Tuesday, December 31, 2019

Malavath Poorna conquered Mt Vinson Massif in Antarctica

అంటార్కిటికా మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను అధిరోహించిన పూర్ణ

ఏడు ఖండాలలో ఉన్న ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలన్నదే భారతమాత ముద్దు బిడ్డ మాలవత్ పూర్ణ లక్ష్యం. ఆ సాధనలో ఆమెకు మరో మెట్టు మాత్రమే మిగిలి ఉంది. తాజాగా  పూర్ణ అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ మాసిఫ్‌ను జయించి 2019ను ముగించింది. ఈ ఘనత తరువాత ఇప్పటికి ఆమె ఆరు ఖండాల్లోని ఆరు ఎత్తైన పర్వత శిఖరాలపై అడుగు పెట్టి చరిత్ర లిఖించింది. ఈ కీర్తిని సొంతం చేసుకున్న ప్రపంచంలోనే తొలి గిరిజన మహిళగా 18 ఏళ్ల పూర్ణ నిలిచింది. మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా, 2014), మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా, 2016), మౌంట్ ఎల్బ్రస్ (యూరప్, 2017), మౌంట్ అకాన్కాగువా (దక్షిణ అమెరికా, 2019), మౌంట్ కార్ట్స్నెజ్ (ఓషియానియా, 2019), మౌంట్ విన్సన్ మాసిఫ్ (అంటార్కిటికా, 2019) పూర్ణ అధిరోహించిన పర్వతాల జాబితాలో చేరాయి. 13 సంవత్సరాల 11 నెలల వయస్సులో ఆమె మౌంట్ ఎవరెస్ట్ ను అధిరోహించింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు పూర్ణ.

Monday, December 30, 2019

Uddhav Thackeray inducts son, 35 others; Ajit Pawar sworn in Dy CM

`మహా` కేబినెట్ లో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రేలకు చోటు లభించింది. రాజ్ భవన్ లో  సోమవారం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో పాటు నాసిక్ రావు తిర్పుడే, సుందరరావు సోలంకీ, రామ్ రావ్ అదిక్, గోపినాథ్ ముండే, ఆర్.ఆర్.పాటిల్, విజయ్ సింహ్ మిమితే పాటిల్ తది రులతో గవర్నర్  బి.ఎస్.కోష్యారీ ప్రమాణం చేయించారు. దారితప్పినా మళ్లీ శరద్ పవార్ తంత్రంతో ఎన్సీపీ గూటికి చేరిన ఆ పార్టీ అగ్రనేత అజిత్ పవార్ మరోసారి ఉపముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. 32 రోజుల క్రితం కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ లో కేబినెట్ సంఖ్య 36కు చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే `మహా వికాస్ అగాడి`(కూటమి)కి నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లాళ్ల క్రితం హడావుడిగా అధికారానికి వచ్చిన బీజేపీ సర్కార్ లో 60 ఏళ్ల అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 80 గంటల పాటు పదవిలో ఉన్నారు. అప్పటి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు బలనిరూపణకు నిలువలేక రాజీనామా చేయడంతో ఆయన పదవి కోల్పోయారు. తిరిగి బాబాయ్ శరద్ పవార్ పంచనే చేరిన అజిత్ పవార్ మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ గా పదవిలోకి రావడం ఇది నాల్గోసారి. తొలిసారి 2010 నవంబర్ లో ఆ తర్వాత అక్టోబర్ 2012లో ఇటీవల నవంబర్ 2019లో మళ్లీ డిసెంబర్ 2019లో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. కాగా ఠాక్రేల వారసుడు ఆదిత్య ఠాక్రే కు తండ్రి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో తాజాగా చోటు దక్కింది.

