Monday, July 15, 2019

Three-hr partial lunar eclipse on July 16-17 night


జులై 16,17ల్లో పాక్షిక చంద్రగహణం
ఆకాశంలో అద్భుతాల్ని తిలకించే ఆసక్తిపరులకు మరో రోజు వ్యవధిలో సంభవించనున్న పాక్షిక చంద్రగ్రహణం వీక్షించే అవకాశం వచ్చింది. జులై 16, 17 తేదీల్లో బుధవారం మధ్యరాత్రి 1.31 నుంచి 4.29 గంటల వరకు ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నట్లు బిర్లా ప్లానిటోరియం రిసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దౌరి తెలిపారు. 3 గంటల సమయానికి చంద్రుడు పూర్తిగా కనుమరుగవుతాడు. సూర్యుడు, చంద్రులకు మధ్యలోకి భూమి రావడంతో ఈ పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది. దేశంలో అన్ని ప్రాంతాల వారు ఈ చంద్రగ్రహణాన్ని తిలకించొచ్చు. మళ్లీ 2021 వరకు చంద్రగ్రహణాలు సంభవించే అవకాశం లేదు. 2021 మే 26న మళ్లీ చంద్రగ్రహణం సంభవించనుంది. ప్రస్తుత పాక్షిక చంద్రగ్రహణాన్ని ఎటువంటి కళ్లద్దాలు లేకుండా నేరుగా తిలకించొచ్చని దౌరి తెలిపారు. దక్షిణ అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లోని కొన్ని దేశాల్లో మాత్రమే ఈ చంద్రగ్రహణ దృశ్యాలు కనిపించనున్నాయన్నారు.

Sunday, July 14, 2019

Icc world cup 2019 final match tied.. super over boundary winner England


ఐసీసీ ప్రపంచ కప్-12 విజేత ఇంగ్లాండ్
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. క్రికెట్ పుట్టినింట తొలిసారి ప్రపంచ కప్ ను ముద్దాడిన పండుగ.. వాడవాడలా సంబరాలతో ఇంగ్లాండ్ మునిగితేలుతోంది. క్రికెట్ ప్రపంచ కప్-12 ను సగర్వంగా ఆతిథ్య జట్టు భుజాలకెత్తుకుని దేశ ప్రజలకు కానుకగా ఇచ్చింది. ఇంగ్లాండ్ వరల్డ్ కప్ కొత్త చాంపియన్ గా అవతరించింది. న్యూజిలాండ్ పై ఆదివారం క్రికెట్ మక్కా లండన్ లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో అనేక మెరుపులు..మలుపులు.. ఎవరు ఓడారో ఎవరు గెలిచారో తేలని సందిగ్ధతల నడుమ ఆఖరికి ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. స్కోర్లు(241) సమానం..సూపర్ ఓవర్ రన్స్(15) సమానం..  విజేత న్యూజిలాండా, ఇంగ్లాండా అనే మీమాంస మధ్య చివరికి ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో ఒక బౌండరీ అధికంగా కొట్టిన ఇంగ్లాండ్ విజేతయింది. సూపర్ ఓవర్ లో తొలుత ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. బోల్ట్ బౌలింగ్ ను ఎదుర్కొని స్టోక్స్, బట్లర్ లు రెండు బౌండరీల సాయంతో 15పరుగులు స్కోరు చేశారు. అనంతరం న్యూజిలాండ్ ఛేదనకు దిగింది. గుఫ్తిల్, నీషమ్ లు ఆర్చర్ బౌలింగ్ ను  ఎదుర్కొని ఓ సిక్సర్ తో 15పరుగులు సాధించి  స్కోరును సమం చేశారు. దాంతో  బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లాండ్  విజేతగా నిలిచింది.
సూపర్ ఓవర్ నిబంధన లేకున్నట్లయితే వాస్తవానికి న్యూజిలాండే విజేత. స్కోర్లు సమానమైనప్పుడు తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టు సహజంగానే గెలిచినట్లు లెక్క. కానీ వరల్డ్ కప్ లో స్కోర్లు సమానమైతే సూపర్ ఓవర్ ఆడించే నిబంధన ఉంది. అందులోనూ స్కోర్లు సమానమవ్వడం మరో అబ్బురం.
తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ కు అది ఏమంత ఛేదన లక్ష్యం.. సునాయాసంగా ఓ 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగించేస్తారనే అందరూ అనుకున్నారు. కివీస్ మరోసారి భారత్ ను కంగు తినిపించినట్లే పటిష్ఠ ఇంగ్లాండ్ ను 50 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ చేసింది. ఇంతవరకు ఏ ప్రపంచ కప్ లో లేని విధంగా సూపర్ ఓవర్ అనివార్యమయింది. ఆ సూపర్ ఓవర్ లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు రెండూ 15 పరుగులు స్కోరు చేశాయి. మళ్లీ రెండోసారి మ్యాచ్ టై అవ్వడంతో ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ లో అధికంగా చేసిన బౌండరీ ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు. ఆతిథ్య జట్టుకు తొలి ప్రపంచ కప్ అందింది. వరుసగా రెండోసారి ఫైనల్లో కప్ ను కోల్పోయి న్యూజిలాండ్ ఢీలా పడింది. 2015 ప్రపంచ కప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలయిన కివీస్ ఈసారి 2019లో అనూహ్యంగా ఇంగ్లాండ్ చేతిలో సూపర్ ఓవర్ పరాజయాన్ని చవిచూసింది.

