వెల్లింగ్టన్ వాసుల్ని భయపెట్టిన నీలిరంగు పెంగ్విన్ల జోడి
న్యూజిలాండ్ రాజధాని
వెల్లింగ్టన్ లో చిట్టి పెంగ్విన్ పక్షుల జోడి కలకలం రేపింది. మంగళవారం ఈ ఘటన
స్థానిక సుషి బార్ లో చోటు చేసుకుంది. వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్ కు సమీపంలో గల
ఈ బార్ లో సోమవారం కూడా ఈ పక్షుల జోడిని అక్కడ సిబ్బంది గమనించారు. మళ్లీ మంగళవారం
కూడా ఈ పక్షులు బార్ ప్రాంగణంలోని ఓ రూమ్ ఏసీ బాక్స్ వద్ద తచ్చాడాయి. వీటి జాడను
గుర్తించిన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు
వీటిని పట్టుకుని తీసుకెళ్లి కిలోమీటర్ దూరంలో గల హార్బర్ ప్రాంతంలో
విడిచిపెట్టారు. అదే ప్రాంతంలో అప్పుడప్పుడు ఈ నీలి రంగు పెంగ్విన్ పక్షులు
తిరుగాడుతుంటాయి. అయితే ఇలా రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రాంతాల్లో వీటిని చూడ్డం
అరుదేనట. ఇంతకీ జనం అంతగా భయాందోళనకు గురి కావడానికి కారణమేంటంటే ఇవి అన్ని
పక్షుల్లా మనుషులకు భయపడవు. పైగా ఇవే మనుషులపై దాడి చేస్తాయి. తమ ఉనికికి
ఇబ్బందిగా అనిపించినా వీటి ఏకాంత వాసానికి భంగం కల్గినా ఆహారం లభించకపోయినా
మనుషులే లక్ష్యంగా సూదంటి ముక్కు, గోళ్లతో మనుషుల్ని గాయపరుస్తుంటాయని అధికారులు
తెలిపారు. దాంతో వీటిని క్రూర జంతువుల మాదిరిగా ప్రమాదకర పక్షుల జాబితాలో జనం చేర్చారు.
అదీ గాక ఇవి ఒకచోట గూడు ఏర్పాటు చేసుకున్నాయంటే ఎంత దూరం తీసుకెళ్లి విడిచినా తిరిగి
అదే చోటుకి వచ్చి చేరతాయట. దాంతో బార్ సిబ్బంది సత్వరం స్పందించి పోలీసులకు ఫిర్యాదు
ఇచ్చి వీటి బెడదను వదిలించుకున్నారు. సుషి బార్ సిబ్బంది రేడియో న్యూజిలాండ్ (ఆర్.ఎన్.జి)
తో ఈ నీలి పెంగ్విన్ల సమాచారాన్ని పంచుకున్నారు. వీటిని వెల్లింగ్టన్ హార్బర్ ప్ర్రాంతంలో
విడిచివచ్చిన పోలీస్ కానిస్టేబుల్ జాన్ జు సోషల్ మీడియా (ఫేస్ బుక్)లో ఈ సమాచారాన్ని
పోస్టు చేశాడు. జంతు సంరక్షణ శాఖ (డిపార్ట్ మెంట్ ఆఫ్ కన్జర్వేషన్-డీఓసీ) కార్యనిర్వహణాధికారి
జాక్ మేస్ మాత్రం ఈ పక్షులు మళ్లీ తిరిగి రావచ్చని భావిస్తున్నారు. తొలుత ఈ పెంగ్విన్ల
రాకను బార్ సిబ్బంది వీనీ మోరిస్ పసిగట్టింది. అయితే ఈ పక్షులంటే జనానికి భయం కావచ్చు
గానీ అవి మాత్రం ప్రేమించదగినవేనని ఆమె పేర్కొంది.
No comments:
Post a Comment