Friday, May 1, 2020

Famous 'Putin's Tiger' Spotted in Chinese National Park

చైనాలో రష్యా పులి `బోరిస్`
సైబేరియన్ జాతికి చెందిన ప్రఖ్యాత పెద్దపులి బోరిస్ ను చైనా అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పులిగా పేరొందింది. చైనా-రష్యా సరిహద్దుల్లోని అడవిలో అస్వస్తతతో ఉండగా పులిని రక్షించి అముర్స్కి టైగర్ (అముర్ టైగర్) కేంద్రానికి తరలించారు. అక్కడ సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాత 2014లో స్వయంగా పుతిన్ దాని సహజ ఆవాసమైన అడవుల్లోకి వదిలారు. బోరిస్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ `స్వెత్లయ` కూడా పుతిన్ చేతుల మీదుగా నాడు అరణ్యానికి తరలింది. జంట రెండు  పిల్లలకు జన్మనిచ్చాయి. తాజాగా పుతిన్ పులి బోరిస్ ను చైనా `తైపింగ్గౌ నేషనల్ నేచర్ రిజర్వ్` లో గుర్తించారు. దీని అసాధారణ చర్మం వల్లే ఛాయాచిత్రాల  ద్వారా సులభంగా కనుగొనగలిగారు. రాజసం ఉట్టిపడే బోరిస్ పులికి వైపు చారలు లేని ప్రదేశం ఉండడం విశేషం. దాని ద్వారానే పులిని తేలిగ్గా గుర్తించగల్గుతున్నారు.

Thursday, April 30, 2020

Rishi Kapoor passes away at 67 Big B confirms the news on twitter

రిషికపూర్ మృతికి ఉపరాష్ట్రపతి, ప్రధాని సంతాపం
నటుడు, నిర్మాత, దర్శకుడిగా రాణించి హిందీ చలనచిత్ర పరిశ్రమను ఏలిన రిషికపూర్(67) మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. బాలీవుడ్ దిగ్గజం రణబీర్ రాజ్ కపూర్ ద్వితీయ పుత్రుడైన రిషి 2018 నుంచి కేన్సర్ తో బాధ పడుతూ చికిత్స పొందుతున్నారు. గతంలో ఆయన న్యూయార్క్లో చికిత్స తీసుకొని భారత్ వచ్చారు. ఇటీవల వ్యాధి మళ్లీ ముదరడంతో ముంబయిలోని ఆసుపత్రిలో గత కొద్ది రోజులుగా ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందారు. 'మేరా నామ్ జోకర్' సినిమా ద్వారా బాలనటుడిగా రిషి తెరంగేట్రం చేశారు. 1974 లో ఆయన  'బాబీ' సినిమాకు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు. ఇటీవల ముల్క్ అనే సినిమాలో నటించి మెప్పించారు. దాంతోపాటు `ది బాడీ` అనే మూవీలోనూ, వెబ్ సిరీస్ లో కూడా ఆయన నటించారు. తండ్రి పేరునే కొడుకుకు (రణబీర్ కపూర్) రిషికపూర్ పెట్టుకున్నారు. లెజెండ్ తరలిపోయారని టాలీవుడ్ ప్రముఖ వెటరన్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబులు తమ సంతాప సందేశంలో పేర్కొన్నారు. కోలివుడ్ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ తదితరులు రిషికపూర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. రిషి మరణవార్తను బిగ్ బీ అమితాబ్ ట్విటర్ వేదికగా తొలుత ధ్రువీకరించారు. ఆలిండియా సూపర్ స్టార్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కేన్సర్ తో మరణించిన రోజు వ్యవధిలోనే మరో అగ్రనటుడు రిషి అదే వ్యాధి తోనే కన్నుమూయడంతో బాలీవుడ్ తీవ్ర శోకంలో మునిగిపోయింది.

