Sunday, July 5, 2020

Punjab: 10 people fall sick after eating ‘parsad’ allegedly ‘laced with some poisonous substance’

పంజాబ్ గురుద్వారాలో విషాహారం: 10 మందికి తీవ్ర అస్వస్థత
పంజాబ్ లో విషాహారం తిని 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవల మరణించడంతో ఇంట్లో దినకర్మ నిర్వహించారు. ప్రార్థనలు (సుఖ్మాణి సాహిబ్) నిర్వహించిన తర్వాత బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. అనంతరం రఘువీర్ ఆహారపదార్థాలను (ప్రసాద వితరణ) తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. అక్కడున్న భక్తులు ఈ భోజనాలు తిన్న వెంటనే అనారోగ్యానికి  గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో పాటు కొందరు స్పృహ కోల్పోయారు. వెంటనే వీరందర్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గుర్ని హుటాహుటిన అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అయితే ఇంట్లో ఈ ప్రసాదాలను తిన్న వారెవరూ అస్వస్థతకు గురికాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి గురుద్వారాకు తీసుకెళ్లిన ఆహారంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Friday, July 3, 2020

Corona cases gone up to 18,750 in Telangana

ప్రగతి భవన్ లోనూ కరోనా కలకలం!
తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఎన్నడూ లేని విధంగా శుక్రవారం ఒక్కరోజే 1,213 మందికి పాజిటివ్గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,750కి చేరింది. ఈరోజు వైరస్ కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 275కి చేరుకుంది. ఇదిలావుండగా సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్ ను సైతం మహమ్మారి వణికిస్తోందని సమాచారం. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా సోకి సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత నియోజకవర్గం గజ్వేల్ ఫామ్ హౌస్ కు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. గత నాలుగురోజులుగా ఆయన అక్కడ నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రగతిభవన్ లోనూ కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడ్డంతోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సీఎం అక్కడ నుంచి దూరంగా వచ్చి విధుల్లో పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. మరోవైపు రాజధాని హైదరాబాద్ (జీహెచ్ ఎంసీ పరిధి)లో పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతుండడంతో మరోసారి లాక్ డౌన్ విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కరోనాను ఎదుర్కోవడానికి లాక్ డౌన్ ఒక్కటే మందు కాదని భావించే ప్రభుత్వం పునరాలోచించినట్లు తెలుస్తోంది.

Tuesday, June 30, 2020

Covaxin India's first Covid-19 vaccine by Bharat Biotech gets DGCI nod for human trials

భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం
 కరోనా వైరస్‌కు దేశీయంగా తొలి వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అభినందనలు తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్-ఢిల్లీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి-పుణె) సహకారంతో హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ `కోవాక్సిన్` పేరిట ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. దేశంలోని తమ మొదటి స్వదేశీ కోవిడ్ -19 వ్యాక్సిన్ మానవ క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి అనుమతి లభించిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జులై లో దేశవ్యాప్తంగా ప్రారంభమవుతాయి. ఐసిఎంఆర్, ఎన్ఐవి ల సహకారం టీకా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిందని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. నగరంలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ బయో-సేఫ్టీ లెవల్ 3 (బిఎస్ఎల్ -3)  హై కంటైనర్ ఫెసిలిటీలో ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. డీజీసీఐ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వ్యాక్సిన్ 1,2  దశల మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి అనుమతి ఇచ్చింది. సంస్థ ప్రీ-క్లినికల్ అధ్యయన ఫలితాలను సమర్పించిన తరువాత ఈ ముందడుగు పడింది. జూలై 2020 లో దేశం అంతటా మానవ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానుండడం ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో శుభసూచకంగా భావించాలి.

Saturday, June 27, 2020

Madhya Pradesh CM Shivraj Singh Chauhan Tirumala tour

శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందంజలో కొనసాగుతుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శనివారం ఆయన తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ సముదాయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన చౌహాన్ దేశం ప్రస్తుతం ఒక కఠినమైన దశను దాటుతోందని పేర్కొన్నారు. ఒక వైపు కోవిడ్-19 మహమ్మారిపై పోరాటం, మరోపక్క సరిహద్దుల్లో చైనాను ఎదుర్కోంటోందని చెప్పారు. సరిహద్దుల వద్ద గల మన వీర జవాన్లు చైనాకు తగిన సమాధానం ఇచ్చారన్నారు. మన సరిహద్దులను సురక్షితంగా కాపాడుకోవడం, అదే సమయంలో దేశ ప్రజలకు కరోనా మహమ్మారి  బారి నుంచి  విముక్తి కల్పించడం ప్రధానమైన సవాళ్లుగా అభివర్ణించారు. కలియుగ దైవమైన శ్రీవారిని తను ఈ విపత్కర తరుణం నుంచి దేశాన్ని రక్షించాలని ప్రార్థించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్ సీఎంగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన చౌహాన్ గడిచిన రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం ఆయన చినజియర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆశ్రమంలోనే బస చేసిన చౌహాన్ ఈరోజు తిరుమల స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.