Thursday, March 5, 2020

New Zealand cricket providing regular updates to its players including IPL bound stars

కరో(డా)నా దెబ్బకు ఐపీఎల్ వాయిదా?
ఏటా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ సీజన్ కరో(డో)నా మహమ్మారి ధాటికి ఈసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జులైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ సైతం సందిగ్ధంలో పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికైనా విశ్వ క్రీడలు నిర్వహించగలమని జపాన్ ఒలింపిక్స్ మంత్రి సీకో హషిమొటో ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లకు కోవిడ్-19 (కరోనా) సెగ తగిలే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మార్చి 29 నుంచి భారత్ లోనే ఐపీఎల్ సీజన్ 2020 ఆరంభం కావాల్సి ఉంది. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఈసరికే ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే స్వదేశీ క్రికెటర్లతో పాటు ఎక్కువ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ పాల్గొంటుంటారు. చైనాలో ప్రబలి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని ఆటాడుకుంటున్న కరోడా వైరస్ తాజాగా భారత్ లో ఉనికి చాటుతోంది. చైనాలో ఈ వైరస్ నెమ్మదించినా దక్షిణకొరియాను అతలాకుతలం చేస్తోంది. అదే విధంగా వేసవి ప్రారంభంలో భారత్ లోనూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అప్రమత్తమయింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ఆ దేశం క్రికెటర్లు కేన్ విలియమ్సన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జిమ్మీ నీషమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్),లూకీ ఫర్గూసన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్),మిచెల్ మెక్లనగాన్, (ముంబయి ఇండియన్స్),ట్రెంట్ బౌల్ట్ (ముంబయి ఇండియన్స్),మిచెల్ శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) తదితర మొత్తం ఆరుగురు అగ్రశ్రేణి క్రికెటర్లు ఆడనున్నారు. దాంతో భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిపై సమాచారం సేకరిస్తున్న కివిస్ క్రికెట్ బోర్డు తమ క్రికెటర్లకి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తోంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఈ విషయంపై దృష్టి సారించాయి. భారత్ లో కరోనా ప్రభావం పూర్తిగా సమసిపోతేనే ఐపీఎల్ 2020 సీజన్ సజావుగా సాగుతుందని క్రీడా పండితుల భావన.

Wednesday, March 4, 2020

CM YS Jaganmohan Reddy survey warning to ministers and MLA`S over local body elections

జగన్ పాలనపై జనంలో వ్యతిరేకత?
అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచి గడవకనే గంపగుత్తగా ఓట్లేసిన జనంలో వై.ఎస్.ఆర్.సి.పి. పాలనపై వ్యతిరేకత పెల్లుబికుతోందా? ప్రతిపక్ష తెలుగుదేశం (టీడీపీ) ప్రజల నాడిని పసిగట్టే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని దమ్ముంటే తాజాగా ఎన్నికలు నిర్వహించి గెలవాలని సవాలు చేస్తోందా? ఈమేరకు సీఎం జగన్ కు ఇంటెలిజెన్స్ నివేదిక అందిందా?అందులో భాగంగానే ఇటీవల జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్ని హెచ్చరించారా? అదేం కాదు గానీ.. ప్రస్తుత వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సమాయత్తమవుతున్న క్రమంలో సీఎం ఈమేరకు పార్టీ శ్రేణుల్ని అలర్ట్ చేయడానికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని గెలిపించాల్సిన బాధ్యత వారి భుజాల మీదే పెట్టారు. ఏ జిల్లాలో ఓటమి ఎదురయితే అక్కడ మంత్రులు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇటీవల తెలంగాణ స్థానిక ఎన్నికల సందర్భంగానూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే రీతిలో హెచ్చరించి టీఆర్ఎస్ శ్రేణుల్లో జాగురుకత తెచ్చారు. ఫలితాల్ని ఆశించిన మేర సంపూర్ణంగా సాధించారు. ఇప్పుడు జగన్ కూడా అదే తరహాలో వైఎస్ఆర్సీపీ కేడర్, లీడర్లలో చైతన్యాన్ని రగిలిస్తున్నారు. ఇదిలావుండగా స్థానిక ఎన్నికలు మొత్తం మూడింటిని ఈ నెలాఖరు నాటికే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 21న ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారు. మార్చి 10న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసి మార్చి 24న ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. అదే విధంగా మార్చి 15న గ్రామ పంచాయతీలకు షెడ్యూల్ విడుదల చేసి మార్చి 27న ఎన్నికలు నిర్వహించాలనేది సీఎం యోచన. ఈ మేరకు ప్రతిపాదనలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి జగన్ సర్కార్ ఇప్పటికే పంపించింది. అందులో భాగంగానే జగన్ జిల్లాల్లో పార్టీ నాయకత్వం మధ్య ఉన్న గ్రూపు తగాదాల పైన దృష్టి పెట్టాలని సూచించారు. అటువంటి వాటిని సరిదిద్దాలని మంత్రులకు సూచించారు. మద్యం, డబ్బు పంపిణీ కాకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలన, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తన దగ్గర సర్వే ఉందని ఈ సందర్భంగా జగన్ హెచ్చరించారు.
25 లక్షల `వైఎస్ఆర్ జగనన్న` ఇళ్ల పట్టాల పంపిణీ
ఉగాది నాడు 25 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని రాష్ట్ర కేబినెట్ బుధవారం తీర్మానం చేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం తహశీల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్టార్ హోదా ఇవ్వనున్నట్టు సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు ఐదేళ్ల తర్వాత విక్రయించుకునేలా అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం 16 వేల ఎకరాల భూమిని బయటివారి నుంచి కొనుగోలు చేసినట్లు మంత్రి నాని వెల్లడించారు.