Sunday, April 26, 2020

Serum Institute to start production of Oxford Universitys COVID-19 vaccine in 3 weeks

అతి త్వరలో భారత్ లో కరోనా వ్యాక్సిన్!
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి పీచమణిచే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఈ వైర‌స్‌ను నివారించే వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భార‌త్‌లో మూడు వారాల త‌ర్వాత  ప్రారంభిస్తామ‌ని ప్ర‌ముఖ సంస్థ సీరం ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) శుభవార్త తెలిపింది. యునైటెడ్ కింగ్ డమ్ (యూకే)కు చెందిన ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ తో కలిసి సీరం సంస్థ కరోనా నివారణ వ్యాక్సిన్ త‌యారీ కీలకదశకు చేరుకుంది. ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రస్తుతం మనుషులపై క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కొనసాగుతోన్న విషయం విదితమే. సుమారు 50 మంది (18 నుంచి 55 ఏళ్లు) వాలంటీర్ల కు వ్యాక్సినేషన్ చేసినట్లు తెలుస్తోంది. కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్ ల్ని ఈ వ్యాక్సిన్ అడ్డుకోగలదని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తయారీ దిశగా వందల సంస్థలకు చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలు ముందుగా సాగుతుండగానే ఆక్స్ ఫర్డ్ బృందం ట్రయల్స్ కొలిక్కి వచ్చాయి. ఈ ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతమైతే మూడు వారాల త‌ర్వాత‌ పుణె ప్లాంట్‌లో వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేప‌డ‌తామ‌ని సీరం ప్రకటించింది. తాము ఉత్ప‌త్తి చేయ‌బోయే వ్యాక్సిన్‌కు పేటెంట్ కోర‌దలచుకోలేదని సంస్థ సీఈవో పూనావాలా తెలిపారు. వీలైనంత ఎక్కువ ఉత్ప‌త్తి జ‌రిగితేనే ప్రపంచమంతటా వ్యాక్సిన్ అంద‌రికీ అందుబాటులోకి రాగలద‌ని తద్వారా మహమ్మారిని నిలువరించడం సాధ్యమౌతుందని వెల్ల‌డించారు. కోవిడ్‌-19 వ్యాక్సిన్ కోసం కొత్త ప్లాంట్ నెల‌కొల్పాంటే రెండు నుంచి మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.. కాబట్టి  పుణె ప్లాంట్‌లోనే వ్యాక్సిన్‌ ఉత్ప‌త్తి చేపడతామ‌న్నారు. సెప్టెంబర్ నాటికి దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. అన్ని క్లినికల్ ట్రయల్స్ పూర్తయి ప్రభుత్వ అనుమతులు పొందాక వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది.

Tuesday, April 21, 2020

Hyderabad Haleem makers association decided against cooking and sale of the dish due to lockdown

హలీం.. తయారీ లేదు!
గల్లీ గల్లీలోనూ చవులూరించే హలీం ఈసారి భాగ్యనగరంలో కనిపించదు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు రోజంతా ఉపవాసం ఉన్నాక తక్షణ శక్తి కోసం పోషకాహారమైన హలీం తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీం రుచి అంతే ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. అయితే ప్రస్తుత కరోనా కాలంలో అన్నింటితో పాటు ప్రార్థనలకు గండిపడింది. దాంతో రంజాన్ సామూహిక ప్రార్థనలతో పాటు హలీం ఆరగింపునకు తెరపడనుంది. రంజాన్ నెలంతా దొరికే హలీంను ముస్లింలతో పాటు అన్ని వర్గాల వారు లొట్టలేసుకుంటూ తింటారు.  ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకొని మరీ చికెన్, మటన్, వెజ్ వెరైటీ హలీంలను టేస్ట్ చేసి తరిస్తుంటారు. వాటన్నింటికి ఇప్పుడు `లాక్ డౌన్` పడ్డట్లే. ఈ ఏడాది ఎక్కడా హలీం తయారీ ఉండబోదని హలీం మేకర్స్ అసోసియేషన్ తాజాగా ప్రకటించింది. ప్రార్థనలు, పండుగలు అన్నీ ఇళ్లకే పరిమితం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మసీదుల్లో కూడా సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు. కేవలం ఇమామ్, మౌజన్లు మాత్రమే మసీదుల్లో నమాజులు చేసుకొనే వెసులుబాటు పొందారు.