Saturday, December 25, 2021

Telangana KTR lashes out BJP body shaming son

తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్న నెటిజన్లు

అందరివాడుగా మన్ననలు అందుకున్న తీన్మార్ మల్లన్న ఒక్క ప్రోగ్రామ్ తో బదనాం అయిపోయాడు. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖామంత్రి కె.టి.ఆర్ తనయుడు హిమాన్ష్ పై మల్లన్న సరదాగా చేసిన కార్యక్రమం అతని కొంపముంచేసింది. కుటుంబసభ్యుల్ని అందులోనూ ఓ స్కూల్ విద్యార్థి అయిన తన కుమారుడి పట్ల మల్లన్న చేసిన కామెంట్ హేయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్మార్గపు పోకడలకు సోషల్ మీడియా స్వర్గంగా తయారయిందని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. మరోవైపు నెటిజన్లు మూక్కుమ్మడిగా తీన్మార్ మల్లన్నకు తలంటేస్తున్నారు. వై.ఎస్.ఆర్.టి.పి. అధ్యక్షురాలు షర్మిల కూడా మల్లన్న వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పబట్టారు. రాజకీయాలు కుటుంబ సభ్యుల వరకు తీసుకురాకూడదని మహిళలు, పిల్లల్ని లక్ష్యంగా చేసుకుని  కామెంట్లు చేయడం తప్పన్నారు.  కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత సైతం తీన్మార్ మల్లన్న వైఖరిని ఖండించారు. ఏ విషయమూ దొరక్క పిల్లాడిని అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానం చేయడం తగదన్నారు. స్వేరో నేత, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ కూడా మల్లన్న ట్వీట్ ను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Friday, December 24, 2021

Shilpa Chowdary gets bail released from Chanchalaguda central jail

ఎట్టకేలకు శిల్పాచౌదరి విడుదల

 కిట్టీ పార్టీల పేరుతో కోట్లకు టోకరా వేసి అరెస్టయిన శిల్పాచౌదరి శుక్రవారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయింది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయగా ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అధిక వడ్డీలు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరుతో బడావ్యక్తుల్ని కోట్ల రూపాయలకు ముంచేసిన కేసులో శిల్పా నిందితురాలు. బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం శిల్పాచౌదరికి కొన్ని షరతులు విధించింది. రూ.10వేల ష్యూరిటీ సమర్పించడంతో విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశించింది. ఎవరితోనూ ఫోన్‌లో కానీ, నేరుగా కానీ ఈ కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు గట్టిగా చెప్పింది. అలాగే ప్రతి శనివారం నార్సింగి పోలీస్‌‌స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 13న దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 25న శిల్పాచౌదరి, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అనుమతితో మూడుసార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించినా ఆమె నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్‌నగర్‌లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని మాత్రం చెప్పుకొచ్చింది. వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణ సందర్భంగా శిల్పా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె భర్తకు ఉప్పర్‌పల్లి కోర్టు గతంలోనూ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శిల్పాచౌదరి బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కోర్టు తిరస్కరించడం గమనార్హం.

Wednesday, December 22, 2021

once again tension prevailed in Vizianagaram district Ramatheertham temple

వేడెక్కిన రామతీర్థం

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా మరోసారి వేడెక్కింది. ఏడాది క్రితం జిల్లాలోని రామతీర్థం ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ పురాతన రామాలయంలో గల శ్రీరాముని విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం తల నరికేసిన దుండగులు అశేషభక్తుల మనోభావాలను  దెబ్బతీశారు. దీనికి సంబంధించి నిందితులెవ్వర్ని ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోయిందని ఆలయ ధర్మాధికారి మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది తర్వాత తీరిగ్గా ప్రభుత్వం ఇక్కడ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోందని విమర్శించారు. ఇది `సర్కస్ కాదు.. పూజ` అని గుర్తు పెట్టుకోవాలని కోరారు. అదేవిధంగా ఆలయ జీర్ణోద్ధరణ కోసం తను విరాళం ఇవ్వగా మొహం మీదే తిప్పికొట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. భక్తులు ఆరాధనపూర్వకంగా చెల్లించే విరాళాల్ని ప్రభుత్వం తిరస్కరించడం మానుకోవాలని సూచించారు. ఇదిలావుండగా రామతీర్థం ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలకు మంత్రులు వెల్లంపల్లిశ్రీనివాస్, బొత్స సత్యనారాయణ బుధవారం శంకుస్థాపన చేశారు.


Monday, December 13, 2021

Search continues for victims of tornadoes that killed dozens in 7 states of US

టోర్నడోల ధాటికి అమెరికా విలవిల

అమెరికాను టోర్నడోలు అతలాకుతలం చేశాయి. ఇటీవల విరుచుకుపడిన టోర్నడోల ధాటికి ఆ దేశంలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు వార్తలందుతున్నాయి. దాదాపు ఏడు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా తలెత్తిన టోర్నడోలు జనజీవితాన్ని ఛిద్రం చేశాయి. వర్షానికి తోడు బలమైన ఈదురు గాలుల వల్ల ఇళ్లు, కార్యాలయాల పైకప్పులు ఎగిరిపోయాయి. సుడిగాలులు బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా కెంటకీలో పరిస్థితి భయంకరంగా మారింది. రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైన తుపాను అని  గవర్నర్‌ ఆండీ బెషియర్‌ చెప్పారు. మేఫీల్డ్‌ నగరంలో అమెజాన్‌ క్యాండిల్‌ ఫ్యాక్టరీ ధ్వంసమయింది. శిథిలాల కింద 110 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. వారిలో 29 మంది మరణించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్‌ పండగ సందర్భంగా ఆర్డర్లు అధికంగా ఉండడంతో వారంతా రాత్రిపూట కూడా పనిచేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి అధికారులు చర్యలు చేపట్టారు. కెంటకీలో మొత్తంగా 70 మందికి పైగా మరణించినట్లు అధికారిక సమాచారం. ఆ రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 227 మైళ్ల మేర టోర్నడోల ప్రభావం కనిపించిందని గవర్నర్‌ తెలిపారు. స్థానిక అధికారులు, నేషనల్‌ గార్డు సభ్యులు, ఎమర్జెన్సీ వర్కర్స్‌ మేఫీల్డ్‌ సిటీలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఆర్కాన్సస్‌ రాష్ట్రంలో ఈ  ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. మోనెట్టి మానర్‌ నర్సింగ్‌ హోమ్‌ ధ్వంసం కావడంతో ఒకరు మరణించారు. మరో 20 మంది లోపలే ఉండిపోగా వారిని రక్షించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెస్సీ రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. లేక్‌ కౌంటీలో ఇద్దరు, ఒబియోన్‌ కౌంటీలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ టోర్నడోల బీభత్సంపై  అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ప్రభావిత రాష్ట్రాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.