్ డే వేడుక ఘనంగా జరుపుకున్నారు.

Monday, November 16, 2020

Nitish Kumar takes oath as Bihar CM for fourth consecutive time

బిహార్ సీఎంగా నితీశ్ నాల్గోసారి 

బిహార్ ముఖ్యమంత్రిగా జెేడీ (యు) చీఫ్ నితీశ్ కుమార్  వరుసగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో ఆయనతో పాటు ఎన్డీయే కూటమిలోని పార్టీల నాయకులు కూడా కేబినెట్ మంత్రులుగా పదవులు చేపట్టారు. డిప్యూటీ సీఎంలుగా తార్కిషోర్ ప్రసాద్, రేణు దేవి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి కుమారుడు సంతోష్ కుమార్ సుమన్, వికాషీల్ ఇన్సాన్ పార్టీ (వి.ఐ.పి) కు చెందిన ముఖేష్ సాహ్ని, జేడీ (యు) విజయ్ కుమార్ చౌదరి, విజయేంద్ర ప్రసాద్ యాదవ్, అశోక్ చౌదరి, మేవాలౌచౌదరి తదితరులు మంత్రులుగా పదవీ ప్రమాణం చేశారు. 2005 నుంచి గరిష్ఠ కాలం బిహార్‌ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టిన సుశీల్ కుమార్ మోడీ (బీజేపీ)కి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఆయనకు సెంట్రల్ బెర్త్ దక్కవచ్చని సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆర్జేడీ నాయకుడు తేజశ్వి యాదవ్ హాజరుకాలేదు. నితీశ్ ప్రమాణ స్వీకారాన్ని ఆర్జేడీ బహిష్కరించింది. 

Friday, November 13, 2020

Telangana High Court Bans Sale, Use Of Firecrackers Ahead Of Diwali

తెలంగాణలో బాణసంచా నిషేధం

తెలంగాణలో బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలపై నిషేధం విధించారు. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఈమేరకు ఆదేశాలు  జారీ చేసింది.  బాణసంచా కాల్చడం వల్ల పెద్దఎత్తున వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ప్రజలు శ్వాస కోశవ్యాధుల బారిన పడుతున్నారు. వీటి క్రయవిక్రయాలు నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈమేరకు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ రాష్ట్ర క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసింది. ఇప్పటికే కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హర్యానా, పశ్చిమబెంగాల్, సిక్కింల్లో బాణసంచాపై నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న కారణంగా దీపావళికి ముందు రాష్ట్రంలో క్రాకర్ల అమ్మకం, వాడకాన్ని గౌరవ హైకోర్టు నిషేధించినట్లు సీనియర్ కౌన్సెల్ మాచార్ల రంగయ్య మీడియాకు తెలిపారు. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా బాణసంచా కాల్చొద్దని హైకోర్టు సూచించిందన్నారు. ఈ మహమ్మారి ఇప్పటికే  చాలా మంది ప్రాణాలు బలిగొంది. సంక్రమణ ప్రధాన లక్షణంగా గల కరోనా ఊపిరితిత్తుల పైనే అధికప్రభావం చూపుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చినట్లు వివరించారు. అంతేగాక ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి నవంబర్ 19న నివేదికను సమర్పించాలని  హైకోర్టు ఆదేశాలిచ్చింది. 

Tuesday, November 10, 2020

Indian Premier League 2020 title winner again Mumbai

ఐపీఎల్ విజేత మళ్లీ ముంబయే!!

