Tuesday, July 16, 2019

World hunger not going down, at the same time obesity also growing up


ఆకలి..ఊబకాయం రెండూ పైపైకే
ప్రగతి బాటలో పరుగులు పెడుతోన్న ప్రపంచంలో ఆకలి కేకలు ఓ వైపు, ఊబకాయం మరో వైపు ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ప్రపంచ జనాభాలో ప్రతి 9 మందిలో ఒకరు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు వరల్డ్ ఆర్గనైజేషన్స్ నివేదికలు ఉద్ఘోషిస్తున్నాయి. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ తాజా నివేదిక ప్రకారం 82 కోట్ల మంది (820 మిలియన్లు) పోషకాహార లేమితో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది ఈ సంఖ్య 81 కోట్ల 10 లక్షలుంది. 2030 నాటికి పోషకాహార లేమితో బాధపడే మనుషులే లేకుండా చూడాలన్న లక్ష్య సాధన ప్రస్తుతం క్లిష్టంగా మారింది. అంతేకాకుండా 2050 నాటికి అదనంగా మరో 200 కోట్ల మంది (2 బిలియన్లు) పోషకాహార లేమి ని ఎదుర్కోనున్నారనే నివేదికలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఒ), అంతర్జాతీయ ద్రవ్యనిధి, వ్యవసాయాభివృద్ధి సంఘం (ఐ.ఎఫ్.ఎ.డి), ఐక్యరాజ్యసమితి బాలల సంఘం (యూనీసెఫ్), ప్రపంచ ఆహార కార్యక్రమాల అమలు సంఘం (డబ్ల్యు.ఎఫ్.పి), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ)ల అధినేతలు సంయుక్తంగా ఈ విపత్కర పరిస్థితి అడ్డుకట్టకు ముందడుగు వేయాల్సిన ఆవ్యశ్యకతను ఈ నివేదక స్పష్టం చేస్తోంది. 
అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే పోషకాహార లేమితో బాధపడుతున్న వారి జనాభా ఎక్కువగా ఉంది. దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లోనే దాదాపు 50 కోట్ల మంది పోషకాహారలేమితో బాధపడుతున్నారు. ఆఫ్రికా దేశాల మొత్తం జనాభాలో వీరి శాతం ఏకంగా 30.8 గా నమోదయింది. ముఖ్యంగా అయిదేళ్ల లోపు శిశు మరణాల్లో అత్యధిక శాతం పోషకాహార లేమి కారణంగానే అని స్పష్టం చేస్తోన్న నివేదిక భవిష్యత్ లో ఆరోగ్యకర సమాజం ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. ఏటా 30 లక్షల మంది పిల్లలు పోషకాహార లేమితో మృత్యుదరి చేరుతున్నారు. ప్రపంచం మొత్తం 66 లక్షల మంది పిల్లలు రోజూ సరైన ఆహారం తినకుండా బడులకు వెళ్తుండగా అందులో 23 లక్షల మంది పిల్లలు ఆఫ్రికా దేశాలకు చెందినవారు కావడం గమనార్హం.  స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల (sustainable development goal SDG-2) సాధనకు అంతర్జాతీయ సంస్థలు కూడి రావాల్సిన సమయం ఆసన్నమైంది. 
ఊబకాయం సమస్య అన్ని ఖండాలు, అన్ని ప్రాంతాల్లో నమోదయింది. ముఖ్యంగా యువత, పాఠశాలల బాలల్లో అత్యధికులు ఈ ఊబకాయం సమస్య బారిన పడుతున్నారు.  సరైన ఆహార నియమాలు పాటించక అనారోగ్యకర ఆహారాన్ని(జంక్ ఫుడ్స్) తీసుకుంటున్న ఆయా దేశాల్లోని పిల్లలు ఈ ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రతి 10 మందిలో 9 మంది ఈ సమస్యకు లోనవుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. డబ్ల్యు.హెచ్.ఒ. నివేదిక ప్రకారం 2016 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య 65 కోట్లు. ఇందులో 39% 18 ఏళ్ల లోపు వాళ్లే. 1975 నుంచి 2016 నాటికి ఊబకాయల సంఖ్య మూడింతలు పెరగడం గమనార్హం.


No comments:

Post a Comment