Monday, May 17, 2021

TTD vigilance officers found huge cash from begger`s house in Tirupati

ఈ యాచకుడు లక్షాధికారి!

కరోనాతో చనిపోయిన ఓ యాచకుడి ఇంట్లో బయటపడిన డబ్బుల కట్టలు సంచలనం రేపాయి. సోమవారం తిరుపతిలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) విజిలెన్స్ అధికారుల దాడిలో ఈ విషయం వెలుగుచూసింది. తిరుమల స్వామి వారి సన్నిధిలో ఏళ్ల తరబడి భిక్షాటన చేసిన శ్రీనివాసాచారి అనే వ్యక్తి గతేడాది కరోనాతో చనిపోయాడు. గతంలో ఈ యాచకుడు తిరుమలలోనే గుడిసె వేసుకుని భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునేవాడు. అయితే టీటీడీ కొండపై ఈ విధంగా జీవనం సాగిస్తున్న వారినందర్ని తిరుపతికి తరలించి ఇళ్లను నిర్మించి ఇచ్చింది.  ఆ విధంగా రోజువారీ శ్రీనివాసాచారి తిరుమల నుంచి రాత్రికి తిరుపతి చేరుకుని టీటీడీ కేటాయించిన ఇంట్లో నివసించేవాడు. అతనికి బంధువులు ఎవరూ లేకపోవడంతో ఒంటరిగానే ఉండేవాడని ఇరుగుపొరుగులు తెలిపారు. కరోనాతో చనిపోవడంతో అతనికిచ్చిన ఇంటిని వేరేవారికి కేటాయించేందుకు విజిలెన్స్ తనిఖీ కోసం ఆ ఇంటికి వచ్చింది. ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లిన అధికారులకు  పెద్ద ఎత్తున డబ్బు కట్టలు కనిపించడంతో అవాక్కయ్యారు. టీటీడీ స్వాధీనం చేసుకున్న ఆ సొమ్ము రూ.10 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

Tuesday, May 11, 2021

Italian woman given six doses of Pfizer vaccine by mistake

ఇటలీ మహిళకు ఒకేసారి ఆరుడోసుల వ్యాక్సిన్

ఆమె అదృష్టం బాగుండి బతికి బట్టకట్టింది. కరోనా మహమ్మారి బెడద నుంచి తప్పించుకోవడానికని వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే ఆరుడోసుల్ని ఒకేసారి ఎక్కించేశారు. ఈ ఘటన ఇటలీలో ఆదివారం జరిగింది. ఓ నర్సు ఒత్తిడిలో ఉందో.. ఏమరుపాటు గానో వ్యాక్సిన్ వేసింది. తర్వాత వైల్ ను పరిశీలించగా ఖాళీగా ఉంది. పక్కన 5 ఖాళీ సిరంజీలు దర్శనమిచ్చాయి. అప్పటికి గానీ ఆ నర్సుకు జరిగిన తప్పిదం తెలిసిరాలేదు. అంటే వైల్ లో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ఆరు డోసుల్ని ఒకే సిరంజిలో లోడ్ చేసి మహిళకు ఇంజెక్ట్ చేసింది. పొరపాటు తెలుసుకున్న నర్సు వెంటనే ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వ్యాక్సిన్‌ తీసుకున్న మహిళను వెంటనే ఇన్ పెషెంట్ గా చేర్చుకుని వైద్యం అందించారు. ఆమె ఆరోగ్యం 24 గంటల తర్వాత కుదుటపడ్డంతో వైద్య సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు వారాల పాటు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ప్రత్యేక వైద్యుల్ని నియమించారు. ఫైజర్ వ్యాక్సిన్ అధిక మోతాదును పరీక్షించడానికి మునుపటి అధ్యయనాలు నాలుగు మోతాదులకే పరిమితం చేయబడ్డాయి.  అంతకన్నా ఎక్కువ మోతాదులో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయిల్ లో నిషేధం. ఇటువంటి ఘటనే ఈ ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు ఇదేవిధంగా ఓ వృద్ధ మహిళకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల్ని ఒకేసారి ఇచ్చింది. సదరు నర్సు సెల్ ఫోన్ మెసేజ్ లు చూసుకుంటూ ఓ డోసు తీసుకుని అక్కడే కూర్చున్న మహిళకు మరో డోసు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే ఆ మహిళకు ఎటువంటి అనారోగ్యం కల్గకపోవడంతో అక్కడ వైద్యసిబ్బంది హమ్మయ్య అనుకున్నారు.

Friday, May 7, 2021

Australia PM says India travel ban to end on May 15

15 వరకే భారత్-ఆస్ట్రేలియా  ప్రయాణ నిషేధం  

భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చే ఆస్ట్రేలియన్ల ప్రయాణ నిషేధాన్ని ఈనెల 15 దాటి పొడిగించబోమని ఆదేశ ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. శుక్రవారం జాతీయ భద్రతా కమిటీ భేటీ తర్వాత మోరిసన్ ఈ మేరకు ప్రకటించారు. మే15 తర్వాత నిషేధాన్ని పొడిగించాల్సిన అవసరం లేదన్నారు. ఆ తేదీ వరకు మాత్రం బయోసెక్యూరిటీ ఆర్డర్‌ను కచ్చితంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఆస్ట్రేలియన్లను స్వదేశానికి తిరిగి రప్పించే విమానాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రధాని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం చరిత్రలో తొలిసారిగా తమ పౌరులు స్వదేశానికి తిరిగి రాకుండా తాత్కాలిక నిషేధాన్ని విధించింది. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన నేపథ్యంలో ఈ నిషేధం అనివార్యమయింది. ఆసిస్ తిరిగి రావడానికి 14 రోజుల ముందు వరకు భారతదేశంలో గడిపినట్లయితే ఐదేళ్ల జైలు శిక్ష లేదా 66,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.37,89,112) జరిమానా విధిస్తామని మోరిసన్  ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ ఉత్తర్వులు ఈ15వ తేదీతో ముగియనున్నాయి.

Sunday, May 2, 2021

Inter Exams postponed in AP

ఏపీలో ఇంటర్ పరీక్షల వాయిదా

కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో  ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం.. పరీక్షలు నిర్వహించి తీరుతామన్న రాష్ట్ర ప్రభుత్వం  హైకోర్టు సూచన ప్రకారం మెట్టుదిగివచ్చింది. కోవిడ్ తాజా కల్లోలం దరిమిలా పదో తరగతి, ఇంటర్ చదువుతున్న 30 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడాల్సి ఉందని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పరీక్షల్ని వాయిదా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం విచారణ చేపట్టింది. తీర్పు సోమవారం (మే3)న వెలువడాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కరోజు ముందుగా ఆదివారమే ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ మేరకు ప్రకటన చేస్తూ పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ పరీక్షల తాజా షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు.