Tuesday, March 29, 2022

Tamil Nadu Young man buys dream bike of Rs 2.6 lakh with Rs.1 coins

రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు

తమిళనాడు సేలం జిల్లా అమ్మపేటకు చెందిన ఓ యువకుడు చిల్లర నాణేలతో బైక్ కొని వార్తల్లోకెక్కాడు. భూపతి అనే చిరుద్యోగి రూ.2.60 లక్షలతో బజాజ్ డొమినర్-400 బైక్ కొన్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ 29 ఏళ్ల యువకుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి బైక్ కొనాలనే ఆశ. మూడేళ్లు క్రితం అతను బజాజ్ షోరూంకు వెళ్లి బైక్ రేటు గురించి కనుక్కున్నాడు. అప్పటి నుంచి రూపాయి నాణేలను కూడబెట్టాడు. ఆ నాణేలన్నింటిని బస్తాల్లో కట్టి బజాజ్ షోరూంకు ట్రాలీలో తీసుకొచ్చాడు. తొలుత అంగీకరించని షోరూం సిబ్బంది భూపతి బ్రతిమలాడ్డంతో తర్వాత ఒప్పుకున్నారు. నాణేలు లెక్కించడానికి అతని స్నేహితులతో పాటు సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు. లెక్క సరిపోయాక బిల్లు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది అతనికి బైక్ ఇచ్చి పంపించారు. దాంతో హైఎండ్ బజాజ్ బైక్ పై భూపతి కేరింతలు కొడుతూ ఇంటికి చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన అతను స్నేహితులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Monday, March 28, 2022

Telangana CM KCR attended inauguration ceremony of reconstructed Yadadri temple

నవ వైకుంఠం యాదాద్రి

తెలంగాణ తిరుమలగా భక్త జనకోటిని అలరించనున్న యాదాద్రి ఆలయం పున:ప్రారంభమయింది. లక్ష్మీనరసింహస్వామి ప్రత్యక్ష దర్శనం అందరికీ ఈ సాయంత్రం నుంచి అందుబాటులోకి రానుంది. నవ వైకుంఠంగా భాసిల్లుతున్న యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాలు దర్శన భాగ్య క్రతువులు సోమవారం పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి ప్రధానాలయంలో స్వయంభువుల నిజదర్శనాలు షురూ అయ్యాయి. ఆరేళ్ల అనంతరం మూలవరుల దర్శనాలు మొదలయ్యాయి. ఈ ఉదయం సీఎం దంపతులు, అసెంబ్లీ, మండలి సభాపతులైన స్పీకర్, చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారం రోజులుగా బాలాలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్టామూర్తులతో ఉదయం 9.30 గంటలకు చేపట్టిన శోభాయాత్రలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. యాదాద్రి మాడ వీధుల్లో వైభవోపేతంగా స్వామి వారి ఉత్సవ మూర్తుల్ని ఊరేగించారు. విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు, ఆరు రాజగోపురాలపై స్వర్ణ కలశాలకు సంప్రోక్షణ నిర్వహించారు. మిథున లగ్నంలో ఏకాదశిన ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం అయింది. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు 12.10 గంటలకు ప్రధానాలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించారు. తర్వాత గర్భాలయంలోని మూలవరుల దర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని తొలి పూజలు చేశారు. మరోవైపు నాలుగంతస్తుల క్యూకాంప్లెక్స్‌తో పాటు కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్నప్రసాదానికి దీక్షాపరుల మండపాలన్నింటిని భక్తుల కోసం సిద్ధం చేశారు.

Wednesday, March 23, 2022

Kodali Nani fires again on Chandra Babu in the AP Assembly

చంద్రబాబుపై మళ్లీ రెచ్చిపోయిన మంత్రి కొడాలి

బూతుల మంత్రిగా, ఆవేశపరుడిగా ప్రతిపక్షాలు పేర్కొంటున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తన మాజీ బాస్ చంద్రబాబుపై మళ్లీ నోరుపారేసుకున్నారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరోసారి ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తిట్ల దండకం అందుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కల్తీ, నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ తెలుగుదేశం శాసనసభ్యులు తాజాగా ఈరోజు స్పీకర్ పోడియం ను చుట్టుముట్టారు. చిడతలు కొడుతూ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ చర్య పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అసలు ఎమ్మెల్యేలేనా? అసెంబ్లీ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నారు.. ప్రజలు ప్రత్యక్ష ప్రసారంలో మీ చేష్టలన్నింటిని చూస్తున్నారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఈ దశలో మంత్రి కొడాలి జోక్యం చేసుకుంటూ చంద్రబాబుపై యథావిధిగా మాటల దాడి చేశారు. సన్నాసి, వెదవ అంటూ తిట్ల వర్షం కురిపించారు. చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా చంద్రబాబు ఆదేశాల ప్రకారమే పోడియం వద్ద ఆందోళన చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వారుణవాహిని అని పేరు పెట్టి అందరికీ సారాను అందుబాటులోకి తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు. చంద్రబాబు `చీప్` మినిస్టరని.. చీప్ లిక్కర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటూ కొడాలి ఎద్దేవా చేశారు.

Saturday, March 19, 2022

10 died 25 injured in bus accident in Karnataka

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

·        10 మంది దుర్మరణం, 15 మందికి గాయాలు

కర్ణాటకలోని ఓ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 26 మందితో ప్రయాణిస్తున్న ఎస్.వి.టి. బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండడం వల్లే డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడిందని స్థానికులు తెలిపారు. వై.ఎన్.హోసకోట నుంచి పావగడకి బస్సు బయలుదేరింది. పలవలహళ్లి సమీపంలో ప్రమాదం బారినపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది గాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.