Saturday, November 21, 2020

Patient Watches BigBoss show and Avataar movie as Guntur doctors perform brain surgery

రోగి బిగ్ బాస్ షో

చూస్తుండగా బ్రెయిన్ సర్జరీ

గుంటూరు సర్వజనాసుపత్రి జీజీహెచ్ మరో రికార్డును సొంతం చేసుకుంది. మెదడులో కణితిని తొలగించే క్రమంలో రోగితో మాట్లాడుతూనే వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.  పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌(33)కు మెదడులో కణితి (బ్రెయిన్‌ ట్యూమర్‌) వచ్చింది. అయితే ఆ కణితిని 2016లో హైదరాబాద్‌లో డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించి తొలగించారు. ఆ తర్వాత రేడియేషన్ చికిత్స చేశారు. కానీ మళ్లీ వరప్రసాద్ కు ఫిట్స్ వస్తుండడంతో పరీక్షలు చేయగా మరో కణితి పెరిగినట్లు గుర్తించారు. డాక్టర్లు భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్‌, త్రినాథ్‌ లు ఈ కేసును చాలెంజ్ గా తీసుకున్నారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి సరిగ్గా ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో ఆ భాగం కీలకమైనది కావడంతో చాలా జాగ్రత్తగా సర్జరీ చేశారు. రోగి స్పృహలో ఉండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యంతో సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్ఛార్జి చేశారు. ఇదే ఆసుపత్రిలో 2017 లోనూ ఈ తరహా శస్త్రచికిత్స నిర్వహించి వైద్యులు విజయం సాధించారు. విజయకుమారి అనే మహిళకు మెదడులో కణితి (కెవర్నోమా)ని ఆపరేషన్ చేసి తొలగించారు. ఆమెకు బాహుబలి-2 సినిమాను చూపిస్తూ అప్పట్లో ఈ శస్త్రచికిత్స చేశారు. గుంటూరు గవర్న్ మెంట్ హాస్పిటల్ న్యూరోసర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీహెచ్ శ్రీనివాస్ రెడ్డి ఈ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.

No comments:

Post a Comment