గౌతంరెడ్డికి ఏపీ అసెంబ్లీ ఘన నివాళి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ దివంగత మంత్రి
మేకపాటి గౌతం రెడ్డికి సంతాపం ప్రకటించింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి
వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్వయంగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి
అనిల్ మాట్లాడుతూ గౌతం రెడ్డి హఠాన్మరణం వై.ఎస్.ఆర్.సి.పి కి తమకు తీరని లోటని పేర్కొన్నారు.
ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు. 2010
నుంచి తాము సన్నిహితంగా మెలిగామంటూ వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్
రెడ్డి అకాల మరణంతో దిగ్ర్భాంతి చెందినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
ఒక సమర్థ మంత్రిని రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందంటూ బాధపడ్డారు. మంత్రులు పెద్దిరెడ్డి, బాలినేని
శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ ఎప్పుడూ నవ్వుతూ పలకరించే వారని గుర్తు చేసుకున్నారు.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా గౌతమ్ రెడ్డితో తమ అనుబంధాన్ని
ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సంగం బ్యారేజీకి గౌతం పేరు
సంతాప తీర్మానం సందర్భంగా మాట్లాడుతూ సీఎం జగన్ సంగం బ్యారేజీకి గౌతంరెడ్డి పేరు పెడతామన్నారు. ఆయన హఠాన్మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం అని సీఎం చెప్పారు. గౌతం చిరస్థాయిగా జిల్లా ప్రజల హృదయాల్లో నిలిచిపోయే విధంగా చేస్తామన్నారు. మరో ఆరు వారాల్లో పూర్తికానున్నసంగం బ్యారేజీకి `మేకపాటి గౌతం సంగం బ్యారేజీ`గా నామకరణం చేయనున్నట్లు తెలిపారు.