Sidhu`s resignation today is anti india stance, says delhi MLA Sirsa


సిద్ధూ రాజీనామా భారత్ వ్యతిరేక చర్య: ఢిల్లీ ఎమ్మెల్యే సిర్సా
పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మాజీ భారత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ట్విటర్ లో ఈ మేరకు పేర్కొంటూ సిద్ధూ తన రాజీనామా లేఖను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కు  పంపనున్నట్లు ప్రకటించారు. 55 ఏళ్ల సిద్ధూ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేరిన దగ్గర నుంచి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి అమరీందర్ సింగే అతని వల్ల పార్టీ దెబ్బతింటోందని గతంలోనే పేర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే విషయాన్ని ఆయన అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. సిద్ధూ రాజీనామా విషయాన్ని ట్విటర్ పేర్కొనగానే ఢిల్లీ ఎమ్మెల్యే, సిక్కు గురుద్వార మేనేజ్మెంట్ కమిటీ(డీఎస్జీఎంసీ) నాయకుడు మణిందర్ సింగ్ సిర్సా ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఈరోజు ఆదివారం సిద్ధూ సెలవు రోజున రాజీనామా చేయడమేంటన్నారు. భారత్, పాక్ నాయకుల మధ్య కర్తార్ పూర్ కారిడార్ కు సంబంధించి చర్చలు జరుగుతున్న సమయాన్ని రాజీనామాకు సిద్ధూ ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా భారత వ్యతిరేక చర్యగా సిర్సా పేర్కొన్నారు. గతంలో సిద్ధూ పాకిస్థాన్ (ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవం) వెళ్లినప్పుడు కూడా తన చర్యతో వివాదాస్పదమయ్యాడు. పాక్ సైనిక జనరల్ బజ్వాను సిద్ధూ కౌగలించుకోవడంపై నాడు విమర్శలు చెలరేగాయి. తాజాగా సిద్ధూ రాజీనామా నిర్ణయం దేశ, సిక్కు వ్యతిరేక చర్యగా కనిపిస్తోందని సిర్సా ఆ వీడియో ట్వీట్ లో పేర్కొన్నారు.


Saturday, July 13, 2019

Strategic Sikkim and major parts of Darjeeling hills cut off for 3rd following landslidesand torrets


సిక్కిం, డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్
ఎడతెగని వర్షాల కారణంగా సిక్కిం, డార్జిలింగ్ హిల్స్ ప్రాంతాల వాసులకు దేశంలోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. విపరీతంగా కొండ చెరియలు విరిగి పడుతుండడంతో రోడ్లన్నీ బారులుతీరిన వాహన శ్రేణులతో నిండిపోయాయి. మూడ్రోజులుగా వర్షాలు విస్తృతంగా కురుస్తుండడంతో డార్జిలింగ్ కొండ ప్రాంతాల్లో రోడ్లపై ఆగకుండా కొండచెరియలు విరిగిపడుతున్నాయి. దాంతో ఎక్కడ ట్రాఫిక్ ను అక్కడ నిలిపివేశారు. ఎన్.హెచ్-10 గ్యాంగ్ టాక్ కు వెళ్లే మార్గంలో శుక్రవారం ఉదయం కొద్దిసేపు ట్రాఫిక్ ను అనుమతించినా మళ్లీ నిలిపివేయాల్సి వచ్చింది. శ్వేతిజ్హొర, కలిజ్హొర ల్లోని రోడ్లు పూర్తిగా కొండచరియలతో నిండిపోయాయి. ఎన్.హెచ్-10 ఎన్.హెచ్-31 జాతీయ రహదారులపై ఇంకా కుండపోత వానలు కురుస్తున్నాయి. శనివారం పశ్చిమబెంగాల్ లోని తెరాయ్, దూర్స్ ప్రాంతాల్లో వరద పోటెత్తి నివాస ప్రాంతాలు, సాగు భూములు ముంపునకు గురయ్యాయి. డార్జిలింగ్ హిల్స్ పరిధిలో తీస్తా నది పొంగి ప్రవహిస్తుండడంతో మూడ్రోజులుగా సెవొక్ రోడ్డుపై కార్లలో తరలి వచ్చిన పర్యాటకులు చిక్కుబడిపోయారు. ఈ నదిలో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో జైపూర్ (రాజస్థాన్) పర్యాటకుడు అమన్ గార్గ్ చనిపోగా మృతదేహం 20 కిలోమీటర్ల దూరంలో తీస్తా ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. ఈ కారుతో పాటు అందులో ప్రయాణిస్తున్న గౌరవ్ శర్మ, డ్రైవర్ రాకేశ్ రాయ్(34) జాడ కోసం సహాయ రక్షకబృందం వెతుకులాట కొనసాగిస్తోంది.  హిమాలయాల ఈశాన్య ప్రాంతంలోని డార్జిలింగ్, కుర్సెంగ్, కలింపాంగ్, సిలిగురి రోడ్లలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారిపోయింది. తీస్తా నదిలో 3,58,690 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇంకా నది పొంగి ప్రవహించొచ్చని ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.