Tuesday, May 28, 2019

3 West Bengal MLAs, several councillors join BJP in Delhi



బీజేపీలో చేరిన ముగ్గురు పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో మంగళవారం (మే28) కమలం తీర్థం పుచ్చుకున్న వారిలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు సుబ్రంగ్షు రాయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో సైతం బీజేపీ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. సుబ్రంగ్షు రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని భావించిన టీఎంసీ ఆయనను లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సస్పెండ్ చేసింది. టీఎంసీ ఎమ్మెల్యే తుషార్కంటి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబేంద్ర నాథ్ రాయ్ తోపాటు పలువురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రధానకార్యదర్శి కైలాస్ విజయవర్గియ, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కమలం పార్టీలో చేరారు. బెంగాల్ లో అధినేత్రి మమత నేతృత్వంలోని టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేర్చడంలో ముకుల్ రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ తాజా ఫలితాల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ సుమారు రెండు పదుల స్థానాలు కైవశం చేసుకోవడంలో ఆయన తీవ్రంగా కృషి చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మమత 2011లో పాలనాపగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి టీఎంసీకి ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీకి 34 స్థానాలు దక్కగా ఈసారి 22 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ రాష్ట్రంలో 2 స్థానాల నుంచి 18 స్థానాలకు ఎగబాకింది.

Chandrababu participates in ntr`s birth anniversary programme



ఘనంగా ఎన్టీయార్ 97వ జయంతి వేడుకలు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు 97వ జయంతి వేడుకలు మంగళవారం(మే28) ఘనంగా జరిగాయి. ఆయన మనవళ్లు సినీ నటులు కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీయార్ లు ఈ ఉదయం 6కే హైదరాబాద్ లోని ఎన్టీయార్ ఘాట్ కు వెళ్లి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఎన్టీయార్, కల్యాణ్ రామ్ లు తాతతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుంటూరు పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ `నా ప్రాణసమానులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాభివందనాలు`... మన కుటుంబ పెద్ద  ఎన్టీయార్ తనకేదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఆంధ్రుల ఆత్మగౌరవం, సమాజంలో చైతన్యం కోసమే వచ్చారన్నారు. ఆయన కూడా రాజకీయాల్లో అనేక ఒడుదొడుకులు ఎదుర్కొని ఎదురు నిలిచారని చెప్పారు. ఎన్టీయార్ తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రగా నిలిచిపోయారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పరిపాలించారని ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజకీయాల్లో గెలుపొటములు సహజమని నిరంతరం ప్రజాశ్రేయస్సుకే ముందుకు సాగుదామని చెప్పారు.

Monday, May 27, 2019

Pak SC makes history by hearing case via e-Court



పాక్ సుప్రీంకోర్టు లో తొలిసారి ఈ-కోర్టు కేసు విచారణ
పాకిస్థాన్ న్యాయ వ్యవస్థ చరిత్రలో సోమవారం (మే27) కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ఆ దేశ సుప్రీంకోర్టు తొలిసారిగా ఈ-కోర్టు పద్ధతిలో కేసు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలో జస్టిస్ తారిఖ్ మసూద్, జస్టిస్ మజర్ అలాం ఖాన్ మయిన్ఖేల్ లతో కూడిన ఇస్లామాబాద్ లోగల సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వినూత్న ప్రయోగానికి తెరతీసింది. సుప్రీంకోర్టు కరాచీ రిజిస్ట్రీ నుంచి న్యాయవాది ఆన్ లైన్ లో కేసును సుప్రీం ధర్మాసనం ముందుంచారు. సుప్రీంకోర్టు హాల్ లో కంప్యూటర్ కు అనుసంధానం చేసిన వీడియో లింక్ ద్వారా విచారణ కొనసాగించారు. ఈ సౌకర్యంతో పలువురు న్యాయవాదులు, కక్షిదారులూ లబ్ధి పొందగలరని భావిస్తున్నారు. విలువైన సమయం, ధనం కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా పదవిలోకి వచ్చిన ఖోసా జనవరిలోనే కొండల్లా పేరుకున్న కేసులు, విచారణ జాప్యాలను త్వరలో నివారించాల్సి ఉందని పేర్కొన్నారు. సంస్థాగతంగా ఓ క్రమపద్ధతిలో కేసుల విచారణ పురోగతి సాధించాలని అభిప్రాయపడ్డారు. అనవసర ఆలస్యాల నివారణ, వ్యాజ్యాల కుదింపు, పనిభారం తగ్గింపు దిశగా ముందడుగు వేయాలని చీఫ్ జస్టిస్ ఖోసా పేర్కొన్నారు. పాత, కొత్త కేసుల విచారణను ఎటువంటి జాప్యం లేకుండా ఇకపై ఈ-కోర్టు ద్వారా చకచకా నిర్వహించే వీలుకల్గుతుందని పాక్ న్యాయవ్యవస్థ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

Sunday, May 26, 2019

teenager held for allegedly stalking assaulting Russian tourist in goa



రష్యా యువతిని వేధించిన కేసులో మహారాష్ట్ర యువకుడి అరెస్ట్
భారత్ పర్యటనకు వచ్చిన ఓ రష్యా యువతిని వేధించిన 19ఏళ్ల కుర్రాడిని ఆదివారం(మే26) మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర గోవాలోని నగోవా గ్రామానికి వచ్చిపోతుండే అశ్పక్ ముజావర్ అనే యువకుడి మే15న అక్కడ ఓ రష్యా యువతి వెంటపడి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఆమె అతణ్ని నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతను తనను వేధించడంతో పాటు చెంపదెబ్బ కొట్టాడని ఆమె వివరించినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు జరిపేందుకు వారు నిరాకరించారు. జరిగిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియో ఆమె వద్ద ఉండడంతో దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో మహారాష్ట్ర పోలీసులు గుర్తించి అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.