ఐపీఎల్ టాప్ క్లాస్ విన్నింగ్ టీమ్ ముంబయి మరో ఫైనల్ విజయాన్ని నమోదు చేసింది. డ్రీమ్ ఏ లెవన్ టోర్నీ తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ను 5 వికెట్ల తేడాతో ఓడించి మరోసారి ఐపీఎల్ విన్నర్ గా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయికి ఇది అయిదో ఐపీఎల్ టైటిల్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. గెలుపునకు 157 పరుగులు చేయాల్సిన ఎం.ఐ జట్టు కలిసికట్టుగా ఆడి టైటిల్ ను ముద్దాడింది. మరో ఎనిమిది బంతులు మిగిలివుండగానే అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. డీసీని కట్టడి చేయడంలో సక్సెస్ అయిన ఎం.ఐ. జట్టు బ్యాటింగ్ లోనూ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా స్కిపర్ రోహిత్ శర్మ (68) అర్ధ సెంచరీ, ఇషాంత్ కిషన్ అద్భుత బ్యాటింగ్ (19 బంతుల్లో 33 పరుగులు) నైపుణ్యంతో జట్టును తేలిగ్గా విజయతీరానికి చేర్చారు. ఈ మ్యాచ్ తొలి బంతికే స్టోయినెస్ ను బౌల్ట్ బోల్తా కొట్టించాడు. పరుగులేమీ చేయకుండానే స్టోయినెస్ కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత రహానె(2), సూపర్ ఫామ్ లో ఉన్న ధావన్ (15) పరుగులకే వెనుదిరగ్గా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, యంగ్ టాలెంట్ రిషబ్ పంత్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. అయ్యర్ 50 బంతుల్లో 65 పరుగులు, రిషబ్ 38 బంతుల్లో 56 పరుగులతో అర్ధ  సెంచరీలు సాధించారు. రిషబ్ కి ఈ టోర్నీలో తొలి అర్ధ సెంచరీ ఇది. వీరిద్దరి జోడి నాల్గో వికెట్ కు 96 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. అయితే చివరి ఓవర్లలో ముంబయి బౌలర్లు బూమ్రా, బోల్ట్, జయంత్, కోల్ట్రెనైల్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పరుగులకు కళ్లెం వేశారు. బోల్ట్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు, కోల్ట్రెనైల్ 29 పరుగులకు 2 వికెట్లు తీసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును ట్రెంట్ బౌల్ట్ సాధించాడు.మ్యాచ్ తొలిబంతికే అవుటైన స్టోయినెస్ తన బౌలింగ్ లో తొలి బంతికే డీకాక్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. టోర్నీలో చక్కగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ రోహిత్ కోసం తన వికెట్ ను త్యాగం చేశాడు. ముంబయి పటిష్ట స్థితిలో ఉండగా లేని పరుగు కోసం యత్నించిన రోహిత్ కోసం సూర్యకుమార్ రనౌట్ గా వెనుదిరిగాడు. తాజా విజయంతో ముంబయి జట్టు 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నట్లయింది.

Monday, November 9, 2020

Trailblazers lifted JioT-20 womens Trophy for the first time

ట్రయల్ బ్లేజర్స్ దే టీ20 కప్

స్మృతి మంధాన విజృంభణతో ట్రయల్ బ్లేజర్స్ తొలిసారి మహిళల టీ20 కప్ ను సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన  జియో 2020 టీ20 చాలెంజర్ కప్ ఫైనల్స్ లో  సూపర్ నోవాస్ పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్మృతి బ్యాటర్ గానే కాక కెప్టెన్ గానూ రాణించి మ్యాచ్ ను తన జట్టుకు తొలిసారి ట్రోఫీని సాధించిపెట్టింది. గతంలో ఈ ట్రోఫీని సూపర్ నోవాస్ రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ పై కన్నేసినా ట్రయల్ బ్లేజర్స్ అన్నిరంగాల్లో రాణించి కైవసం చేసుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 119 పరుగులు చేసింది. స్మృతి 49 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 68 పరుగులు స్కోరు చేసింది. ప్రత్యర్థి జట్టులో రాధా యాదవ్ 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 5 వికెట్లు ఖాతాలో వేసుకుంది. టీ20 మహిళా టోర్నీల్లో ఓ మ్యాచ్ లో 5 వికెట్లు సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు సృష్టించింది. అనంతరం 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన సూపర్ నోవాస్ 7 వికెట్లు కోల్సోయి 102 పరుగులే చేయగల్గింది. సల్మా కాతున్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టగా పొదుపుగా పరుగులిచ్చి దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. ఈ ఫైనల్స్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మొత్తం మూడు అవార్డుల్ని సాధించడం విశేషం.

