Tuesday, November 15, 2022

Tollywood Legendary Veteran Hero SuperStar Krishna

ఆయనే కీర్తి.. ఆయనో స్ఫూర్తి

తెలుగు చలనచిత్రసీమ పరిశ్రమగా ఎదిగి మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అత్యధిక చిత్రాల్లో నటించిన కథనాయకుడిగానే కాక నిర్మాతగా, స్టూడియో అధినేతగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన ప్రతిభావంతుడు. 1964 తేనె మనసులు మొదలు, 2016 శ్రీశ్రీ వరకు ఆయన 350కి పైగా సినిమాల్లో నటించి వేలమందికి పని కల్పించిన మహనీయుడు. ఆయన ప్రేక్షకులు, అభిమానుల్ని అలరించడంతో పాటు నిర్మాతల హీరోగా పేరొందిన కీర్తి పతాక. అన్నింటికి మించి మంచి మనసున్న నటశేఖర్ కృష్ణ యావత్ టాలీవుడ్ కి స్ఫూర్తి ప్రదాత. తెలుగు సినీ సీమలో ఆయనదో సువర్ణాధ్యాయం.

Wednesday, November 9, 2022

visakha steel plant employees bike rally against privatization

స్టీల్ ప్లాంట్ కార్మికుల బైక్ ర్యాలీ

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (ఆర్.ఐ.ఎన్.ఎల్) కార్మికులు నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. బుధవారం ఉదయం కూర్మానపాలెంలో గల ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎంప్లాయీస్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే నగరంలో పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉన్నందున ర్యాలీలకు అనుమతి లేదని ఆ శాఖ ప్రకటించింది. దాంతో ఎక్కడికక్కడ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఇదిలావుండగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా కార్మికులు చేపట్టిన ఆందోళన 635వ రోజుకు చేరుకుంది. ప్రధాని మోదీ ఈనెల 12 నగర పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్లాంట్ ఎంప్లాయీస్ నిరసన తీవ్రతను పెంచారు. ఆ రోజు నేరుగా ప్రధానిని కలిసి వినతిపత్రం సమర్పించాలని విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణ సమితి నిర్ణయించింది.  

Friday, November 4, 2022

Fridge blast at home kills 3, injures 2 in Tamil Nadu

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలి ముగ్గురి దుర్మరణం

తమిళనాడులో ఫ్రిడ్జ్ పేలిన దుర్ఘటనలో మూడు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం ఈ ప్రమాదం చెంగల్‌పేట జిల్లా గుడువాంచేరి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఆర్‌ఆర్‌ బృందావన్‌ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ కంప్రెషర్ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. భారీ పేలుడు శబ్దం విని అపార్ట్‌మెంట్‌లోని ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఇల్లంతా మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. దుర్ఘటనలో గిరిజ (63), ఆమె సోదరి రాధ (55), ఆమె సోదరుడు రాజ్‌కుమార్ (47) అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ అపార్ట్‌మెంట్‌లో ఏడాది క్రితం మృతి చెందిన వెంకట్‌రామన్‌ ఇంట్లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న అతని భార్య గిరిజ సహా అతని కుటుంబం వెంకట్రామన్‌కు వార్షిక కర్మలు (శ్రాద్ధం) చెల్లించడానికి గురువారం రాత్రి ఇక్కడ ఇంటికి వచ్చారు. ప్రమాద సమయంలో వీరితో పాటు రాజ్‌కుమార్ భార్య భార్గవి (35), అతని కుమార్తె ఆరాధన (6) ఉన్నారు. వీరిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని క్రోంపేట ప్రభుత్వ కళాశాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tuesday, November 1, 2022

Andhra Pradesh formation day celebrations held at CM camp office Tadepalli

ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవం

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసులో మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్‌ అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తొలుత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌ అచీవ్‌మెంట్‌-2022 అవార్డుల్ని ప్రకటించారు. వివిధ రంగాల్లో కృషి చేసిన 20 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 మందికి అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రానికి ఎంతో గొప్ప సంస్కృతి ఉందనన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల కోసం ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అమలు చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయం, విద్య, వైద్యంలో ఎన్నో మంచి కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. అవార్డులు అందుకుంటున్న వారందరికీ గవర్నర్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో వై.ఎస్.విజయమ్మ కూడా పాల్గొన్నారు.