Friday, January 29, 2021

Andhra Pradesh Grama volunteer died in attack in Guntur

అసభ్యంగా ప్రవర్తించాడని వాలంటీర్ హత్య

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ వాలంటీర్ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తల్లిదండ్రులు దాడి చేసి చంపిన ఘటన ఇది. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. 21 ఏళ్ల నంబల నాగరాజు గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అతను ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలున్నాయి. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు అతనిపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన నాగరాజును వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తీసుకెళ్తుండగా ప్రాణాలు విడిచాడు. వినుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నాగరాజు మాట్లాడుతూ తను నిద్రలో ఉండగా తలుపులు తీసుకొని వచ్చిన దుండగులు తనపై దాడికి పాల్పడ్డారన్నాడు. ఓ యువతితో వచ్చిన వివాదంతోనే ఆమె బంధువులు తనపై దాడి చేశారని చెప్పాడు. యువతి పట్ల వాలంటీరు అనుసరించిన తీరే ఈ దాడికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Wednesday, January 20, 2021

Joe Biden sworn in as America`s 46th President

 అమెరికా అధ్యక్షుడిగా జై బైడెన్ ప్రమాణస్వీకారం

అమెరికా ప్రజాస్వామ్యం గెలిచింది.. ఈ గెలుపు ప్రతి అమెరికా పౌరుడిది అని కొత్త శ్వేతసౌధాధిపతి జోబైడెన్ ఉద్ఘాటించారు. ప్రెసిడెంట్ గా బైడన్, వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ లు జనవరి 20 బుధవారం పదవీ ప్రమాణాలు చేశారు. తొలుత కమలా ప్రమాణస్వీకారం చేయగా తర్వాత బైడెన్ ప్రమాణం చేశారు. అనంతరం జాతినుద్దేశించి అధ్యక్షుడిగా తొలి ప్రసంగం చేశారు. మహోన్నత అమెరికా చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు `అమెరికా డే` గా పేర్కొన్నారు. చరిత్రలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అగ్రరాజ్యంగా నిలిచిందన్నారు.  అమెరికా భవిత కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు. ఉగ్రవాదం పీచమణిచేందుకు మరోసారి అమెరికా ఏకతాటిపై ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వర్ణ, మత వివక్షలకు తమ పాలనలో తావు ఉండబోదన్నారు. ఇటీవల అమెరికా క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి, హింసతో నెలకొన్న భయాందోళనల్ని యావత్ దేశ ప్రజలు సంఘటితంగా నిలిచి పటాపంచలు చేశారన్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పూర్వ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జిబుష్ జూనియర్, బరాక్ ఒబామా హాజరయ్యారు. కానీ ఇప్పటికీ ఎన్నికల్లో తనే గెలిచాననే భ్రమలో ఉన్న (తాజా) మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ వేడుకకు గైర్హాజరయ్యారు.

Tuesday, January 19, 2021

Turkey slaps advertising ban on twitter with new social media law

ట్విటర్ పై టర్కీ కొరడా

టర్కీ ట్విటర్ పై కొరడా ఝళిపించింది. మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం ట్విటర్ దాని అనుబంధ సంస్థలు పెరిస్కోప్, పిన్‌టారెస్ట్ లలో ప్రకటనల నిషేధాన్ని విధించింది. టర్కీలో స్థానిక ప్రతినిధులను నియమించడంలో విఫలమైన ట్విటర్ పై ఈ మేరకు టర్కీ చర్యలు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అథారిటీ చట్టం ప్రకారం తమ స్థానిక ప్రతినిధులను నియమించని సోషల్ మీడియా కంపెనీలపై జరిమానాలను సైతం ప్రభుత్వం విధిస్తోంది. ఈ కొత్త చట్టం ప్రకారం తమ దేశ నిబంధనలకు అనుగుణంగా లేని కంటెంట్‌ను ఆయా సోషల్ మీడియా స్థానిక ప్రతినిధులు తొలగించాలి. ముఖ్యంగా విషపు ప్రచారంగా ప్రభుత్వం పేర్కొన్న ట్వీట్లు అన్నింటినీ ఈ ప్రతినిధులు తీసివేయాలి.  ఫేస్‌బుక్  కొత్త నిబంధనలు అమలు పరుస్తున్నప్పటికీ ట్విటర్ మాత్రం తాత్సారం చేస్తుండడంతో టర్కీ ప్రభుత్వానికి చిరెత్తుకొచ్చింది. ఈ నేపథ్యంలో ట్విటర్‌పై ప్రకటనల నిషేధం పడింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇప్పటికే ఫేస్‌బుక్, యూట్యూబ్ లు ప్రభుత్వానికి భారీ జరిమానాలు చెల్లించుకున్నాయి.  టర్కీలో యథేచ్ఛగా చట్ట ఉల్లంఘనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోబోమని ఈ సందర్భంగా టర్కీ ఉప రవాణా మంత్రి ఒమర్ ఫాతిహ్ సయాన్ వ్యాఖ్యానించారు.

Friday, January 15, 2021

Rahul Gandhi attends Tamilanadu Jallikattu Celebrations

జల్లికట్టుకు హాజరైన రాహుల్ గాంధీ

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా  పొంగల్ వేడుకలు సంబరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మదురై సహా ఆయా ప్రాంతాల్లో జోరుగా జల్లికట్టు నిర్వహించారు. అవనియపురంలో వార్షిక జల్లికట్టు (బుల్ టామింగ్) కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళనాడులో మూడు రోజుల పర్యటనకు విచ్చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,  ద్రవిడ మున్నేట్రా కగం (డిఎంకె) యువజన విభాగం నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ చీఫ్ కే ఎస్ అలగిరి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణసామి సహా ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ సంప్రదాయం, సంస్కృతికి మద్దతుగా తను ఇక్కడకి వచ్చానన్నారు. అయితే రాహుల్ గాంధీ జల్లికట్టుకు హాజరుకావడంపై చాలా మంది నిరసన వ్యక్తం చేశారు. పలువురు బీజేపీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నేతలు కాంగ్రెస్ నాయకుడివి అవకాశవాద రాజకీయాలని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి మాట్లాడుతూ గతంలో రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధానికి యూపీఏ ప్రభుత్వం కారణమని అవనిపురానికి రావడానికి రాహుల్ కు నైతిక హక్కు లేదు అని విమర్శించారు.