Tuesday, March 3, 2020

Movie Critic Mahesh Kathi Satires on Pawan Kalyan Vakeel Saab First Look

`వకీల్ సాబ్` ఫస్ట్ లుక్ వైరల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలకు చిరు విరామమిచ్చి నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందు నుంచి అనుకున్న ఈ టైటిల్‌నే ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన పింక్మూవీ బాలీవుడ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తమిళ్ రీమేక్ లో `నెర్కొండ పార్వాయ్`గా అజిత్ నటించారు. తెలుగు పింక్రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. అయితే పింక్ సినిమాలో కథే హీరో. కథనంలో పాత్రలే ప్రాణం. తమకు జరిగిన అన్యాయంపై ముగ్గురు యువతులు ఎలా పోరాడారు? వాళ్లకు ఓ లాయర్ ఏవిధంగా సాయపడ్డారన్న ఎమోషనల్‌ బ్యాక్ డ్రాప్ తో నడిచే చిత్రమిది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాని`ఎంసీఏ` చిత్రం ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ఎప్పుడెప్పుడు తనివితీరా చూసేద్దామా అని పవర్ స్టార్ అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయమై విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ పలు తెలుగు సినిమాలు పూర్తి  ఇంగ్లిష్, హిందీ టైటిల్స్ తో విడుదలైనవి ఉన్నాయి. పవన్ కల్యాణ్ అగర్భ మిత్రుడు మూవీ క్రిటిక్ కత్తి మహేశ్ ఎప్పటిలాగానే తెలుగు సినిమాకు టైటిల్ విషయంలో ఇదేమి భావ దారిద్ర్యం అని బాధను వ్యక్తం చేశారు. పవనే ప్రధానంగా విడుదలైన ఫస్ట్ లుక్ పైనా పెదవి విరిచారు. అయితే పవర్ స్టార్ కు తనను పొగొడుతూ చుట్టూ ఉండే అభిమానులు, స్నేహితులకంటే విమర్శకులంటేనే అమితమైన ప్రేమ.

Monday, March 2, 2020

YSRCP MLA Malladi Vishnu says about Srivari Temple in Kashmir on behalf of tourism meet

కశ్మీర్ లో శ్రీవారి ఆలయం!
కశ్మీర్లో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. సోమవారం విజయవాడలో జరిగిన కశ్మీర్‌ టూరిజం, కల్చర్‌ మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ విషయాన్ని వెల్లడించారు. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. సింగిల్‌ విండో విధానం ద్వారా టూరిజానికి అవసరమైన అనుమతుల్నిచాలా సులభతరం చేశారని విష్ణు వివరించారు. కశ్మీర్‌తో రాష్ట్ర పర్యటక రంగం అనుసంధానం కావడం శుభపరిణామంగా ఆయన పేర్కొన్నారు. భూతల స్వర్గమైన కశ్మీర్, ఏపీ టూరిజం పరస్పర అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని తమ ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.