Sunday, November 8, 2020

CM Jagan condolences to YSRCP Kakinada city president Frooti Kumar`s Death

వైఎస్సార్సీపీ తూ.గో. నేత మృతి: సీఎం సంతాపం

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ కరోనాతో ఆదివారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన చురుగ్గా పనిచేస్తున్నారు. కరోనా సోకడంతో గత కొంతకాలంగా విశాఖపట్నంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. ఇటీవల సీఎం జగన్.. ఫ్రూటీకుమార్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆయన సతీమణి చంద్రకళా దీప్తికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ కూడా సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన అకాల మరణం బాధిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇలా జరగడం పట్ల విచారం వెలిబుచ్చారు.

Friday, November 6, 2020

TV9 has bagged a record 17 NT awards

టీవీ9 కు ఎన్టీ అవార్డుల పంట

టీవీ9 తెలుగు రికార్డు స్థాయిలో న్యూస్ టెలివిజన్ అవార్డులు సాధించింది. వివిధ విభాగాల్లో మొత్తం 17 అవార్డులు సొంతం చేసుకుని కాలరేగరేసింది. బెస్ట్ న్యూస్ డిబేట్ షో అవార్డును `బిగ్ న్యూస్ బిగ్ డిబేట్` దక్కించుకోగా బెస్ట్ ప్రైమ్టీవీ న్యూస్ యాంకర్ అవార్డును మురళీకృష్ణ కైవసం చేసుకున్నారు. బెస్ట్ టీవీ న్యూస్ ప్రెజెంటర్ అవార్డు పూర్ణిమకు లభించింది. బెస్ట్ డైలీ న్యూస్ బులిటెన్ అవార్డు `టాప్ న్యూస్ 9` ఖాతాలో వేసుకుంది. అదేమాదిరిగా బెస్ట్ టీవీ న్యూస్ రిపోర్టర్ గా అశోక్ వేములపల్లి, బెస్ట్ యంగ్ టీవీ జర్నలిస్ట్ గా స్వప్నిక అవార్డులు గెలుచుకున్నారు. బెస్ట్ ప్రైమ్ టైమ్ న్యూస్ షో అవార్డును `అనగనగా ఒక ఊరు` దక్కించుకుంది. అలాగే టీవీ9 తెలుగు బెస్ట్ న్యూస్ చానల్ వెబ్సైట్ అవార్డు tv9telugu.com ను వరించింది.

Tuesday, November 3, 2020

3 Killed in Vienna `Terror Attack` At 6 Locations

వియన్నాలో ఉగ్రపంజా

          · ముంబయి దాడి తరహాలో ఘటన

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. దేశంలో మంగళవారం నుంచి రెండో విడత కరోనా లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా సోమవారం అర్ధరాత్రి వరకు హోటళ్లు, మార్కెట్, మాల్స్ లో ఆనందంగా గడిపారు. ఇదే అదునుగా వియన్నా లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో ముష్కరులు ఇష్టానుసారం కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ముగ్గురు దుర్మరణం చెందగా మరో 15 మంది తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సెంట్రల్ వియన్నా అంతటా సోమవారం రాత్రి వేర్వేరు ప్రాంతాల్లో జట్లుగా విడిపోయిన ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు దిగారు.  ఈ దుశ్చర్యను ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ `పాశవిక ఉగ్రవాద దాడి`గా పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు చాకచక్యంగా బంధించినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలంతా నగరం మధ్యలోనే సురక్షితంగా ఉండాలని సరిహద్దు తనిఖీలను ముమ్మరం చేశామని దేశ అంతర్గత వ్యవహారాలశాఖ (హోం) మంత్రి కార్ల్ నెహమ్మర్ తెలిపారు. పిల్లలు మంగళవారం పాఠశాలకు హాజరు కానవసరం లేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. భారత్ లో పన్నేండేళ్ల క్రితం (2008 నవంబర్ 26-29 తేదీల్లో) పాక్ నుంచి దేశంలోకి చొరబడిన లష్కర్ ఎ తోయిబాకు చెందిన ముష్కరులు 166 మందిని బలిగొన్న సంగతి తెలిసిందే. నాడు ఈ ఉగ్రదాడిలో మొత్తం 10 మంది పాల్గొన్నారు.