Sunday, October 20, 2019

Cycle rally held in Jammu to promote clean, green Diwali


స్వచ్ఛ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో సైకిల్ ర్యాలీ
క్లీన్ అండ్ గ్లీన్ దీపావళి కోసం జమ్ముకశ్మీర్ లో ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఉదంపూర్ నుంచి జమ్ము వరకు 65 కిలోమీటర్లు ర్యాలీ కొనసాగింది. ఉదంపూర్ డిస్ట్రిక్ట్ డెవలప్ మెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పదుల సంఖ్యలో సైక్లిలిస్టులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కమిషనర్ పీయూష్ సంఘ్లా పాల్గొనగా ఆయన వెంట పలువురు యువతులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఉదంపూర్ నగర వీధుల గుండా కొనసాగిన ర్యాలీ స్లతియా చౌక్, కోర్టు రోడ్డు, రామ్ నగర్ చౌక్, గోల్ మార్కెట్, బస్టాండ్, మినీ స్టేడియంల మీదుగా జాతీయ రహదారిపై ముందుకు సాగుతూ జమ్మూ నగరం చేరుకుంది. మార్గం మధ్యలో కత్రా వద్ద కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ర్యాలీలో పాల్గొనవారిని కలిసి అభినందించారు. ఏటా ఈ తరహా ర్యాలీలను ఉదంపూర్ కమిషనర్ కార్యాలయం నిర్వహిస్తుండడం విశేషం. స్వచ్ఛ దీపావళిని నిర్వహించుకుందామనే పిలుపుతో పాటు బేటీ బచావో, బేటీ పడావో (అమ్మాయిల్ని రక్షిద్దాం.. అమ్మాయిల్ని చదివిద్దాం) అనే చైతన్యాన్ని కల్గించే ఉద్దేశంతో ర్యాలీ జరిగింది.

Saturday, October 19, 2019

At least 10 killed in dam collapse in Russia`s Krasnoyarsk region


రష్యాలో డ్యాం కూలి 10మంది దుర్మణం
రష్యాలో ఓ డ్యాం కుప్పకూలిన దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన సైబీరియా ప్రాంతంలోని క్రస్నోయార్స్క్ కరాయ్ లో శనివారం వేకువజాము 2 గంటలకు జరిగింది. డ్యాం ఒక్కసారిగా బద్ధలుకావడంతో 10 మంది కొట్టుకుపోయి తీవ్రగాయాలపాలయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో 10 మంది జాడ తెలియడం లేదని అత్యవసర విభాగ మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. సుకేటిన్కినో కాలనీలో గల బంగారు గనులకు నీటి సరఫరా కోసం నిర్మించిన రిజర్వాయర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు స్పుత్నిక్ వార్త సంస్థ తెలిపింది. దాంతో డ్యాం నుంచి పోటెత్తిన వరద నీటితో కాలనీ ముంపునకు గురయింది. గల్లంతైన వారి ఆచూకీ కోసం సెబా నదిలో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Friday, October 18, 2019

CJI Gogoi recommends Justice S A Bobde as his successor


సీజేఐగా బోబ్డే పేరును సిఫార్సు చేసిన గొగొయ్
భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా సీనియర్ జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే పేరును ప్రస్తుత సీజేఐ రంజన్ గొగొయ్ ప్రతిపాదించారు. ఈ మేరకు బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ ఆయన కేంద్రానికి శుక్రవారం లేఖ రాశారు. సంప్రదాయాన్ని అనుసరించి గొగొయ్ తన వారసుడిగా బోబ్డే ను ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  కేంద్రం ఈ సిఫార్సును పరిగణనలోకి తీసుకుంటే మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల బోబ్డే భారత 47వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు. సుప్రీం జస్టిస్ గా 12 ఏప్రిల్ 2013 నుంచి వ్యవహరిస్తున్న బోబ్డే పదవీ కాలం 23 ఏప్రిల్ 2021 వరకు ఉంది. ఆయన గతంలో మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ (ముంబయి, నాగ్ పూర్)లో చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం గొగొయ్ తర్వాత సుప్రీంకోర్టులో బోబ్డేనే అందరికంటే సీనియర్. గొగొయ్ 46వ సీజేఐగా 8 అక్టోబర్ 2018న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 17 నవంబర్ లో ముగియనుంది.

Sunday, October 13, 2019

India, Japan to hold joint military exercise from Oct 19


19 నుంచి భారత్ జపాన్ సంయుక్త సైనిక విన్యాసాలు
ఉగ్రవాద నిరోధక సైనిక విన్యాసాల్లో భారత జపాన్ లు సంయుక్తంగా పాల్గొననున్నాయి. ఈనెల 19 నుంచి నవంబర్ 2 వరకు ఉభయదేశాలకు చెందిన సైనికులు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నారు. ధర్మ-గార్డియన్ (ధర్మ సంరక్షణ) పేరిట ఈ సైనిక విన్యాసాల్ని మిజోరంలోని వైరెంగ్టేలో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాల్లో భారత్, జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ (జేజీఎస్డీఎఫ్) లకు చెందిన 25 మంది చొప్పున సైనికులు పాల్గొనబోతున్నారు.  ఆయా దేశాలలో వివిధ తీవ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన అనుభవాన్ని ఉభయ దేశాల సైనికులు ఈ సందర్భంగా పంచుకోనున్నారు. ప్రపంచ ఉగ్రవాదం నేపథ్యంలో ఇరు దేశాలు భద్రతా సవాళ్ల ను అధిగమించేందుకు ఏర్పాటవుతున్న ఈ విన్యాసాలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అదే సమయంలో భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ఠం కానున్నాయి. అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో తలెత్తుతోన్న ఉగ్రవాదం.. నిరోధక చర్యలపై ప్లాటూన్ స్థాయి లో సైనికులు ఉమ్మడి శిక్షణ పొందనున్నారు. వివిధ దేశాలతో భారతదేశం చేపట్టిన సైనిక విన్యాసాల శిక్షణ క్రమంలో తాజా కార్యక్రమం  కీలకమైనదని అధికారిక ప్రకటన పేర్కొంది.