Monday, October 26, 2020

Kanyaka Parameswari Mata decoration with worth above Rs.1 crore currency notes

రూ.కోటి కాంతుల కన్యకాపరమేశ్వరీ

తెలంగాణ గద్వాల్ లోని ప్రసిద్ధ శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆలయం సోమవారం కరెన్సీ నోట్లతో దగదగలాడింది. ఈరోజు అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది. కన్యకాపరమేశ్వరీ మాతను రూ.1,11,11,111 విలువైన కరెన్సీతో అలంకరించారు. రంగురంగుల కరెన్సీ నోట్లను పుష్పాల మాదిరిగా మలచి అమ్మవారికి అలంకరించారు. చాలా కాలం లాక్ డౌన్ కారణంగా మూసివున్న ఆలయం దసరా పర్వదినం వల్ల తెరుచుకోవడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగురంగుల దీపపు కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ ఆలయం హైదరాబాద్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. గతేడాది దసరాతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా గత దసరాలో అమ్మవారిని రూ.3 కోట్ల 33 లక్షల 33 వేల 33 నోట్లతో అలంకరించినట్లు ఆలయ కోశాధికారి పి.రాము తెలిపారు.

Saturday, October 24, 2020

Gitam University Constructions Demolished by Revenue officials

గీతం వర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేత

 విశాఖ గీతం యూనివర్సిటీలో కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. వర్సిటీకి చెందిన కొన్నికట్టడాల్ని రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని అధికారులు పేర్కొన్నారు. రుషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల్లో గీతం యాజమాన్యం చేపట్టిన నిర్మాణాలు కొన్ని అక్రమమని రెవెన్యూ యంత్రాంగం విచారణలో తేలిందట. యూనివర్సిటీ ప్రహరీ (కొంత భాగం), ప్రధాన ద్వారాన్ని అధికారులు కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆ పరిసరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు. బీచ్ రోడ్డు మీదుగా యూనివర్సిటీ వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసివేశారు. ఆ పరిసరాల్లోకి ఎవర్ని అధికారులు అనుమతించడం లేదు. అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు నిర్మాణాల్ని కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తోంది. సినీ నటుడు బాలకృష్ణ చిన్నఅల్లుడు, టీడీపీ నేత భరత్ ఈ వర్సిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Thursday, October 22, 2020

Vijayawada 6th day of Navratri festival goddess Durga worshiped as Lalitha Tripura Sundari Devi

లలితా త్రిపురసుందరిదేవిగా అనుగ్రహిస్తోన్న కనకదుర్గమ్మ

విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆరో రోజు గురువారం తెల్లవారుజాము 5 నుంచే పెద్ద సంఖ్యలో భక్తులకు అమ్మలగన్నమ్మ దర్శనం లభిస్తోంది. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసిన అమ్మవారిని తిలకించి భక్తులు, ఉపాసకులు తరిస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను సీఎం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి దర్శించుకున్నారు. ఆయనకు అమ్మవారి ఫొటోను  దేవస్థానం ట్రస్ట్ బహుకరించింది. అదేవిధంగా సీఎం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి 2021 క్యాలెండర్‌ను జగన్ ఆవిష్కరించారు.

Tuesday, October 20, 2020

Officials on alert as IMD extends heavy rain warning for next 72 hours in Telugu states

జడి వానకు.. వెన్నులో వణుకు

ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎడతెగని వానలతో భీతిల్లుతున్నాయి. ఇటీవల కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. మరోవిడత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో జడివాన విరుచుకుపడనుంది. రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఏపీలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిశ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా. అదే విధంగా కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు; అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.