ఇటలీ మహిళకు ఒకేసారి ఆరుడోసుల వ్యాక్సిన్
ఆమె అదృష్టం బాగుండి బతికి బట్టకట్టింది. కరోనా మహమ్మారి బెడద నుంచి తప్పించుకోవడానికని వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్తే ఆరుడోసుల్ని ఒకేసారి ఎక్కించేశారు. ఈ ఘటన ఇటలీలో ఆదివారం జరిగింది. ఓ నర్సు ఒత్తిడిలో ఉందో.. ఏమరుపాటు గానో వ్యాక్సిన్ వేసింది. తర్వాత వైల్ ను పరిశీలించగా ఖాళీగా ఉంది. పక్కన 5 ఖాళీ సిరంజీలు దర్శనమిచ్చాయి. అప్పటికి గానీ ఆ నర్సుకు జరిగిన తప్పిదం తెలిసిరాలేదు. అంటే వైల్ లో ఉన్న ఫైజర్ వ్యాక్సిన్ ఆరు డోసుల్ని ఒకే సిరంజిలో లోడ్ చేసి మహిళకు ఇంజెక్ట్ చేసింది. పొరపాటు తెలుసుకున్న నర్సు వెంటనే ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వ్యాక్సిన్ తీసుకున్న మహిళను వెంటనే ఇన్ పెషెంట్ గా చేర్చుకుని వైద్యం అందించారు. ఆమె ఆరోగ్యం 24 గంటల తర్వాత కుదుటపడ్డంతో వైద్య సిబ్బంది, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు వారాల పాటు ఆ మహిళ ఆరోగ్య పరిస్థితిని గమనించడానికి ప్రత్యేక వైద్యుల్ని నియమించారు. ఫైజర్ వ్యాక్సిన్ అధిక మోతాదును పరీక్షించడానికి మునుపటి అధ్యయనాలు నాలుగు మోతాదులకే పరిమితం చేయబడ్డాయి. అంతకన్నా ఎక్కువ మోతాదులో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇజ్రాయిల్ లో నిషేధం. ఇటువంటి ఘటనే ఈ ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నర్సు ఇదేవిధంగా ఓ వృద్ధ మహిళకు కొవీషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల్ని ఒకేసారి ఇచ్చింది. సదరు నర్సు సెల్ ఫోన్ మెసేజ్ లు చూసుకుంటూ ఓ డోసు తీసుకుని అక్కడే కూర్చున్న మహిళకు మరో డోసు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే ఆ మహిళకు ఎటువంటి అనారోగ్యం కల్గకపోవడంతో అక్కడ వైద్యసిబ్బంది హమ్మయ్య అనుకున్నారు.