Saturday, July 25, 2020

Paritala Sunitha father Dharmavarapu Kondaiah passed away

పరిటాల సునీతకు పితృవియోగం
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  అనంతపురం జిల్లా వెంకటాపురంలో శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దాంతో జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పరిటాల రవి దారుణహత్య దరిమిలా కొండన్న ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. ఆయన రాజకీయాలకు కొత్త అయిన కుమార్తె పరిటాల సునీత వెంట ఉండి నడిపించారు. జిల్లాలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ గా కొండన్న సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సునీతమ్మ కుటుంబాన్నిపలువురు టీడీపీ నాయకులు పరామర్శించారు. గడిచిన ఎన్నికల్లో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆయన మనవడు పరిటాల శ్రీరామ్ ను ఓదార్చారు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు తీవ్ర సంతాపం ప్రకటించారు. కొండన్నమృతి తీరని లోటని పేర్కొంటూ సునీతమ్మ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. టీడీపీ యువనేత నారా లోకేశ్ సునీతమ్మ కుటుంబానికి కొండంత అండగా నిలిచిన కొండన్న మరణం బాధాకరమంటూ ట్వీట్ చేశారు. ఇదిలావుండగా వెంకటాపురంలో ఈ సాయంత్రం కొండన్న భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Thursday, July 23, 2020

AP CM YSJagan allocates portfolios to new ministers

ఏపీ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు
ఆంధ్రప్రదేశ్‌ నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు శాఖలను కేటాయించారు. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే క్రమంలో నలుగురు మంత్రుల శాఖల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఉన్నత విద్యావంతుడు డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మత్స్య,  పశు సంవర్ధకశాఖ దక్కగా వేణుగోపాలకృష్ణకు బీసీ సంక్షేమ శాఖ లభించింది. ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ నిర్వహించిన పోర్టుపోలియో తాజాగా కృష్ణదాస్‌కు కేటాయించారు. అలాగే మోపిదేవి స్థానంలో అప్పలరాజుకు ఆ శాఖలను అప్పగించారు. కృష్ణదాస్ ఇంతకుముందు నిర్వహించిన రోడ్లు భవనాల శాఖను శంకర్ నారాయణ స్వీకరించారు. ఆయన గతంలో నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖను వేణుగోపాలకృష్ణకు కేటాయించారు.
తాజా మార్పులతో ఏపీ మంత్రివర్గం..
*1. కృష్ణదాస్- డిప్యూటీ సీఎం, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్
2.  బొత్స సత్యనారాయణ- మున్సిపల్ శాఖ
3.  పుష్ప శ్రీవాణి- డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ
4.  అవంతి శ్రీనివాస్- పర్యాటక శాఖ
*5. వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమ శాఖ
6.  కురసాల కన్నబాబు- వ్యవసాయం
7.  పినిపె విశ్వరూప్- సాంఘిక సంక్షేమశాఖ
8.  తానేటి వనిత- మహిళా సంక్షేమం
9.  చెరుకువాడ రఘునాథరాజు- గృహనిర్మాణశాఖ
10. ఆళ్ల నాని- డిప్యూటీ సీఎం, వైద్య,ఆరోగ్యశాఖ
11.  వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయశాఖ
12.  కొడాలి నాని- పౌరసరఫరాలు
13.  పేర్ని నాని- రవాణా, సమాచారశాఖ
14.  మేకతోటి- సుచరిత హోంశాఖ
*15. సీదిరి అప్పలరాజు- మత్స్య,  పశుసంవర్ధకశాఖ
16.  బాలినేని శ్రీనివాసరెడ్డి-విద్యుత్, అటవీ శాఖ
17.  ఆదిమూలపు సురేష్- విద్యాశాఖ
18.  మేకపాటి గౌతమ్ రెడ్డి- పరిశ్రమలు వాణిజ్యం, ఐటీశాఖ
19.  అనిల్ కుమార్ యాదవ్- సాగునీటి పారుదలశాఖ
20.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు
21.  నారాయణస్వామి- డిప్యూటీ సీఎం, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
*22. శంకర్ నారాయణ- రోడ్లు, భవనాలు
23.  బుగ్గన రాజేంద్రనాథ్- ఆర్థికశాఖ, శాసనభ వ్యవహరాలు
24.  గుమ్మన జయరాం- కార్మిక, ఉపాధి కల్పన
25.  అంజద్ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమశాఖ

Friday, July 17, 2020

Journalist Madhusudhan Reddy dies with Covid-19 in Tirupati

ఏపీలో కరోనాకు మరో జర్నలిస్ట్ బలి
కరోనా వైరస్ కు ఆంధ్రప్రదేశ్ లో మరో జర్నలిస్ట్ బలయ్యారు. ఓటీవీ చానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మధుసూధన్ రెడ్డి కరోనా కారణంగా కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలోనే ఈనెల 12న కరోనా తో పార్థసారథి అనే కెమెరామన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన శ్వాస తీసుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. ఇప్పటికే తెలంగాణలో ఓ జర్నలిస్ట్ కరోనాకు బలయ్యారు. జూన్ లో మనోజ్ కుమార్ అనే టీవీ జర్నలిస్ట్ ని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. 


Monday, July 13, 2020

Real Ayodhya in Nepal, Ram Not Indian: Nepal PM Oli

రాముడు నేపాలీ: ప్రధాని ఓలి
భారత్ పై మరోసారి నేపాల్ ప్రధాని కె.పి.ఓలి విషం కక్కారు. ఈసారి ఏకంగా రాముడ్ని అడ్డం పెట్టుకుని ఆయన మనదేశాన్ని ఆడిపోసుకున్నారు. భారత్ లోని రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్య నకిలీదన్నారు. మన దేశం సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు రువ్వారు. సోమవారం ఆయన నేపాల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ తెంపరితనాన్ని ప్రదర్శించారు. అసలైన రామజన్మభూమి నేపాల్ లోనే ఉందని చెప్పారు. బీర్గంజ్ జిల్లాలోని థోరి శ్రీరాముని జన్మస్థలమని ఓలి పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత్ కు మిత్రదేశంగా కొనసాగుతున్న నేపాల్..ఓలీ ప్రధానిగా పదవిలోకి వచ్చాక చైనా కన్నుసన్నల్లో నడుస్తూ మనదేశంతో శత్రుత్వం పెట్టుకుంటోంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాల్ని ఇటీవల తమ మేప్ లో చేర్చుకుని తమవే ఆ భూభాగాలంటూ నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.