Thursday, December 10, 2020

Vijayashanthi satirical comments on KCR

కేసీఆర్ పై రాములమ్మ వ్యంగ్యోక్తులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాజాగా బీజేపీలో చేరిన రాములమ్మ (విజయశాంతి) వ్యంగ్యోక్తులు విసిరారు. కేసీఆర్ ను మించిన మహానటుడు లేరన్నారు. కేసీఆర్ కన్నా ముందే తాను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినట్లు విజయశాంతి చెప్పారు. ఉద్యమం కోసమే `తల్లి తెలంగాణ పార్టీ`ని టీఆర్ఎస్‌లో విలీనం చేశానన్నారు. మెదక్ ఎంపీగా ప్రజలు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన సంగతి గుర్తు చేశారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని రాములమ్మ ఆరోపించారు. 

Sunday, November 29, 2020

Remote-controlled Robot Deployed at Egypt Hospital to Take Covid Tests, Warn Those Without Mask

ఈజిప్ట్ లో కరోనా కట్టడికి రోబో సేవలు

కరోనా సెకండ్ వేవ్ భయాందోళనల నేపథ్యంలో ఈజిప్ట్ లో రోబోల్ని రంగంలోకి దింపారు. మహమూద్ ఎల్-కోమి అనే ఆవిష్కర్త ఈ రిమోట్-కంట్రోల్ రోబోట్‌ను సిద్ధం చేశాడు. దాంతో ప్రస్తుతం అక్కడ ఆసుపత్రుల్లో ఈ రోబో సేవల్ని విరివిగా వినియోగించుకుంటున్నారు. సిరా-03 అని పిలువబడే ఈ రోబోట్ కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగలదు. రోగుల ఉష్ణోగ్రతను పరీక్షిస్తుంది. అదేవిధంగా మాస్క్ లు ధరించని వారిని హెచ్చరిస్తుంది. అచ్చం మనిషిలాంటి తల, మొహం, చేతులతో ఈ రోబోట్ ను తీర్చిదిద్దారు. ఈ మరమనిషికి మరో ప్రత్యేకత కూడా ఉంది. వైద్యుల మాదిరిగా ఎకోకార్డియోగ్రామ్‌లు, ఎక్స్‌రేలు చేయగలదు. అంతేకాకుండా ఆ రిపోర్టు ఫలితాలను దాని ఛాతీకి అనుసంధానించిన తెరపై రోగులకు ప్రదర్శిస్తుంది. ఈ రోబోట్లను మనుషుల్లా రూపొందించడమెందుకంటే రోగులు భయపడకుండా ఉండడానికేనని మహమూద్ తెలిపాడు.

Wednesday, November 25, 2020

Diego Maradona dies, aged 60, after heart attack

సాకర్ మాంత్రికుడు మారడోనా కన్నుమూత

సాకర్ ప్రపంచంలో మాంత్రికుడిగా పేరొందిన అర్జెంటీనా అలనాటి మేటి ఆటగాడు డిగో మారడోనా ఆకస్మికంగా మృత్యు ఒడి చేరారు. అర్జెంటీనా వార్తాపత్రిక క్లారన్ కథనం ప్రకారం బుధవారం ఉదయం ఈ ఫుట్‌బాల్ లెజెండ్ టైగ్రేలోని ఇంట్లో గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల మారడోనా తుదిశ్వాస విడిచే వరకు ఆయన శ్వాసధ్యాస సాకరే. అనారోగ్యం కలవరపెడుతున్నా ఫుట్ బాల్ క్రీడకు ఆయన దూరం కాలేదు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఈ అక్టోబర్ 30 న మారడోనా ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇప్పటికీ వివిధ సాకర్ క్లబ్ లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.ఇటీవల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ సమీపంలోని లా ప్లాటాలో పట్రోనాటోను 3-0తో ఓడించిన గిమ్నాసియా జట్టుతో విజయానందంలో పాలుపంచుకున్నాడు. మెదడు శస్త్రచికిత్స అనంతరం కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి మారడోనా ను డిశ్చార్జ్ చేశారు. అయితే ప్రాణాంతక గుండె పోటు ఆయనను బలితీసుకుంది. తన 21 సంవత్సరాల కెరీర్లో కనబర్చిన అద్భుత ఆటతీరుతో మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో" ("ది గోల్డెన్ బాయ్") అనే మారుపేరు స్థిరపడింది. అర్జెంటీనాకు 1986 లో ప్రపంచ కప్ టైటిల్‌ అందించిన ఘనాపాఠి మారడోనా. 20 వ ఫిఫా ప్లేయర్‌గా పీలేతో పాటు, మారడోనా గౌరవం పొందాడు.  2010 ప్రపంచ కప్ సందర్భంగా అర్జెంటీనాకు కొంతకాలం శిక్షణ ఇచ్చాడు.

Tuesday, November 24, 2020

PM Narendra Modi And AP CM YSJagan led trends across Social Media

ప్రజాదరణలో మోదీ, జగన్, మమతా టాప్

దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. సోషల్‌ మీడియా టాప్‌ ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌సంస్థ నివేదిక రూపంలో వెల్లడించింది. గడిచిన మూణ్నెల్ల కాలంలో 95 మంది టాప్‌ పొలిటీషియన్లు, 500 మంది అత్యున్నత ప్రభావశీలురకు సంబంధించిన ట్రెండ్స్‌ను చెక్‌బ్రాండ్స్‌ విశ్లేషించింది. సోషల్‌ మీడియాలో మోదీ హవా టాప్ గేర్ లో కొనసాగుతోంది. తర్వాత స్థానంలో జగన్, మమతాలు దూసుకువచ్చారు. ట్విటర్, గూగుల్‌ సెర్చ్, యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్స్‌ల్లో అత్యధిక ట్రెండ్స్‌ మోదీ పేరుపైనే ఉన్నాయి. ఆగస్ట్‌ నుంచి అక్టోబర్‌ వరకు నమోదైన గణాంకాల్ని చెక్‌బ్రాండ్స్‌సంస్థ పరిగణలోకి తీసుకుంది.  10 కోట్ల ఆన్‌లైన్‌ ఇంప్రెషన్స్‌ ఆధారంగా ఈ తొలి నివేదికను వెలువరించింది. 2,171 ట్రెండ్స్‌తో మోదీ తొలి స్థానంలో ఉండగా స్వల్ప దూరంలో 2,137 ట్రెండ్స్‌తో జగన్‌ రెండో స్థానం కైవసం చేసుకున్నారు. మూడో స్థానంలో పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లు ఉన్నారు. బ్రాండ్‌ వ్యాల్యూ విషయంలోనూ మోదీనే తొలి స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్‌ వాల్యూ రూ. 336 కోట్లు కాగా ఆ తర్వాత స్థానాల్లో అమిత్‌ షా (రూ. 335 కోట్లు), ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (రూ. 328 కోట్లు) ఉన్నారు.