Friday, December 27, 2019

MiG 27 to pass into history, its last squadron to be decommissioned in Jodhpur on Friday

చరిత్ర పుటల్లో ఐఏఎఫ్ అస్త్రం మిగ్-27
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భాసిల్లిన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయి. 1999లో పాకిస్థాన్ మూకలతో జరిగిన కార్గిల్ యుద్ధం నుంచి భారత తురఫుముక్కగా మిగ్-27 ఇతోధిక సేవలందించింది. భారత సైన్యంతో `బహుదూర్` గా కీర్తి పొందిన ఈ రష్యా తయారీ మిగ్-27 కాలమాన క్రమంలో `ప్రాణాంతక` లోహ విహాంగంగా భయపెట్టింది. శుక్రవారం జోద్ పూర్ ఎయిర్ బేస్ నుంచి చివరి మిగ్-27 నిష్క్రమణ (డీ కమిషన్) పూర్తయింది. ఈ ఎయిర్ బేస్ నుంచి ఏడు మిగ్-27లతో స్క్వాడ్రన్ లీడర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టి డీకమిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఏడాది బాలాకోట్ పై భారత్ వైమానిక దళం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసిన అనంతరం పాక్ శత్రు విమానాలు భారత్ గగనతలంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ వర్ధమాన్ ఈ మిగ్-27 విమానంతోనే పాక్ అత్యాధునిక ఎఫ్-27 (అమెరికా తయారీ) యుద్ధ విమానాల్ని నిలువరించడమే కాకుండా ఓ ఫైటర్ క్రాఫ్ట్ ను నేల కూల్చిన సంగతి తెలిసిందే. జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో మిగ్-27 డీకమిషన్ కార్యక్రమం సందర్భంగా రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ సొంబిత్ ఘోష్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ ఎయిర్ బేస్ నుంచి ఇక మిగ్-27లు కార్యకలాపాలు నిర్వహించబోవన్నారు. ఐఏఎఫ్ సేవల నుంచి తప్పించిన ఈ విమానాల భవిష్యత్ గురించి ఇప్పటికింకా కచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదన్నారు. వీటిని దేశీయ అవసరాలకు వినియోగించడమా, ఇతర దేశాలకు తరలించడమా అనేది అనంతర కాలంలో తేలనుందని చెప్పారు.

Tuesday, December 24, 2019

Hemant meets Babulal, JVM(P) announces unconditional support

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్: జేవీఎం బేషరతు మద్దతు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన మహాఘట్ బంధన్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అయిదో సీఎంగా హేమంత్ సోరెన్ నియమితులు కానున్నారు. మంగళవారం ఆయన మాజీ ముఖ్యమంత్రి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీని రాంచీలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో మరాండీ ధన్వార్ నుంచి గెలుపొందగా జేవీఎం పార్టీ మొత్తం 3 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా మహాఘట్ బంధన్ లోని ఝార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 తదితర పార్టీల మద్దతుతో హేమంత్ తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. తాజాగా జేవీఎం(పి) బేషరతుగా మద్దతు తెలిపింది. హేమంత్ తండ్రి శిబుసోరెన్ ఝార్ఖండ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జేఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు సోరెన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1994లో శిబు సోరెన్ ప్రయివేట్ సెక్రటరీ శశినాథ్ ఝా హత్యకు గురయ్యారు. అందులో ఆయన పాత్ర నిరూపణ కావడంతో 2006లో అరెస్టయి  జీవితఖైదు అనుభవిస్తున్నారు.
బీజేపీ ఓటమితో కాంగ్రెస్ సంబరం
జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి మెజారిటీ మార్కును దాటి హేమంత్ సోరెన్‌ ముఖ్యమంత్రిగా తమ కూటమి అధికారంలోకి రానుండడంతో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటోంది. ఝార్ఖండ్ ఏఐసీసీ కమిటీ ఇన్ ఛార్జీ  ఆర్‌పీఎన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలు, జీవనోపాధిని ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తి ఎన్నికలలో పోరాడి తాము అధికారానికి వచ్చామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజల దృష్టిని ప్రాథమిక సమస్యల నుంచి మళ్లించడానికి యత్నించి చివరకు ఓటమి పాలయ్యారని చెప్పారు.ఫలితాలు బీజేపీ అహంకార, అవినీతిమయ పాలనకు చెంపపెట్టుగా రాష్ట్ర ఎన్నికల కాంగ్రెస్ సమన్వయకర్త అజయ్ శర్మ పేర్కొన్నారు.