Monday, August 3, 2020

Nimmagadda Ramesh Kumar To Take Charge as AP SEC again

ఏపీ ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ బాధ్యతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో పోరాటం చేసిన అనంతరం ఆయన ఇటీవల ఎస్ఈసీగా పునర్నియామకం పొందిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయ దుమారం రేపిన నిమ్మగడ్డ  ఎపిసోడ్‌ ఎట్టకేలకు ముగిసినట్లయింది. సోమవారం ఉదయం 11.15 గంటలకు తిరిగి ఎస్ఈసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిమ్మగడ్డ పూర్వపు హోదాలో సోమవారం ఆఫీసుకు వచ్చారు.  ఈ సందర్భంగా ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. `రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ కు అనుగుణంగా నేను బాధ్యతలు చేపట్టా` అని ఆయన ఎన్నికల కమిషన్ కార్యదర్శి, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులకు తెలిపారు. `ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ.. రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తుంది.. గతంలో మాదిరిగానే  ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా` అని అధికారులకు పంపిన సర్క్యులర్ లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన స్థానిక ఎన్నికల్ని ఆయన వాయిదా వేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వై.ఎస్.ఆర్.సి.పి.ని కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా ఆయన ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారని సర్కారు మండిపడింది. పాత్రికేయుల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ ఆయనపై ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట ప్రభుత్వం తరఫున పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలోనే ఆయన పదవీకాలన్ని తగ్గించి కొత్త ఎస్ఈసీగా తమిళనాడు హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించారు. దాంతో నిమ్మగడ్డ ఏపీ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆర్డినెన్స్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలడంతో నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించక తప్పలేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జూలై 30 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు. గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. దానికి అనుగుణంగా సోమవారం మళ్లీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ బాధ్యతలు చేపట్టారు.

Friday, July 31, 2020

Pawan Kalyan Bakrid Wishes to All Muslim Brothers

పవన్ కల్యాణ్ బక్రీద్ శుభాకాంక్షలు
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముస్లింలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగ నిరతికి ప్రతీక బక్రీద్ అని గుర్తు చేశారు. బక్రీద్‌కు మరో పేరే ఈద్-ఉల్-అజహా అని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రంజాన్ తరవాత ముస్లింలు అంత పవిత్రంగా జరుపుకునే పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాంను సంపూర్ణంగా విశ్వసించే ముస్లింలు అందరికీ తన తరఫున, జనసేన పార్టీ నుంచి బక్రీద్ శుభాకాంక్షలు అని పవర్ స్టార్ ప్రకటించారు. బక్రీద్ అందించిన సందేశం ముస్లింలకు మాత్రమే కాక యావత్ మానవాళికి ఆచరణీయం అని ఈ సందర్భంగా తెలిపారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ పండుగను సంప్రదాయబద్ధంగా, నిరాడంబరంగా భౌతికదూరం పాటిస్తూ ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని కోరారు.

Wednesday, July 29, 2020

Unlock 3.0: No night curfew, reopening of gyms, yoga institutes

అన్ లాక్-3: సినిమా హాళ్లు..స్కూళ్లకు నో 
తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల్ని విడుదల చేసిన కేంద్రప్రభుత్వం సినిమా హాళ్ల రీఓపెన్ కు నో చెప్పింది. అదే విధంగా విద్యాసంస్థల్ని ఆగస్ట్ 31 వరకు తెరవరాదని పేర్కొంది. అన్ లాక్‌ 1,2 అమలు తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తున్నా అన్ లాక్ 3ను ధైర్యంగా కేంద్రం ప్రకటించింది. ఆగస్టు 1 నుంచి రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేసింది. ఆగస్టు 5 నుంచి జిమ్స్‌, యోగా సెంటర్లకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న దేశ ఆర్థిక గమనాన్ని మున్ముందుకు తీసుకెళ్లాలనే సర్కారు భావిస్తోంది. అయితే అత్యధిక జనసమర్ధంతో నిండి ఉండే ప్రాంతాల్లో మాత్రం లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతాయి. ఈ మేరకు కేంద్ర హోం శాఖ బుధవారం (జులై 29) రాత్రి ప్రకటన విడుదల చేసింది. మెట్రో సర్వీసులు, స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లపై నిషేధం కొనసాగనుంది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగనుంది. కంటెయిన్‌మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా స్థానికంగా అదనపు ఆంక్షలు విధించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆంక్షలను సడలించే అధికారం మాత్రం రాష్ట్రాలకు ఉండదు. శ్రామిక్ రైళ్లు, దేశీయ విమాన సర్వీసులు, విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల తరలింపు యథావిధిగా కొనసాగించనున్నట్లు కేంద్రం తెలిపింది. భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చంది. అన్‌లాక్ 2.0 జులై 31తో ముగియనున్న నేపథ్యంలో నూతన మార్గదర్శకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, స్విమ్మింగ్‌ పూల్స్, బార్స్‌ పున:ప్రారంభంపై పరిస్థితులకు అనుగుణంగా తేదీలను ఖరారు చేస్తామని సంకేతం ఇచ్చింది.

Tuesday, July 28, 2020

Andhra govt plans to reopen schools from Sep 5

సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో బడి గంట
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 31 నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కేసులు పెరుగుతున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని  ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా మార్చి రెండో వారం నుంచి ఏపీలో స్కూళ్లు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అన్న సందిగ్ధతకు జగన్ సర్కార్ తాజాగా తెరదించింది. స్కూళ్ల పున: ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లను తెరుస్తామని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సీఎం జగన్ సైతం ఈరోజు అధికారికంగా తేదీని ధ్రువీకరించారు. అయితే గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,948 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,297కి చేరింది. ఇప్పటి వరకు 1,148 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని 52,622 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా టెస్టుల్లో మాత్రం ఏపీ తన రికార్డు నిలబెట్టుకుంటోంది. తాజాగా 24 గంటల్లో  62,979 శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇందులో 32,100 ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా పరీక్షలున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలావుండగా తెలంగాణలో మాత్రం స్కూల్స్ రీఓపెన్ పై అనిశ్చితి కొనసాగుతోంది. కరోనా తీవ్రతపై ఆ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలంగాణ సహా పలు రాష్ట్రాలు స్పష్టం చేశాయి.