తిరుమలకు టాలీవుడ్
టూరు: నయా ట్రెండ్ షురూ
తెలుగు చిత్ర పరిశ్రమ కొత్త ఒరవడి కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుమల శ్రీవారి దర్శనం సెంటిమెంట్ నయా ట్రెండ్. టాలీవుడ్ నమ్మకాలకు
పెట్టింది పేరు. సినిమా ప్రారంభానికి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి ముహూర్తాలు,
సెంటిమెంట్లతో యావత్ చిత్ర నిర్మాణం జరుగుతుంది. ప్రస్తుతం తమ సినిమాలు విడుదలై
విజయం సాధించాక తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ యూనిట్లు క్యూ కడుతున్నాయి.
తాజాగా `జాను` చిత్ర యూనిట్ కూడా స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చింది. శనివారం ఆ
చిత్ర దర్శకులు, సినీ తారలు, నిర్మాతలు తిరుమలలో సందడి చేశారు. దిల్ రాజు, కిశోర్,
సమంత, శర్వానంద్ వేంకటేశుని సన్నిధిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది
మహేశ్ బాబు, అల్లు అర్జున్ చిత్రాలు `సరిలేరునీకెవ్వరు`..`అల వైకుంఠాపురం` బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో ఈ చిత్రాలు విడుదలై
విజయవంతంగా బాక్సాఫీస్ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని
తొలుత మహేశ్ బాబు అండ్ యూనిట్ ఆ తర్వాత బన్నీ కుటుంబం సహా ఆ సినిమా టీమ్ స్వామి వారి
దర్శనం చేసుకుని తరించారు. మహేశ్ బాబు సకుటుంబ సమేతంగా.. బాబాయి ఆదిశేషగిరిరావు,
నమత్రా, గౌతమ్, సితారలతో కలిసి స్వామి దర్శనం చేసుకున్నారు. ఆయన వెంట అత్యంత
సన్నిహితుడు యువదర్శకుడు వంశీ పైడిపల్లి కూడా తన కుటుంబంతో దర్శనానికి వచ్చారు.
మూవీ డైరెక్టర్ అనిల్ రావివూడి, లేడీ అమితాబ్ విజయశాంతి, రాజేంద్రప్రసాద్
తదితరులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల వ్యవధిలోనే బన్నీ,
త్రివిక్రమ్ టీమ్ తిరుమలలో శ్రీవారి సన్నిధికి విచ్చేశారు. ఈ నెలలోనే `జాను` విడుదలై
తెలుగు ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూవీగా అలరిస్తోంది. దాంతో సెంటిమెంట్ గా ఈ చిత్ర
యూనిట్ కూడా స్వామి వారి మొక్కులు తీర్చుకుంది. గతంలోనూ బాలీవుడ్ టు
టాలీవుడ్ దర్శక, నిర్మాతలు, తారాగణం తిరుమల వెంకన్న దర్శనాలు చేసుకోవడం రివాజుగా వస్తున్నదే.
అయితే ఇలా సినిమా యూనిట్లకు యూనిట్లే శ్రీవారి చెంతకు చేరుతుండడం తాజా విశేషం.