Friday, July 15, 2022

andhra pradesh cm ys jagan conducts aerial survey of flood hit areas

గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి నేరుగా జగన్ హెలికాఫ్టర్లో గోదావరి ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే వరద పరిస్థితి కొలిక్కివచ్చే వరకు వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.  

Friday, July 8, 2022

Vijayamma resigns from YSRCP, announces support for daughter Sharmila

Vijayamma resigns from YSRCP, announces support for daughter Sharmila

వైఎస్ ఆర్ సీపీకి విజయమ్మ రాజీనామా

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తన కుమార్తె వై.ఎస్. షర్మిలకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ని నెలకొల్పిన తనయ షర్మిల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్న ఆమె ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవ అధ్యక్షరాలి పదవి నుంచి తప్పుకుంటున్నానన్నారు. తనను అందరూ క్షమించాలని కోరారు.  గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదుట ప్రస్తుతం జరుగుతున్న వై.ఎస్.ఆర్.సి.పి. ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరయిన ఆమె ఆ హోదాలో తుది ప్రసంగం చేశారు. వై.ఎస్ ఆకస్మిక మరణం దరిమిలా కుమారుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి కష్టాలు ఎదురైనప్పుడు తనతో పాటు షర్మిల, యావత్ కుటుంబం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన సంగతిని విజయమ్మ గుర్తు చేశారు. ఇప్పుడు టీఎస్ లో కుమార్తె షర్మిల వై.ఎస్ ఆశయసాధనకు పాటుపడుతోందని అందుకే ప్రస్తుతం ఆమెకు చేయూత అవసరమన్నారు. అందువల్ల రెండు పార్టీల్లో కొనసాగడం మంచిది కాదని తన అంతరాత్మ ప్రబోధిస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ వివరించారు.

Thursday, June 30, 2022

Sri Sathya Sai auto accident CM YSJagan announces Rs.10 lakhs ex gratia

 కూలీల్ని పొట్టనబెట్టుకున్న కరెంట్ తీగ

శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఘోర దుర్ఘటన సంభవించింది. తాడిమర్రి మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనలో అయిదుగురు మహిళలు సజీవదహనం అయ్యారు. చిల్లకొండయ్యపల్లిలో ఈ ఉదయం వ్యవసాయ పనుల కోసం మహిళా కూలీలు ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో ఆటోపై  హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడిపోయాయి. దాంతో ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో ఆటోలో వెళ్తున్న మహిళా కూలీలు అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. వీరిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

Tuesday, May 31, 2022

TTD Total Plastic Ban In Tirumala on 1 June

తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం

కలియుగ ఇల వైకుంఠం తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమల గిరులపై ఈ నిషేధాజ్ఞల్ని కఠినంగా అమలు చేయనున్నారు. బుధవారం (జూన్ 1) నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇకపై ప్లాస్టిక్ తో తయారైన అన్నిరకాల వస్తువుల వాడకం తిరుమలలో నిషేధం. ప్లాస్టిక్ కవర్లు, సీసాలు సహా షాంపూ ప్యాకెట్లను సైతం భక్తులు వెంట తీసుకురాకూడదని టీటీడీ స్పష్టం చేసింది.